
రప్రయివేటు బస్సు బోల్తా
● పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు
కామారెడ్డి క్రైం: కోతకు గురైన రోడ్డు కారణంగా ఓ ప్రయివేటు బస్సు బోల్తా పడి పలువురికి గాయాలైన ఘటన జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దాదాపు 30 మంది ప్రయాణికులతో నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు సిరిసిల్లా రోడ్ ప్రాంతంలోకి రాగానే జాతీయ రహదారిపై అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పట్టణంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, బస్సు అదుపుతప్పిన ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కోతకు గురైంది. మరమ్మతు పనులు పకడ్బందీగా చేపట్టకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సు వేగం తక్కువగా ఉండడంతో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.