
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
● సీపీ సాయి చైతన్య
● కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ
కమ్మర్‌పల్లి: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కమ్మర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోలీస్ ఇమేజ్ పెంచేలా సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వర్తించాలన్నారు. స్థానిక ఎన్నికలు సజావుగా జరగడానికి కావాల్సిన అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను చేసుకోవాలన్నారు. గత ఎన్నికల్లో చెడు నడత కలిగిన వారిని బైండోవర్ చేయాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లు, లోకేషన్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌ను తప్పనిసరిగా సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలన్నారు.
ప్రజలతో మమేకం కావాలి..
పోలీస్‌స్టేషన్ చుట్టుపక్కల బ్యారక్‌లను పరిశీలించారు. వివిధ రకాల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చే యాలని ఎస్సైకి సూచించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ ప్రజలతో మమేకమై గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. కమ్మర్‌పల్లి పోలీస్‌స్టేషన్ జిల్లా సరిహద్దులో ఉన్నందున రాకపోకలపై నిఘా వ్యవస్థ పటిష్ట పరచాలన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్, సైబర్ మోసాల బారినపడకుండా అవగాహన కల్పించాలన్నారు. సీపీ వెంట భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై అనిల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.