
సెలవులకొచ్చి మునేరులో పడి గల్లంతు!
వేములపల్లి(కంచికచర్ల): దసరా సెలవుల్లో నాయనమ్మ, ఇతర బంధువులతో ఆనందంగా గడుపుదామని వచ్చిన ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ మునేటిలో పడి గల్లంతయిన ఘటన కంచికచర్ల మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు మండలంలోని వేములపల్లి గ్రామానికి చెందిన ఉప్పెల్లి ముసలయ్య అలియాస్ వెంకట్రావు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముసలయ్య మరణానంతరం అతని భార్య మరియమ్మ తన ఇద్దరు పిల్లలతో పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు గ్రామంలో నివాసముంటోంది. పెద్ద కుమార్తె కీర్తన(10) నాల్గవ తరగతి చదువుతోంది. రెండవ కుమార్తె సుసన్న అలియాస్ ప్రియదర్శిని రెండవ తరగతి చదువుతోంది. దసరా సెలవులు రావటంతో తల్లి మరియమ్మ తన పెద్ద కుమార్తెను వేములపల్లి గ్రామంలో నాయనమ్మ ఇంటి వద్ద ఉంచి గుమ్మడిదుర్రు గ్రామానికి తిరిగి వెళ్లింది. దుస్తులు ఉతికేందుకు శుక్రవారం నాయనమ్మ రమణమ్మతో కలసి మునేరుకు వెళ్లిన కీర్తన ప్రమాదవశాత్తు కాలుజారి పడి గల్లంతయింది. రమణమ్మ పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మునేరులో వెతికారు. అయినా కీర్తన ఆచూకీ తెలియలేదు. చీకటి పడటంతో వెతుకులాట ఆపారు.
రెవెన్యూ, పోలీసు అధికారులపై మండిపడ్డ గ్రామస్తులు
వేములపల్లి గ్రామంలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు ఉదయం 11 గంటలకు మునేరులో గల్లంతయినా రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడ్డారు. ఎన్డీఆర్‌ఎఫ్, లేదా ఎస్టీఆర్‌ఎఫ్ బృందానికి తెలియజేయకపోవటంతో వారు వెతికేందుకు గ్రామానికి రాలేదని, ఇందుకు పూర్తిగా రెవెన్యూ, పోలీసు అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు.