
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● నగరంలోని దుబ్బ ప్రాంతంలో
ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో శనివారం ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయి లో పరిశీలించారు. పునాది దశ వరకు నిర్మాణ పను లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులను కలిసి, వారికి మొదటి విడత బిల్లు మంజూరు అయ్యిందా అని ఆరా తీశారు. పనులు ప్రారంభించని లబ్ధిదారుల తో మాట్లాడి, కారణాలు అడిగి తెలుసుకున్నారు. ల బ్ధిదారుల ఎంపిక, మంజూరు ప్రక్రియలలో జాప్యానికి తావు లేకుండా చూడాలన్నారు. ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ కింద రుణం అందించేలా చొరవ చూపాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఏమైన ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని, నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తాను తదుపరి తనిఖీలు జరిపే సమయానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా అంకిత భావంతో కృషి చేయాలన్నారు. అనంతరం దుబ్బ ప్రాంతంలోని అభయహస్తం కాలనీని కలెక్టర్ సందర్శించారు. ప్రభుత్వ అసైన్‌డ్ భూమిని పరిశీలించి, హద్దులను నిర్ధారించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, డీఈ నివర్తి, మున్సిపల్ టౌన్ ప్రాజెక్టు అధికారి రమేష్, నార్త్ తహసీల్దార్ విజయ్ కాంత్ ఉన్నారు.