
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వం
మధురానగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ(ఆర్.సి.పి.ఐ) రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ కుమార్ అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్ లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకు వెళుతోందని, కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికుల శ్రమను యాజమాన్యాలకు దోచిపెట్టే విధంగా ముందుకు సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుచేసి యువతను ప్రోత్సహిస్తామని చెప్తున్నప్పటికీ ఎక్కడా అమలు కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకుడు దేవర నాగన్న మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమను వెంటనే ప్రారంభించాలని, రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, శివకోటి రాజు, వి.మంగ, సుగుణమ్మ, రియాజ్, అరుణ్ పాల్గొన్నారు.
భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ కుమార్