
కోర్టు కేసులున్నా.. లెక్కలేనితనం!
కౌలు రైతుల భూముల్లో అక్రమంగా సరుగుడు పంట దోపిడి
కృత్తివెన్ను: కోర్టులో కేసు నడుస్తున్న భూముల్లో కౌలురైతులు పెంచుకున్న పంటను నిర్భయంగా, దౌర్జన్యంగా కొట్టుకుపోతున్నా సంబంధిత యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై స్థానిక రైతులతో పాటు, కిసాన్‌సంఘ్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం దీవిలో కొన్నేళ్లుగా సరుగుడు తోటల వ్యవహారంలో వివాదం నెలకొంది. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన పెద్ద వివాదం చెలరేగింది. జిల్లాకు చెందిన ఒక మంత్రి అండతో కొందరు వ్యక్తులు అక్రమంగా తమ తోటల్లోకి ప్రవేశించి రైతులను బెదిరించి పంటను కోసుకుపోవడంతో పెద్ద రచ్చ జరిగింది. దీంతో అక్రమార్కులు కొంత నెమ్మదించారు. అయితే గత వారం రోజులుగా ఇదే భూముల్లో తిరిగి అక్రమంగా సరుగుడు తోటలను కొట్టేసి దౌర్జన్యంగా తరలించుకుపోతున్నారంటూ సమాచారం అందుకున్న కిసాన్‌సంఘ్ రాష్ట్ర కోశాధికారి వల్లభనేని ఆశాకిరణ్ ఆధ్వర్యంలో సభ్యులు సోమవారం గొల్లపాలెం చేరుకుని ట్రాక్టర్లు, లారీలో తీసుకువెళుతున్న కర్రల లోడును అడ్డుకుని కిందికి దించేశారు.
విషయం ఏమిటంటే..
చినగొల్లపాలెంలో ఆర్‌ఎస్ నంబర్ 213, 217, 572/1లో దాదాపు 40 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిపై వివాదం ఉండటంతో కోర్టులో కేసు నడుస్తోంది. ఈ భూముల్లో ఉన్న పంటను కోర్టుతీర్పు వచ్చే వరకు ఎవ్వరూ కొట్టరాదని స్థానిక రైతులు చెబుతున్నారు. అయినా సరే కొందరు వ్యక్తులు అధికార పార్టీకి చెందిన ఒక మంత్రి అండతో కోర్టు కేసులో ఉన్న భూముల్లో దాదాపు 20ఎకరాల్లోని పంటను నరికేసి తీసుకుపోయినట్లు వాపోతున్నారు. ఈ భూములన్నీ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కౌలుకు చేస్తున్నారని వాటిలో పంటను తరలించుకుపోతున్నట్లు వారు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి దౌర్జన్యాలను అడ్డుకోవాలని రైతులు కోరుతున్నారు.

కోర్టు కేసులున్నా.. లెక్కలేనితనం!