ఓటరు జాబితాపంపిణీకి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితాపంపిణీకి సిద్ధం

Oct 7 2025 4:11 AM | Updated on Oct 7 2025 4:11 AM

ఓటరు జాబితాపంపిణీకి సిద్ధం

ఓటరు జాబితాపంపిణీకి సిద్ధం

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ఇప్పటికే ఇచ్చింది. ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్‌ రానుండడంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి తొమ్మిది పార్టీలకు మాత్రమే గుర్తింపు దక్కింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా బరిలో నిలిచే ఆయా పార్టీల అభ్యర్థులకు పార్టీలు బీ ఫాంలు అందిస్తాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన పార్టీలకు స్థానిక ఓటర్ల జాబితాను ముద్రించి అందించేందుకు జిల్లా పరిషత్‌ అధికారులు ఈనెల 6వ తేదీ నుంచి చర్యలు చేపట్టారు. పార్టీల జిల్లా అధ్యక్షులకు ఒక సెట్‌ జాబితా ఇవ్వనున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, వైఎస్‌ఆర్‌సీపీ, ఎంఐఎం, టీడీపీకి మాత్రమే ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు ఉంది. బీ ఫారాలు అందుకున్న వారికి ఆయా పార్టీల గుర్తులను కేటాయిస్తారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారికి ఇతర గుర్తులను కేటాయిస్తారు.

టన్ను చెరుకుకు రూ.6 వేల ధర ఇవ్వాలి

అమరచింత: కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌ పత్తికి రూ.7వేల మద్దతు ధర ఇచ్చినట్లుగానే టన్ను చెరుకుకు రూ.6 వేల మద్దతు ధర ప్రకటించాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్‌ చేశారు. దీంతో పాటు ఈ సంవత్సరం చెరుకు రైతులకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ ఇస్తున్న సబ్సిడీలను వచ్చే ఏడాది కూడా వర్తింపచేయాలని కోరారు. చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం రైతులతో కలిసి ఫ్యాక్టరీ జీఎం వీపీ రామరాజుకు వినతిపత్రం అందించారు. అనంతరం ఫ్యాక్టరీ సిబ్బందితో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సంఘం వినతి మేరకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం గతేడాది నుంచి చెరుకు రైతులకు పంటలపై సబ్సిడీలను అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలను 2026–2027 సీజన్‌లో కూడా వర్తింపచేయాల్సిన అవసరం ఉందన్నారు. పెరిగిన ధరల ప్రకారం కంపెనీ ఇస్తున్న బోనస్‌తో కలిపి టన్ను చెరుకుకు రూ.ఆరు వేల మద్దతు ధరను ఇవ్వాలన్నారు. రైతు సమస్యలను పరిష్కరిస్తామని, సబ్సిడీలను వచ్చే సంవత్సరం కూడా కొనసాగిస్తామని ఫ్యాక్టరీ జీఎం హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు వాసారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణ, రాజశేఖర్‌, చంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, శాలిమియా, మహేంద్రచారి, వీరన్న, రవి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement