
అక్రమార్కులకు గేట్ వే
నిత్యం తెలంగాణకు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తరలింపు రాత్రింబవళ్లూ యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో ఇసుకకు డిమాండ్ ట్రాక్టర్‌కు రూ.8 వేల నుంచి రూ.11 వేల వరకు వసూలు చెక్‌పోస్ట్ ఉన్నా పేరుకే...
ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మల్కాపురం
ఉచిత ఇసుక పథకం పేరుతో అక్రమార్కులు తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తూ జేబులు నింపు కొంటున్నారు. రాత్రింబవళ్లూ తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. వాహనాల రణగొణ ధ్వనులతో గ్రామంలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ట్రాక్టర్ల శబ్దాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జగ్గయ్యపేట మండలం మల్కాపురం తెలంగాణ రాష్ట్రానికి సరి హద్దులో ఉండటంతో అక్రమార్కులకు గేట్ వే గా మారింది.
మల్కాపురం(జగ్గయ్యపేట): జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామంలోని మునేరులో మూడు చోట్ల ఇసుక ర్యాంపులు ఉన్నాయి. అందులో మొలకవాగు, గొల్లగుండు, శ్మశానవాటికకు వెళ్లే రహదారిలోని ఇసుక రేవులు ఉన్నాయి. అక్రమార్కులు తెలంగాణకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే మొలకవాగు, గొల్లగుండు ర్యాంపులను ఎంచుకుని ఇసుక అక్రమ రవాణాకు బాటలు వేశారు. ర్యాంపునకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉండటంతో ఇటీవల రోడ్డును గ్రావెల్‌తో అభివృద్ధి చేయడంతో పాటు మూడు చోట్ల కాలువలు ఉండే ప్రాంతాలలో తూములు ఏర్పాటు చేసి మరీ రోడ్డు నిర్మించారు. దీంతో మునేరు నుంచి గ్రామంలోని ప్రధాన రోడ్డు వరకు ఎక్కడా ఏ గొయ్యి లేకుండా ట్రాక్టర్ క్షణాల్లో బయటకు వచ్చేస్తోంది. ఈ ర్యాంపుల్లో ఇసుక 25 మీటర్ల మేర వెయ్యి ఎకరాల్లో ఉంటుంది. మార్కెట్‌లో ఈ ఇసుక విలువ రూ.300 కోట్లుగా ఉంటుంది.
వ్యవసాయ పనులు మానేసి ఇసుక లోడింగ్‌కు...
మునేరు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక రేయింబవళ్లూ తెలంగాణకు తరలిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 100కు పైగా ట్రాక్టర్లు ఉన్నాయంటే ఏ మేరకు ఇసుక అక్రమ రవాణా అవుతుందో అర్థం చేసుకోవచ్చు. గ్రామంలో వ్యవసాయ పనులు కూడా మానేసి కూలీలు ముఠాలుగా ఏర్పడి ఇసుక లోడింగ్‌కు వెళుతున్నారు. ఒక్కో ముఠాలో నాలుగు నుంచి ఎనిమిది మంది ఉంటారు. ముఠా ట్రాక్టర్ ఇసుక లోడింగ్ చేసినందుకు రూ.800 నుంచి రూ.1100 వరకు అక్రమార్కులు చెల్లిస్తున్నారు. రోజుకు ఒక్కో ముఠా 30 నుంచి 50 ట్రాక్టర్ల వరకు లోడింగ్ చేస్తుండటంతో ఒక్కో కూలీకి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆదాయం వస్తోంది. దీంతో కూలీలు కూడా పూర్తిగా వ్యవసాయ పనులు మానేసి ఇసుక లోడింగ్‌కు వెళుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోవడంతో ఇసుకకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. గ్రామానికి కూతవేటు దూరంలో ఉండే తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద మండవ ఇసుక రేవు ఉన్నప్పటికీ అక్కడి ఇసుకకు నాణ్యత లేకపోవడంతో మల్కాపురం మునేరు ఇసుకకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఒక్కో ట్రక్కు ట్రాక్టర్ ఇసుక ధర రూ. 8 వేల నుంచి రూ.11 వేల వరకు పలుకుతోంది. ట్రాక్టర్ల యజమానులకు వ్వవసాయం కూడా ఆశాజనకంగా లేకపోవడంతో అక్రమార్కులకు ట్రాక్టర్లను అద్దెకు ఇస్తున్నారు. రోజుకు రూ.2 వేల వరకు అద్దె లభిస్తుండటంతో అదే బాటలో మిగతా వారు అద్దెకు ఇస్తున్నారు.
రుణాలు తీసుకొని ట్రాక్టర్లు కొనుగోలు
గ్రామంలో ఇసుక వ్యాపారం ఆశాజనకంగా ఉండటంతో గతంలో 20 నుంచి 30 ట్రాక్టర్లు ఉండగా ఈ ఏడాదిన్నర కాలంలోనే ఆ సంఖ్య 100కు చేరింది. బ్యాంకు రుణాలు తీసుకుని మరీ ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేసే యువత ఉంటే వారికి రోజుకు రూ.800 వరకు ఇస్తున్నారు. కొంతమందికి పూర్తి స్థాయిలో డ్రైవింగ్ రాకపోగా ఇష్టానుసారంగా నడుపుతుండటంతో ఇటీవల గ్రామంలో మూగ జీవాలపై దూసుకెళ్లి మృత్యువాత పడ్డాయి.
18 గ్రామాలకు తరలిపోతున్న ఇసుక
తెలంగాణ రాష్ట్రంలోని వల్లభి, నేలకొండపల్లి, చెరువు మాధవరం, ముజ్జుగూడెం, గోండ్రాల, తమ్మర, బుద్దారం, రాయిగూడెం, రాజేష్‌పురం, చిమ్మిరాల, కోదాడ, బాణాపురం, పెదమండవ తండా, చిన్నమండవ, మంగాపురం తండా, కృష్ణాపురం, కమలాపురం గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ గృహాలకు ఇసుక తరలిస్తున్నారు. తరలింపు కూడా ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. ముఖ్యంగా మునేరు నుంచి ఇసుక ట్రాక్టర్లు బయలుదేరి రెండు కిలోమీటర్ల దూరంలో గల పెద్ద మండవ సరిహద్దు ప్రాంతానికి వెళ్తాయి. అక్కడ ఆ ప్రాంతానికి చెందిన అక్రమార్కులు ఏపీ నుంచి తీసుకువచ్చిన ఇసుక లోడ్ ట్రక్కును అక్కడ పార్క్ చేసి, అక్కడి నుంచి వేరే ట్రక్కును తీసుకొచ్చి, మళ్లీ ఇసుక లోడు చేసిన తరువాత అక్కడికి తీసుకెళ్తారు. తెలంగాణ రిజి స్ట్రేషన్ ట్రక్కులతో ఇసుక రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.