
పంట దిగుబడులపై వరుణుడి ప్రతాపం
● తరచూ కురుస్తున్న వర్షాలకు
తడుస్తున్న మక్క, సోయ పంటలు
● ఆరబెట్టడానికి తీవ్రంగా
శ్రమిస్తున్న అన్నదాతలు
బాల్కొండ: ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలపై వరుణుడు ప్రతాపం చూపడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగు చేసిన పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలు కురుస్తుండటంతో పంట దిగుబడులు తడిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో పంటలను ఆరబెట్టడానికి అన్నదాతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మూడు రోజులుగా ఉదయం, సాయంత్రం, రాత్రి అంటూ తేడా లేకుండ వర్షం కురుస్తుండటంతో నూర్పిళ్లు చేసి రోడ్లపై ఆరబెట్టిన మక్కలు, సోయలు ఆరడం లేదు. కుప్పలు తీయడం , మళ్లీ కుప్పలు చేయడం కోసం రోజంతా రైతులు వారి రెక్కలను ముక్కలు చేసుకుంటున్నారు. దీనికి తోడు పంట దిగుబడులు ముక్కిపోతున్నాయి. సోయాలు కోత కోయాకముందే మొక్కలపైనే మొలకెత్తుతున్నాయి. ఇంత కష్టం చేసినా చివరికి వ్యాపారుల చేతిలో మోసపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా మక్కలకు, సోయాలకు ధర తగ్గించారు. తడిసిన మక్కలను మరింత తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించి మక్క, సోయ రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
కొత్తపల్లిలో వర్షానికి తడిసిన మక్కలు
మక్కలు, సోయాలు ఆరబెడుతామంటే రోజూ వాన పడుతుంది. ఆరబెట్టుడు.. కుప్పలు చేసుడుకే రెక్కలు పోతున్నాయి. తడిసిన మక్కలు, సోయాలు అంటూ వ్యాపారులు ధరను తగ్గిస్తున్నారు. ఎంత కష్టం చేసిన ఫలం దక్కడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. – చిల్కన్న, రైతు, బాల్కొండ

పంట దిగుబడులపై వరుణుడి ప్రతాపం

పంట దిగుబడులపై వరుణుడి ప్రతాపం

పంట దిగుబడులపై వరుణుడి ప్రతాపం