
ముప్పు.. తొలగింపు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాకేంద్రంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఆ శాఖ అధికారులు నివారణ చర్యలు చేపడుతున్నారు. పట్టణ విద్యుత్ శాఖ ఏడీ తౌర్యానాయక్ పర్యవేక్షణలో భూమికి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో ఎత్తు స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకేంద్రంలో చాలాచోట్ల తక్కువ ఎత్తులో విద్యుత్ స్తంభాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన చౌరస్తాలు, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్తంభాలు తక్కువ ఎత్తులో ఉండడాన్ని విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండడంతో ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఇలాంటి వాటిని గుర్తించి వెంటనే వాటి స్థానాల్లో ఎక్కువ ఎత్తు స్తంభాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో మొత్తం 67 తక్కువ ఎత్తులో (8 మీటర్ల ఎత్తు స్తంభాలు) ఉన్నట్లు విద్యుత్‌శాఖ పట్టణ ఏడీ తౌర్యానాయక్ తెలిపారు. ఈ మేరకు వాటి స్థానంలో 11 మీటర్ల ఎత్తు గల పెద్ద స్తంభాలను ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే 57 స్తంభాలు మార్చామని పేర్కొన్నారు. మిగతా వాటిని సైతం రెండు, మూడు రోజుల్లో పూర్తిచేస్తామన్నారు.
విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
భూమికి తక్కువ ఎత్తులో ఉన్నవాటి స్థానంలో ఎత్తు స్తంభాల ఏర్పాటు
జిల్లాకేంద్రంలో ఇప్పటికే 57 పోల్స్ మార్పు