
పెన్షనర్లకు రూ.30 లక్షల ప్రమాద బీమా
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పెన్షనర్లకు రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించినట్లు ఎస్‌బీఐ దక్షిణ మధ్య రైల్వేశాఖ చీఫ్ బ్రాంచ్ మేనేజర్ పాల సుకుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ ఆధ్వర్యంలో పెన్షనర్లకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా శనివారం ఎస్‌బీఐ దక్షిణ మధ్య రైల్వేబ్రాంచ్, స్టేషన్ రోడ్డు బ్రాంచ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు లాకులు సమీపంలోని ఓ హోటల్‌లో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో ఆయుష్ హాస్పిటల్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొని పెద్ద సంఖ్యలో హాజరైన పెన్షనర్లకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఎస్‌బీఐ దక్షిణ మధ్య రైల్వే, స్టేషన్ రోడ్డు బ్రాంచ్‌ల మేనేజర్లులు సుకుమార్, కోమల్ దాసరి మాట్లాడుతూ.. పెన్షనర్ల ఆరోగ్యం, ఆర్థిక భరోసాకు ఎస్‌బీఐ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పెన్షనర్ల కోసం గతంలో లేని విధంగా 78 ఏళ్లు వరకు కూడా వారి పెన్షన్‌పై రుణాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. వారికి రూ.30 లక్షల ఉచిత ప్రమాదా బీమా పథకం కూడా అందుబాటులో ఉందని వివరించారు. పెన్షనర్లు ఈ సదుపాయాలను సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది, పెన్షనర్ల సంఘ నాయకులు, పెన్షనర్లు, ఎస్‌బీఐ సిబ్బంది పాల్గొన్నారు.