
కనిపించని ‘టెండర్ల’ జోరు
● మద్యం దుకాణాల కోసంఇప్పటి వరకు 27 దరఖాస్తులు
● వనపర్తి, గద్వాల జిల్లాల్లోదాఖలు కాని వైనం
మహబూబ్‌నగర్ క్రైం: సాధారణంగా మద్యం దుకాణాలు అంటే విపరీతమైన డిమాండ్‌తో పాటు వ్యాపారుల మధ్య పోటీ ఉంటుంది. కానీ ఈసారి మద్యం వ్యాపారులు టెండర్లు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 227 మద్యం దుకాణాలకు టెండర్ల జోరు పెరగడం లేదు. కొత్త దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై పది రోజులు దాటినా.. వ్యాపారులు ఇంకా టెండర్లు వేయడానికి ముందుకు రావడం లేదు. మరి టెండర్ ఫీజు పెంచడం కారణమా? లేక చివరి వారం రోజుల కోసం ఎదురుచూస్తున్నారో అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 18 వరకు టెండర్లు వేయడానికి అవకాశం ఉంది. మంచి ముహూర్తం చూసుకొని టెండర్లు వేయాలని కొందరు వ్యాపారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. సోమవారం మహబూబ్‌నగర్‌లో ఒకటి, నాగర్‌కర్నూల్ జిల్లాలో 11 టెండర్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు నాగర్‌కర్నూల్ జిల్లాలో 21, మహబూబ్‌నగర్‌లో 5, నారాయణపేటలో ఒక దరఖాస్తుతో కలిపి మొత్తం 27 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు టెండర్ల ఖాతా ప్రారంభం కాలేదు.