
బుడమేరులోకి ఎన్టీటీపీఎస్ బూడిద నీరు
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడే బూడిద నీటిని సమీపంలోని వేడినీటి కాలువ (బుడమేరు)లోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ఈ పరిణామాలతో బుడమేరు కాలువలో నీరు మొత్తం బూడిద రంగులోకి మారింది. నెలరోజులకు పైగా జూపూడి సమీపంలోని బూడిద చెరువులో లారీలకు బూడిద లోడింగ్ నిలిచిపోయింది. దీంతో చెరువు మొత్తం బూడిద నిల్వలతో నిండిపోయింది. ప్రత్యామ్నాయ మార్గంగా ఆర్‌డబ్ల్యూఎస్ పంపింగ్ స్కీమ్ సమీపంలో బుడమేరులోకి బూడిద నీరు విడుదల చేస్తున్నారు. కృష్ణానదిలో చేరిన బూడిదతో నదీ పరీవాహక గ్రామాల ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. ఫిల్టరైజేషన్ లేని గ్రామాల్లో నేరుగా తాగునీటిని సరఫరా చేస్తే బూడిద నీటినే పంపిణీ చేయాల్సి వస్తుంది. ఈ పరిణామాలతో బూడిద నీటిని తాగిన ప్రజలు అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని స్థానికులు భయపడుతున్నారు. నదిలోకి బూడిద నీటిని వదలడం నిలిపివేయాలని కోరుతున్నారు.