
ఆ ఆనందం మరిచిపోలేనిది..
ఖమ్మంరూరల్: ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మరిచిపోలేని మధురానుభూతి అని జిల్లాకు చెందిన తాళ్లూరి పల్లవి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులకు చెందిన ఆమె శ్రీ చైతన్య కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశాక హైదరాబాద్‌లో ఏడాది పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో శిక్షణ తీసుకుంది. ఆపై నిర్వహించిన పరీక్షలో జాతీయ స్థాయి టాపర్‌గా నిలవడంతో తాజాగా ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఈ నేపథ్యాన శ్రీచైతన్య కళాశాలలో పల్లవిని ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ పల్లవి విజయం మిగతా విద్యార్థులకు స్ఫూరిగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం పల్లవి మాట్లాడుతూ పరీక్షలో టాపర్‌గా నిలిచినప్పుడు సంతోషించినా.. ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. కళాశాల డైరెక్టర్ శ్రీవిద్య, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయిగీతిక, ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, అకడమిక్ డీన్ డాక్టర్ వి.సుదర్శన్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
● ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో జాతీయ స్థాయి టాపర్‌గా నిలిచి ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న పల్లవిని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందించారు. ఆమెతో ఆదివారం ఫోన్‌లో మాట్లాడిన ఆయన భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
ప్రధాని నుంచి అవార్డు స్వీకరించిన పల్లవి