
ఎన్నికలు సవ్యంగా నిర్వహిద్దాం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో పంచాయతీల ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో 127 జీపీలు, 1,130 వార్డులు, రెండో విడతలో 157 జీపీలు, 1,356 వార్డులు, మూడో విడతలో 139 జీపీలు, 1,188 వార్డులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో 89 ఎంపీటీసీ, 8 జెడ్పీటీసీ, రెండో విడతలో 86 ఎంపీటీసీ, 8 జెడ్పీటీసీ స్థానాలకు ఉంటాయన్నారు. ఎన్నికలపై ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు శిక్షణ ఇచ్చామని, బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సిబ్బందికి సరిపడా ఉన్నారన్నారు. సమావేశంలో ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఏఎస్పీ రత్నం, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, డీపీఓ పార్థసారధి, ఆర్డీఓ నవీన్, డీఈఓ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా కోడ్ అమలు..
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున తక్షణమే ఎన్నికల ప్రవర్థనా నియామవలి అమలులోకి వచ్చిందని కలెక్టర్ విజయేందిర తెలిపారు. ఎన్నికల నియామావలి తూ.చ. తప్పకుండా పాటించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఎలాంటి ప్రభుత్వ పథకాలు మంజూరు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, గ్రౌండింగ్ వంటివి చేయకూడదన్నారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు పక్కాగా పనిచేయాలన్నారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హోర్డింగ్‌లు, కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని చెప్పారు.