
ఆర్టీసీలో స్పెషల్ బాదుడు
● తిరుగు ప్రయాణంలో జనం కష్టాలు ● అత్యధిక బస్సులు హైదరాబాద్‌కే కేటాయింపు ● గ్రామీణ ప్రాంతాల ప్రజల అవస్థ
సత్తుపల్లిటౌన్: దసరా పండుగకు స్వస్థలాలకు వచ్చిన జనం తిరుగు ప్రయాణంలో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సరిపడా బస్సులు లేక బస్టాండ్లలో ప్రయాణికులు ఎదురుచూపుల్లో గడుపుతున్నారు. మరోపక్క స్పెషల్ చార్జీల భారంతో పండుగ ఆనందం ఆవిరవుతోందని పలువురు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికుల కోసం అదనపు సర్వీసులు ఏర్పాటు చేశారు. ఖమ్మం నుంచి సైతం అత్యధిక సర్వీసులు రాజధానికే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈక్రమాన పలు గ్రామీణ సర్వీసులను రద్దు చేయటంతో నిత్యం రాకపోకలు సాగించే జనం అవస్థ పడాల్సి వస్తోంది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని చాలా బస్టాండ్లలో శుక్రవారం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
హైదరాబాద్ సరే.. మిగతా చోట్లకు?
ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది విద్య, వ్యాపార, ఉద్యోగ, ఉపాధి తదితర అవసరాలకు హైదరాబాద్‌లో స్ధిరపడ్డారు. వీరంతా దసరా పండుగకు స్వస్థలాలకు వచ్చారు. పండుగ ముగియడంతో శుక్రవారం తిరుగు ప్రయాణం కాగా.. ఆర్టీసీ అధికారులు అత్యధిక బస్సులను హైదరాబాద్‌కే కేటాయించారు. ఇందులో భాగంగా సత్తుపల్లి డిపో నుంచి హైదరాబాద్ రెగ్యులర్‌గా నడిచే 25 సర్వీసులే కాక ఇతర మార్గాల్లో రాకపోకలు సాగించే బస్సులనూ అటే కేటాయించారు. ఈ కారణంగాఆర్టీసీకి ఆదాయం పెరిగినా.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం సమస్యలు ఎదుర్కొన్నారు. ఇది కాక మరికొన్ని మార్గాల్లో బస్సుల సంఖ్య తగ్గింది. హనుమకొండ నుంచి ఖమ్మంకు నిత్యం రాకపోకలు సాగించే ఎలక్ట్రిక్ బస్సులను సైతం హైదరాబాద్ రూట్‌లోనే కేటాయించారు. దీంతో ఖమ్మం నుంచి హనుమకొండకు వెళ్లేందుకు శుక్రవారం బస్సులు లేక.. గంటకొకటి చొప్పున వస్తున్న అరకొర బస్సుల్లో సీట్లు దక్కించుకునేందుకు పరుగులు తీయడం కనిపించింది.
స్పెషల్ బాదుడు ఇలా..
సత్తుపల్లి నుంచి ఎంజీబీఎస్‌కు సూపర్ లగ్జరీ బస్సు చార్జీ సాధారణ రోజుల్లో రూ.580 ఉండగా.. ఇప్పుడు రూ.810కి పెంచారు. అలాగే, జీడిమెట్ల చార్జీ రూ.610 నుంచి రూ.860కి, ఈసీఎల్‌కు రూ.610 నుంచి రూ.860కి, బీహెచ్‌ఈఎల్‌కు రూ.610 ఉండగా రూ.860, ఏసీ బస్సులో చార్జీ రూ.760ని రూ.1,070కి పెంచారు. దీంతో ఇప్పటికే పండుగ ఖర్చు భరించిన ప్రజలపై అదనం భారం మోపినట్లయింది.
ఖమ్మం రీజియన్‌లోని డిపోల నుంచి ప్రతిరోజు హైదరాబాద్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, అశ్వారావుపేట రూట్లలో ప్రయాణికుల రాకపోకలతో బస్సులు రద్దీగా ఉంటాయి. ఈ నేపథ్యాన ఆర్టీసీ అధికారులు లక్కీడ్రా స్కీం ప్రారంభించారు. సూపర్‌లగ్జరీ, డీలక్స్, లహరి, రాజధాని బస్సుల్లో ప్రయాణించే వారు టికెట్ వెనుక భాగాన పేరు, చిరునామా, సెల్‌ఫోన్ నంబర్ రాసి బస్టాండ్ ప్రాంగణంలోని డబ్బాలో వేయాలి. ఆపై రీజియన్ పరిధిలో ముగ్గురిని ఈనెల 8న లక్కీ డ్రాద్వారా విజేతలుగా ఎంపిక చేస్తామని ప్రకటించి.. విస్తృత ప్రచారం చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమే సురక్షితం. ప్రయాణికుల రద్దీ ఆధారంగా హైదరాబాద్‌కు రెగ్యులర్ సర్వీస్‌లతో పాటు అదనపు బస్సులు నడిపిస్తున్నాం. ఇదే సమయాన ఇతర రూట్లలో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఒకేసారి అందరూ తిరుగు ప్రయాణం కావడంతో రద్దీ పెరిగింది. ఈ విషయాన్ని గుర్తించి ప్రయాణికులు సహకరించాలి.
– వి.సునీత, డిపో మేనేజర్ సత్తుపల్లి

ఆర్టీసీలో స్పెషల్ బాదుడు

ఆర్టీసీలో స్పెషల్ బాదుడు