
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్‌స్టేషన్‌లో ఉన్న పెండింగ్ కేసులు త్వరగా విచారించి పరిష్కరించాలని ఎస్పీ జానకి అన్నారు. కోయిలకొండ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆమె తనిఖీ చేసి.. ఇటీవల నమోదైన, పెండింగ్ కేసుల ఫైల్స్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో ఓర్పుతో మాట్లాడాలని, పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెంచేలా పనిచేయాలన్నారు. స్టేషన్ శుభ్రత, రికార్డులు నిర్వహణ పద్ధతి, సిబ్బంది క్రమశిక్షణపై మరింత దృష్టి పెట్టాలన్నారు.
● జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, మూడు రోజులు అతి భారీ వర్షాలు ఉన్న క్రమంలో జిల్లావాసులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ జానకి తెలిపారు. చెక్‌డ్యాంలు, వాగులు, కాల్వలు దాటకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యుత్ తీగాలు, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని, బావి దగ్గర వ్యవసాయదారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితి వచ్చిన వెంటనే డయల్ 100 లేదా 87126 59360కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ డి.జానకి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రైతు ఉద్యమంలో ప్రత్యేక స్థానం సంపాదించారని, ఆమె స్ఫూర్తితో సమాజంలో మహిళల పాత్ర మరింత బలోపేతం కావాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సురేష్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏవో రుక్మిణీబాయి, ఎస్‌బీ సీఐ వెంకటేష్, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, సీసీ రాంరెడ్డి పాల్గొన్నారు.