
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
నవీపేట: గోదావరి నదితీర ప్రాంత రైతులకు ప్రభు త్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని న్యాయవాది, రిటైర్డు డీఎస్పీ మనోహర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఆర్‌ఆర్ గార్డెన్‌లో ఆదివారం నిజామాబాద్, నిర్మల్ ఉమ్మడి జిల్లాల ఎస్సారెస్పీ ముంపు ప్రాంత రైతుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నందిపేట మండలంలోని ఉమ్మెడలో నిర్మించిన బ్రిడ్జి కింద ఏటవాలు కాకుండా కట్టలు రూపంలో నిర్మాణం చేపట్టారని, దీంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు నదితీరంలోని పంట పొలాలు, నివాసిత గ్రామాలకు చేరుతున్నాయన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంపై హైకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గోదావరిలో పేరుకుపోయిన పూడికను తొలిగించేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ముంపు ప్రాంత గ్రామాలు, రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.