
‘అక్రమ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీపై పోరాటం’
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా బ్యాక్‌లాగ్ ఉద్యోగులను భర్తీ చేస్తున్నారని.. ఆ అక్రమ భర్తీపై నిరుద్యోగ రక్షణ జేఏసీ పోరాటం చేస్తుందని తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మహిపాల్‌యాదవ్ హెచ్చరించారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ పోస్టులను కొంతమంది ఆయా శాఖ ఉన్నాధికారులు అక్రంగా నియామించారని, ఆ నియామకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ పోరాటంతో అక్రమ నియామకాల ప్రక్రియ ప్రస్తుతానికి నిలిపివేశారన్నారు. అక్రమ నియామకాలతో నిజమైన నిరుద్యోగులు నష్టపోతున్నారని, వారి తరఫున తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతితో రాష్ట్రం అథోగతి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దొడ్డిదారిలో నియామకాలను అడ్డుకుని నిరుద్యోగులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్న తనపై బెదిరింపులకు దిగుతున్నారని, ఆ బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా నిరుద్యోగ పక్షాన నిలబడి పోరాటం చేస్తానన్నారు. అక్రమ నియామకాలను ఆపే వరకు జేఏసీ పోరాటం ఆపదన్నారు. అక్రమ నియామకాలపై ప్రభుత్వం స్పందించి వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ నాయకులు రామకృష్ణ, మహేశ్, నరేందర్, ఆంజనేయులు, రాజు పాల్గొన్నారు.