
గోదాములో అగ్ని కీలలు
ఎనికేపాడులో భారీ అగ్నిప్రమాదం
విచారణ చేపడతాం..
● ఎలక్ట్రానిక్స్ పరికరాలు భద్రపరిచే గోదాము దగ్ధం ●విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లేప్రమాదమని అనుమానం ● సుమారు రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా
రామవరప్పాడు(గన్నవరం): విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని ఓ ఎలక్ట్రానిక్స్ పరికరాలు భద్రపరిచే గోదాములో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాములో నిల్వ ఉంచిన ఎలక్ట్రానిక్స్ పరికారాలైన ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, టీవీలు, మైక్రో ఓవెన్‌లు, వాషింగ్ మిషన్లు వంటి విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.5కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఏం జరిగిందంటే..
ఎనికేపాడు గ్రామంలోని డెకథ్లాన్ వెనుక ప్రాంతంలో సీఅండ్ ఎఫ్‌ఏ–శ్రీ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ప్యానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గోదాము ఉంది. మాగంటి అంజనీకి చెందిన ఐదు ఏకరాల స్థలంలో 16 వేల అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ గోదాములో ఎలక్ట్రానిక్స్ పరికరాలు భద్రపరుస్తారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల డీలర్లకు సరఫరా చేస్తుంటారు. ఉదయం 7.40 గంటల సమయంలో దట్టమైన పొగతో కూడిన మంటలు గోదాము నుంచి ఎగసి పడ్డాయి. తొలుత గోదాముకు ఒక వైపు మంటలు అంటుకోవడంతో అవి క్రమేణా వ్యాపించాయి. అగ్నికీలల ధాటికి గోదాములోని ఆఫీసు రూమ్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ పరికాలకు మంటలు అంటుకున్నాయి. అట్ట పెట్టెల్లో పార్సిల్ చేసి ఉన్న పరికరాలకు మంటలు అంటుకున్నాయి. అసలే మండే స్వభావం ఉంచే థర్మాకోల్‌తో పార్సిల్ చేసి ఉండటంతో మంటలు మరింతగా ఎగసి పడ్డాయి. పెద్ద పెద్ద శబ్దాలతో ఎలక్ట్రానిక్స్ వస్తువులు పేలడంతో పరిసర ప్రాంత ప్రజలు ఉలిక్కి పడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న గోదాము మేనేజర్ షాజహన్ బాషా ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
మూడు గంటలకు పైగా శ్రమించి..
భారీ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఆటోనగర్, కొత్తపేట తదితర ప్రాంతాల నుంచి ఏడు ఫైర్ ఇంజిన్లతో ప్రమాద స్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు కష్టపడ్డారు. గోదాములోకి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో జేసీబీ సహాయంతో గోడను ధ్వంసం చేసి సహాయక చర్యలు మొదలు పెట్టారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన సహాయక చర్యలు 11గంటలు దాటే వరకూ కొనసాగాయి. ఎగసి పడుతున్న మంటలకు గోదాము మొత్తం వ్యాపించక ముందే అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే గోదాములోని ఆఫీసు రూమ్‌లో భద్రపరచిన రికార్డులు, మూడు వంతులకు పైగా గోదాము అగ్నికి ఆహుతి అయ్యింది. ఎగసిపడిన మంటల ధాటికి గోదాము పైకప్పు రేకులు కూడా ఊడిపడ్డాయి. అగ్ని జ్వాలల వేడిమికి గోదాముకు మరో వైపు ఉన్న ఏసీల ఇండోర్ యూనిట్‌లు కరిగిపోయాయి.
ఎలక్ట్రానిక్స్ గోదాములో జరిగిన ఈ అగ్ని ప్రమాదంపై విచారణ చేపడతాం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా లేక అదృశ్య శక్తుల ప్రమేయం ఉందా అన్నది క్లూస్, ఫోరెన్సిక్ టీమ్, ఎలక్ట్రికల్, ఫైర్ డిపార్టుమెంట్ల సహయంతో విచారణ చేస్తాం. రికార్డులు కాలిపోవడంతో స్టాక్ వివరాలు పూర్తి స్థాయిలో గుర్తించలేకపోయాం. ఎలక్ట్రానిక్స్ పరికాలు కాలిపోయిన ఫ్రేమ్‌ల బట్టి ఏయే వస్తువులు ఎన్ని కాలిపోయాయో అంచనాకు వస్తాం.
– దామోదర్, సెంట్రల్ ఏసీపీ