
క్యూ కట్టిన వాహనాలు
కంచికచర్ల(నందిగామ): దసరా సందర్భంగా సొంతూరు బాట పట్టిన ప్రజలు ఆదివారం తిరుగు పయనమయ్యారు. సెలవులు పూర్తవటం, సోమవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పని ప్రదేశాలకు వివిధ వాహనాల్లో బయలు దేరారు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దీంతో కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు బారులుదీరాయి. టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్ సిస్టం ఉన్నప్పటికీ, ప్లాజా వద్ద ఐదు లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ వాహనాలు రావటంతో ఆలస్యం అవుతోందని ప్రయాణికులు అంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 15 వేల వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్లాయని టోల్‌ప్లాజా మేనేజర్ జయప్రకాష్ తెలిపారు.