
వేర్వేరు చోట్ల ముగ్గురి ఆత్మహత్య
భార్య కాపురానికి రావడం లేదని..
భిక్కనూరు: బీబీపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన గోర్కంటి స్వామి (26)కి మల్లుపల్లి గ్రామానికి చెందిన శిరీషతో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. ఏడాది క్రితం ఇద్దరి మధ్య తగాదాలు కావడంతో శిరీష తల్లిగారింటి వద్దే ఉంటోంది. అప్పటి నుంచి స్వామి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. సోమవారం వేకువజామున భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి వచ్చిన స్వామి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
అనారోగ్యంతో..
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన చల్ల సాయితేజ(23) రెండు సంవత్సరాలుగా మద్యానికి బానిసయ్యాడు. అతను ఫిట్స్‌తో బాధపడేవాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకొని బలవన్మరణం చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు వివరించారు.
జీవితంపై విరక్తితో..
రెంజల్(బోధన్): రెంజల్ మండల కేంద్రానికి చెందిన సింగ సాయిలు(41) జీవితంపై విరక్తి చెంది సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. మార్చి నెలలో అతని భార్య మృతి చెందడంతో మానసికంగా వేదనకు గురైన సాయిలు అద్దె ఇంట్లో ఉన్న గిరకబావిలో పడి బలవన్మరణం చెందినట్లు వివరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించామన్నారు.
ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య కాపురానికి రావడం లేదని ఒకరు, జీవితంపై విరక్తితో మరొకరు, అనారోగ్య కారణంతో ఇంకొకరు బలవన్మరణం చెందారు.

వేర్వేరు చోట్ల ముగ్గురి ఆత్మహత్య