
ర్యాగింగ్, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
● భవిష్యత్ వైద్యులు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా ఉండాలి: ఎస్పీ డి.జానకి
మహబూబ్‌నగర్ క్రైం: భవిష్యత్ సమాజానికి సేవ చేయబోయే వైద్యులు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా ఉండాలని ఎస్పీ డి.జానకి సూచించారు. పాలమూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు సోమవారం మెడికల్ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్, మాదక ద్రవ్యాలపై మెడికోలకు ప్రత్యేక అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, అలవాట్లపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే సందర్భాల్లో తప్పక హెల్మెట్ ధరించాలన్నారు. విద్యార్థి దశలో ఉన్న వారు డ్రగ్స్, గంజాయి వంటి వాటికి అలవాటుపడటం ఓ తప్పుడు నిర్ణయం అవుతుందని, దీని వల్ల జీవితాన్ని చీకటిలోకి నెట్టుకోవడమేనని తెలిపారు. ర్యాగింగ్, నేరాలకు చాలా దూరంగా ఉండాలని, కేవలం లక్ష్యం వైపు మాత్రమే సాగాలన్నారు. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడం తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే మీ భవిష్యత్‌కు సమస్యలు వస్తాయని హెచ్చరించారు. స్నేహపూర్వకంగా జూనియర్స్‌ను ప్రోత్సాహించాలని.. భయపెట్టడం, అవమానించడం, హింసించడం వంటి చర్యలకు పాల్పడవద్దని తెలిపారు. జూనియర్లు సైతం ప్రతి చర్య ర్యాగింగ్‌గా భావించరాదని, ఒకవేళ మితిమీరిన ప్రవర్తన ఎదురైతే వెంటనే డయల్ 100కు లేదా కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా, ప్రొఫెసర్లు డాక్టర్ సునందిని, కిరణ్మయి, సీఐలు గాంధీ నాయక్, శ్రీనివాసులు, ఎస్‌ఐ రాఘవేందర్, షీటీం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫిర్యాదులపై సకాలంలోస్పందించాలి
బాధితులు ఇచ్చే ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించడమే పోలీసుల బాధ్యత అని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పదిమంది బాధితులతో ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ సమస్యను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులు పరిష్కారం అయ్యే వరకు వాటిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లలో పారదర్శకమైన సేవలు అందించడానికి నిరంతరం కృషి చేయాలన్నారు.