
కళామతల్లి సేవే లక్ష్యంగా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జీవితాంతం కళా మతల్లికి సేవ చేసేందుకు నిర్ణయించుకొని కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తూ ముందుకు వెళుతున్నారు ఇందూరుకు చెందిన బంటు సుకన్య. చిన్నప్పటి నుంచే నాట్యం నేర్చుకుంటూ వచ్చిన సుకన్య.. వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాక మరో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టా రు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల యం నుంచి నాట్యంలో మాస్టర్ డిగ్రీ చేశారు. ఆంధ్రనాట్యంలో డిప్లొమా కోర్సు చేశారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివిన సుకన్యకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే అవకాశం వచ్చినప్పటికీ నాట్యం మీద ప్రేమ, నాట్యాన్ని మరింత మందికి అందించాలనే తన గురువు టంగుటూరి భీమన్న సూచనల మేరకు జీవితాంతం నాట్యంలో శిక్షణ ఇచ్చేందుకు నిశ్చయించుకున్నారు. నగరంలోని వినాయక్‌నగర్, సుభాష్‌నగర్‌లలో శ్రీ నటరాజ నృత్య తరంగిణి నాట్యాలయం ఏర్పాటు చేసి కూచిపూడిలో శిక్షణ ఇస్తున్నారు. సుకన్య వద్ద చిన్నారులతోపాటు డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు, వివాహమై పిల్లలు ఉన్నవారు సైతం శిక్షణ తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లోనూ శిక్షణ ఇస్తున్నారు.
● సుకన్య రెండో తరగతిలోనే ప్రముఖ నాట్యాచార్యులు టంగుటూరి భీమన్న వద్ద ఆంధ్రనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు నేర్చుకున్నారు. పదోతరగతి నుంచి నాట్యాచార్యులు దేవులపల్లి ప్రశాంత్ వద్ద కూచిపూడి నేర్చుకున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, లక్నో తదితర రాష్ట్రాలతోపాటు శ్రీలంక, థాయ్‌లాండ్, మారిషస్ దేశాల్లో వందల సంఖ్యలో కూచిపూడి ప్రదర్శనలిచ్చారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గిన్నిస్ రికార్డు సాధించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. మహిషాసుర మర్దిని, గజేంద్ర మోక్షం, శకుంతల పరిణయం, సృష్టిబాలయ, శివలీలలు సృత్యరూపకాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. అనేక బహుమతులు సాధించారు. మరోవైపు వివిధ రకాల దేవుడి భజన పాటలకు అప్పటికప్పుడే నృత్యం కంపోజ్ చేసి అనేక మందికి నేర్పుతున్నారు. మూడో తరగతి చదువుతున్న తన కుమార్తె అభ్యశ్రీకి సైతం నృత్యం నేర్పుతున్నారు. కాగా, సుకన్య అక్కలు లావణ్య, చైతన్య యోగా మాస్టర్లుగా వేలాదిమందికి శిక్షణ ఇస్తున్నారు. వీరి తండ్రి యోగారత్న ఎక్కొండ ప్రభాకర్ ప్రోత్సాహంతో ముందుకు వెళుతున్నామని చెబుతున్నారు.
గురువు కోరిక మేరకు..
కళను బతికించడం, భావితరాలకు అందించడంలో మనవంతు పాత్ర నిబద్ధతతో పోషించాలని మా గురువు టంగుటూరి భీమన్న చెప్పారు. ఆయన కోరిక మేరకు జీవితాంతం నాట్యంలో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నా. కూచిపూడిలో పీహెచ్‌డీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. సనాతన భారతీయ కళను మరింతమందికి పంచేందుకు భగవంతుడు ఈ అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా.– సుకన్య
సాఫ్ట్‌వేర్ ఉద్యోగావకాశాలు
వదులుకొని కూచిపూడి
శిక్షణ ఇస్తున్న సుకన్య
వివిధ రాష్ట్రాలు, దేశాల్లో అనేక
ప్రదర్శనలిచ్చిన నాట్యాచారిణి
గురువు సూచనల మేరకు జీవితకాలం శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయం

కళామతల్లి సేవే లక్ష్యంగా..

కళామతల్లి సేవే లక్ష్యంగా..

కళామతల్లి సేవే లక్ష్యంగా..