
స్వచ్ఛాంధ్ర మహాయజ్ఞంలో భాగస్వాములు కండి
మంత్రి వాసంశెట్టి సుభాష్
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్ర సాధన దిశగా జరుగుతున్న మహా యజ్ఞంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర కార్మిక, వైద్య బీమా సేవల మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. నగరంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలులో సోమవారం సాయంత్రం జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని చల్లపల్లి గ్రామాన్ని 11 సంవత్సరాలుగా సుందరంగా తీర్చిదిద్దటంలో విశేష కృషి చేస్తున్న డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, పద్మావతి అభినందనీయులన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర స్థాయి స్వచ్ఛాంధ్ర బహుమతుల్లో జిల్లాకు నాలుగు బహుమతులు రావటం జిల్లా స్థాయిలో 44 బహుమతులు రావటం జిల్లాకే గర్వకారణమన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ స్వచ్ఛత కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరిని సన్మానించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న మూడు నెలల్లో అన్ని మునిసిపాల్టీల్లో ఒక కార్యాచరణ ప్రణాళిక ద్వారా స్వచ్ఛత కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నామన్నారు. అనంతరం స్వచ్ఛత కోసం పాటుపడిన వారిని అభినందిస్తూ శాలువాలు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో మంత్రి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోళం నాగమణి, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు,డెప్యూటీ సీఈవో ఆనంద్‌కుమార్, మునిసిపల్ కమిషనర్లు బాపిరాజు, మనో హరరావు, మెప్మా పీడీ సాయిబాబు, డీఆర్డీఏ పీడీ హరిహరనాఽథ్, డీపీటీవో వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి పాల్గొన్నారు.