
అవనిగడ్డలో డయేరియా కలకలం
అవనిగడ్డ: నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డలోని పలు ప్రాంతాల్లో డయేరియా ప్రబలింది. 7, 8 వార్డుల్లో 8 మందికి పైగా డయేరియా రావడంతో అవనిగడ్డ ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం ఈ ప్రాంతంలో డయేరియా సోకినట్లు రోగులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రహదారుల పక్కనే చెత్తకుప్పల నిల్వలతో పాటు, మురుగునీరు ప్రవహిస్తోందని ఈ ప్రాంత ప్రజలు చెప్పారు. అయినా నిన్నటి వరకు ఈ వార్డుల్లో ఎక్కడా పారిశుద్ధ్య చర్యలు తీసుకున్నది లేవని వారు ఆరోపించారు. ముఖ్యంగా ఇంటింటా సర్వే నిర్వహించి డయేరియాకు కారణాలను తెలుసుకోవాల్సి ఉండగా అలాంటి చర్యలేవీ చేపట్టలేదు. దీనిపై వేకనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రియాజ్‌ను వివరణ కోరగా డయేరియా కేసులు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. ఆదివారం ఉదయం క్లోరినేషన్ చేయించామన్నారు. అయితే పంచాయతీ నుంచి సరఫరా చేసే నీటి ద్వారానే డయేరియా వ్యాపించి ఉంటుందని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. తాగు నీటిని నాణ్యత పరీక్షలకు పంపినట్లు తెలిపారు. డయారియా సోకిన ఇద్దరిని విజయవాడకు తరలించినట్లు చెప్పారు. పంచాయతీ సర్పంచ్ గొరుముచ్చు ఉమా, ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించి, క్లోరినేషన్ చేయించారు. మండల పరిధిలోని పాత ఎడ్లంక గ్రామానికి చెందిన ముగ్గురు డయేరియాకు గురై వైద్య శాలలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయినట్లు వైద్యశాల సిబ్బంది తెలిపారు. ఒకపక్క కృష్ణా నదికి వరద తీవ్రత ఉధృతంగా వస్తుండగా మరోవైపు అవనిగడ్డలో డయేరియా వార్త కలకలం సృష్టిం చింది. అధికారులు స్పందించి మిగిలిన ప్రాంతాలకు డయేరియా సోకకుండా తగు చర్యలు తీసుకోవదంతో పాటు శుద్ధమైన తాగునీటిని సరఫరా చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
7 ,8 వార్డుల్లో 8 మందికి డయేరియా