
స్వచ్ఛతకు పురస్కారాల పట్టం
ఎన్టీఆర్ జిల్లాకు 8 రాష్ట్ర స్థాయి అవార్డులు పురస్కారాలను అందజేసిన సీఎం చంద్రబాబు
భవానీపురం(విజయవాడపశ్చిమ): పారిశుద్ధ్యం నిర్వహణ, పరిశుభ్రతలో ఉత్తమ ప్రతిభకు పట్టం కడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర పురస్కారాలు–2025లో ఎన్టీఆర్ జిల్లాకు 8 రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజేతలకు పురస్కారాలను అందజేశారు. మొత్తం 69 రాష్ట్ర స్థాయి పురస్కారాలలో ఎనిమిది జిల్లాకు వచ్చాయి. ప్రత్యేక కేటగిరీ అవార్డ్ (స్వచ్ఛ సర్వేక్షణ్)లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు దక్కగా, స్వచ్ఛ కాలనీల విభాగంలో విజయవాడ లోని కేపీ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు లభించింది. స్వచ్ఛ ఆస్పత్రుల విభాగంలో విజయవాడ భవానీపురంలోని హెచ్‌బీకాలనీలోగల యూపీహెచ్‌సీ, పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు అవార్డులు లభించాయి. స్వచ్ఛ అంగన్‌వాడీల విభాగంలో కేదారేశ్వరపేట–3 అంగన్‌వాడీ కేంద్రం, స్వచ్ఛ బస్ స్టేషన్ల విభాగంలో విజయవాడ బస్ స్టేషన్, స్వచ్ఛ పాఠశాలల కేటగిరీలో విజయవాడ కృష్ణ లంకలోని వీఎంఆర్‌ఆర్ (జీ) మునిసిపల్ కార్పొ రేషన్ హైస్కూల్, స్వచ్చతా ఎన్‌జీఓల కేటగిరీలో రైజ్ సంస్థ అవార్డులు సాధించగా ఆయా సంస్థలు, పాలనా యూనిట్ల ప్రతినిధులు సీఎం చంద్రబాబు చేతులమీదుగా అందుకున్నారు.
కలెక్టర్ లక్ష్మీశ అభినందనలు
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు ముంద డుగు వేస్తూ స్వచ్ఛాంధ్ర పురస్కారాల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపినందుకు అధికారులు, సిబ్బందికి కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారాల స్ఫూర్తితో జిల్లాను మరింత స్వచ్ఛత దిశగా నడిపించాలని ఆయన ఆకాంక్షించారు. మంత్రులు పి.నారాయణ, కె.పార్థసారథి, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, పలువురు అధికారులు పాల్గొన్నారు.