వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి

Oct 7 2025 4:07 AM | Updated on Oct 7 2025 4:07 AM

వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి

వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి

కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ

మచిలీపట్నంఅర్బన్‌: మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ సూచించారు. పింక్‌ అక్టోబర్‌ సందర్భంగా సోమవారం కలెక్ట రేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో రొమ్ము క్యాన్సర్‌ అవగాహన నెల గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన శస్త్రచికిత్స, క్యాన్సర్‌ నిపుణులతో ప్రతి సోమ, గురువారాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రొమ్ము క్యాన్సర్‌ పరీక్షలు, రోగనిర్ధారణ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, సహాయ కలెక్టర్‌ ఫర్హీన్‌ జాహిద్‌, డీఆర్‌ఓ కె. చంద్రశేఖరరావు, అదనపు ఎస్పీ సత్యనారాయణ, కేఆర్‌ ఆర్‌సీ స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ శ్రీదేవి, బందరు ఆర్డీఓ కె.స్వాతి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆశాలత తదితరులు పాల్గొన్నారు.

స్కూల్‌ గేమ్స్‌ సెలక్షన్స్‌ వాయిదా

గూడూరు: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి నిర్వహిస్తున్న జిల్లా సెలక్షన్స్‌ షెడ్యూలులో స్వల్ప మార్పులు చేసినట్లు కృష్ణాజిల్లా స్కూల్‌ గేమ్స్‌ స్పోర్ట్స్‌ కార్యదర్శి మత్తి అరుణ తెలిపారు. దీనిలో భాగంగా ఈనెల 8వ తేదీన జరగాల్సిన ఫెన్సింగ్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, 9న జరగాల్సిన స్విమ్మింగ్‌, 10న జరగాల్సిన జిమ్నాస్టిక్స్‌, త్రోబాల్‌, టెన్నికాయిట్‌ క్రీడాంశాలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 23న జరగాల్సిన నెట్‌ బాల్‌ సెలక్షన్స్‌ను ఈనెల 9వ తేదీకి మార్చినట్లు వెల్లడించారు. షెడ్యూలు మార్పు విషయాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు గమనించాల్సిందిగా కోరారు. వాయిదా పడిన క్రీడాంశాలు ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడిస్తామని ఆమె తెలిపారు.

దుర్గమ్మ దసరా తొలి విడత ఆదాయం రూ. 3.57 కోట్లు

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడుల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. మహామండపం ఆరో అంతస్తులో లెక్కింపును ప్రారంభించగా, తొలిరోజు రూ.3,57,92,708 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో శీనానాయక్‌ తెలిపారు. 122 గ్రాముల బంగారం, 9.700 కిలోల వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించిందని పేర్కొన్నారు. కానుకల లెక్కింపు మంగళవారం కూడా కొనసాగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement