
హైస్కూల్ ప్రహరీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే 65వ నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్ రహదారికి అవతల వైపు ఉన్న హైస్కూల్ ప్రహరీ గోడను ఢీకొట్టి లోపలకు దూసుకు వెళ్లింది. అదృష్టవశాత్తు అవతల రోడ్‌లో ఎటువంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సేకరించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి సుమారు 10.30 గంటలకు న్యూగో ఎలక్ట్రికల్ ప్రైవేట్ బస్ విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరింది. గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్ దాటిన తరువాత రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గర బస్ నిలిపి డ్రైవర్ టీ తాగారు. అనంతరం బస్ స్టార్ట్ చేసి ఒక వాహనం అడ్డుగా ఉండటంతో దాన్ని తప్పిస్తూ స్టీరింగ్‌ను కుడి వైపునకు తిప్పి మళ్లీ ఎడమ వైపునకు తిప్పుదామనుకునే లోపు అదుపు తప్పి అదే వైపునకు వెళ్లి సెంట్రల్ డివైడర్ పైకి ఎక్కి రోడ్డుకు అవతల ఉన్న శ్రీపోసాని నరసింహారావు చౌదరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడను ఢీకొంది. ఆ వేగానికి పాఠశాల లోపలకు కొంత మేర దూసుకుపోయింది. ఆ సమయంలో బస్‌లో ముగ్గురు ప్రయాణికులే ఉండటంతో వారికి గానీ, డ్రైవర్‌కు గానీ ఏమీ కాలేదు. జాతీయ రహదారి కావడంతో వాస్తవానికి ఆ సమయంలో గొల్లపూడి వైపు నుంచి వాహనాలు వస్తుంటాయి. అయితే ఘటన జరిగిన సమయంలో ఆ మార్గంలో ఎటువంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.