
రేపు ‘ప్రజావాణి’ రద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని అనివార్య కారణాలతో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయం గమనించి కలెక్టరేట్‌లో అర్జీలు సమర్పించేందుకు ఎవరూ రావొద్దని కోరారు.
తిరుగు ప్రయాణంలో ప్రత్యేక బస్సులు
స్టేషన్ మహబూబ్‌నగర్: దసరా పండుగ తిరుగు ప్రయాణం కోసం ఆదివారం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉదయం నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
తల్లిదండ్రుల యోగక్షేమాలపై దృష్టిపెట్టాలి
పాలమూరు: వయోవృద్ధులైన తల్లిదండ్రులను వారి పిల్లలు పట్టించుకోకుండా వదిలేయడం సరికాదని, ఉమ్మడి కుటుంబంలో ఉండటానికి ఇష్టం లేక చాలామంది అనాథ శరణాలయాల్లో వదిలిపెడుతున్నారని ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి రవిశంకర్ అన్నారు. శనివారం కోయిలకొండ మండల పరిషత్ కార్యాలయంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు చట్టాలు, రైతుల సంక్షేమ పథకాలు, లీగల్ సర్వీసెస్, సీనియర్ సిటిజన్ చట్టంపై అవగాహన కల్పించారు. పిల్లలు వారి తల్లిదండ్రుల బాగోగుల పట్టించుకోవాలన్నారు. కొందరు పెద్దవారి యోగక్షేమాలపై దృష్టి పెట్టకుండా చదువుల పేరుతో ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారని, అలా కాకుండా వారి బాగోగుల గురించి కూడా బాధ్యతగా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజగణేష్, ఎంపీడీఓ ఆనంద్, రవీందర్‌నాయక్, యోగేశ్వర్‌రాజ్, చంద్రశేఖర్, తిరుపతయ్య, ఎస్‌ఐ తిరుపాజీ తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘అలయ్ బలయ్’
స్టేషన్ మహబూబ్‌నగర్: అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరు ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్‌లో దసరా ఆత్మీయ సమ్మేళనం అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు సమితి జిల్లా అధ్యక్షుడు నరేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగే కార్యక్రమంలో పార్టీలు, కులమతాలకతీతంంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
మొక్కజొన్న క్వింటాల్ రూ.2,067
జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,067, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అలాగే ఆముదాలు క్వింటాల్ రూ.5,770, వేరుశనగ గరిష్టంగా రూ.5,112, కనిష్టంగా రూ.3,151 చొప్పున పలికాయి.
● దేవరకద్ర మార్కెట్ యార్డులో శనివారం జరిగిన టెండర్లలో హంస ధాన్యం ధర క్వింటాల్ రూ.1,719 ఒకే ధర లభించింది. ప్రస్తుతం సీజన్ లేకపోవడంతో కేవలం హంస ధాన్యం మాత్రమే అమ్మకానికి వచ్చింది. మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజుల సెలవుల తర్వాత శనివారం తిరిగి లావాదేవీలు ప్రారంభించారు.