
బందరు కాలువలో పడి యువకుడు గల్లంతు
పెనమలూరు: యనమలకుదురులో ఓ యువకుడు ప్రమాదవశాత్తు బందరు కాలువలో పడి గల్లంతైన ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు ఇందిరానగర్‌కు చెందిన ఉద్దగిరి లక్ష్మి తన ఇద్దరు కుమారులతో కలసి ఉంటోంది. పెద్ద కుమారుడు వెంకటేష్ (20) తాపీ పనులు చేస్తాడు. అతను శనివారం పనికి వెళ్లి సాయంత్రం వచ్చి బందరు కాలువ వంతెన వద్ద కూర్చున్నాడు. తల్లి లక్ష్మి కుమారుడు వెంకటేష్‌ను ఇంటికి రమ్మని చెప్పగా, వెంకటేష్ తల్లిని ఇంటికి వెళ్లమని తాను వెంటనే వస్తానన్నాడు. అయితే వంతెనపై కూర్చున్న వెంకటేష్ రాత్రి 9 గంటలకు ప్రమాదవశాత్తు వంతెన పైనుంచి బందరు కాలువలో పడి గల్లంతయ్యాడు. ఇది చూసిన స్థానికులు వెంకటేష్ తల్లి లక్ష్మికి సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు వచ్చి కాలువలో గాలించినా వెంకటేష్ ఆచూకీ తెలియలేదు. దీంతో ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అధికారులు రంగంలోకి దించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బందరు కాలువలో వెంకటేష్ కోసం గాలిస్తున్నారు. ఇంకా ఆచూకీ తెలియలేదు.