
దసరా కిక్..!
● జిల్లావ్యాప్తంగా
గణనీయంగా మద్యం అమ్మకాలు
● భారీగా మటన్ విక్రయాలు,
అమాంతం ధరలు పెంచిన వ్యాపారులు
మహబూబ్‌నగర్ క్రైం: దసరా కర్రీ పండగ అంటేనే చుక్క.. ముక్క ఉండాల్సిందే. ఈ క్రమంలోనే మద్యం విక్రయాలు భారీ మొత్తంలో జరిగాయి. దసరా రోజు మద్యం దుకాణాలు బంద్ ఉన్న క్రమంలో మందుబాబులు శుక్రవారం ఉదయం నుంచే లిక్కర్ దుకాణాల దగ్గర క్యూ కట్టారు. ఒకవైపు అందుబాటులో ఉన్న మద్యంతో దుకాణాలతోపాటు బార్లు, బెల్ట్ దుకాణాల్లో సైతం భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రధానంగా కర్రీ నేపథ్యంలో పల్లెల్లోని బెల్ట్ దుకాణాల్లో ఒక్కో బాటిల్‌పై రూ.10– 20 వరకు అధికంగా తీసుకుంటూ అమ్మకాలు నిర్వహించారు. చాలా వరకు మందుబాబులు పట్టణంలో ఉన్న పలు దుకాణాల్లో కొనుగోలు చేయడం కనిపించింది. వారం రోజుల వ్యవఽ దిలో ఉమ్మడి జిల్లాలో రూ.వంద కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం.
నచ్చిన విధంగా ధరలు..
కర్రీ పండగ నేపథ్యంలో వ్యాపారులు నగరంలో మటన్ ధరలు పెంచేశారు. కొన్నిచోట్ల కిలో రూ.850 విక్రయిస్తే మరి కొన్నిచోట్ల రూ.900 వరకు విక్రయాలు జరిపారు. ఇక నాటుకోడి కిలో రూ.వెయ్యికి లభ్యం కాగా చికెన్ ధరలు కొంత ఇబ్బందికరంగానే అనిపించాయి. అతి పెద్ద పండగ నేపథ్యంలో మటన్ వ్యాపారులు వాళ్లకు నచ్చిన విధంగా ధరలు పెంచి విక్రయాలు జరిపారు. మధ్య తరగతి వారితోపాటు సామాన్యులు అధిక మొత్తంలో కొనుగోలు చేయలేక అవస్థలు పడ్డారు. అయితే కొంతమంది దావత్‌లు చేసుకోవడానికి ప్రత్యేకంగా మేకలు, పొట్టేళ్లను కొనుగోలు చేసి వేడుకలు జరుపుకొన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు, పల్లెలు, తండాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి కనిపించింది. ఈసారి బరిలోకి దిగాలని భావించే ఆశావహులు అక్కడక్కడ ప్రత్యేకంగా దావత్‌లు ఏర్పాటు చేశారు. కొన్ని కుటుంబాల వారైతే సొంత వ్యవసాయ క్షేత్రాల్లో కుటుంబాలతో కలిసి భోజనాలు చేసి సందడిగా గడిపారు.