ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ ఏదీ? | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ ఏదీ?

Oct 8 2025 6:55 AM | Updated on Oct 8 2025 6:55 AM

ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ ఏదీ?

ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ ఏదీ?

ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ ఏదీ?

గతంలో ప్రతి జీపీ పరిధిలో

కలెక్షన్‌ యూనిట్ల ఏర్పాటు

అధికారుల నిర్లక్ష్యంతో

కనుమరుగైన వైనం

మోర్తాడ్‌(బాల్కొండ): పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామాల్లోని ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించేందుకు గతంలో ప్రతి జీపీ పరిధిలో సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం కనుమరుగయ్యాయి. దీంతో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇతర చెత్తతోపాటు కలిసిపోతుండటంతో పర్యావరణానికి ముప్పు పొంచి ఉంటుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రీసైక్లింగ్‌ కోసం..

ఎన్నో రకాల ప్లాస్టిక్‌ సామగ్రిని, వ్యర్థాలను పడవేసే బదులు రీసైక్లింగ్‌ చేసి ప్రజలకు అవసరమైన సామగ్రిని తయారు చేయాలని గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయం కార్యరూపం దాల్చలేదు. ప్లాస్టిక్‌ కవర్లు, డబ్బాలు, ఇతర సామగ్రిని సేకరించి అందులో రీసైక్లింగ్‌కు అవసరమైన సామగ్రిని ఆ సెంటర్లకు పంపించాలని స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద నిర్ణయం తీసుకున్నారు.ఇందుకోసం 2019లో మన ఊరు(పట్టణం)–మన ప్రణాళిక కార్యక్రమంను అప్పటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగానే రీ–సైక్లింగ్‌కు అవకాశం ఉన్న ప్లాస్టిక్‌ సామగ్రిని పంచాయతీలలో సేకరించడానికి ప్రత్యేక యూనిట్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో సేకరించిన ప్లాస్టిక్‌ సామగ్రిని వారం, పది రోజులకు ఒకసారి జిల్లాకేంద్రానికి తరలించి అక్కడి నుంచి రీసైక్లింగ్‌ సెంటర్‌లకు చేరవేయాలని నిర్ణయించారు. ఆరంభంలో కొన్ని రోజుల పాటు ప్లాస్టిక్‌ సామగ్రి సేకరణ కొనసాగింది. మళ్లీ ఈ కార్యక్రమం ముందుకు సాగలేదు. దీంతో అనేక పంచాయతీలలో ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రాలు మరుగునపడిపోయాయి. సేకరించిన ప్లాస్టిక్‌ సామగ్రిని తరలించడానికి దారులు మూసుకపోవడంతో మంచి కార్యక్రమానికి మంగళం పలికినట్లు అయ్యింది.

ప్రభుత్వం దృష్టిసారిస్తేనే..

ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రాలు కనుమరుగైన తర్వాత చెత్తలోనే ప్లాస్టిక్‌ వ్యర్థాలను ప్రజలు విడచిపెడుతున్నారు. ఫలితంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డంపింగ్‌ యార్డులలో కార్మికులకు రెండింతల పని భారం పెరిగింది. తడి చెత్తను వేరుగా, పొడి చెత్తను వేరు చేయడంతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలను గుర్తించి వాటిని రీ సైక్లింగ్‌ కోసం ఉంచుతున్నారు. గతంలో ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రాలను ప్రత్యేకంగా నిర్వహించడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు పని భారం తప్పింది. ఇప్పుడు ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రాలను పునరుద్దరిస్తే మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు వృథాగా పారవేయకుండా రీసైక్లింగ్‌ చేయడం వల్ల పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసే అంశంపై దృష్టిసారించి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement