
ప్రతిపాదనలతోనే సరి
కమ్మేసిన కంపచెట్లు, చెట్లపొదలు
మరమ్మతుకు నోచుకోని ఆర్‌అండ్‌బీ రహదారులు
నిధులు విడుదల కాకపోవడంతో కష్టాలు
గుంతల్లో రాకపోకలతో వాహనదారుల అవస్థ
ఖమ్మం అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఆర్‌అండ్ బీ పరిధిలోని రహదారులు ఇటీవల వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల గుంతలు తేలినా మరమ్మతులు లేకపోవడంతో వాహనదారులు రాకపోకలకు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కనీసం తాత్కాలిక మరమ్మతులకు కూడా నిధులు అందక అనేక ప్రాంతాల్లో రోడ్లు ప్రమాదకరంగా మారాయి. గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై తారు పొరలు ఊడిపోగా, గుంతలు మరింత పెద్దవయ్యాయి. తాత్కాలిక మరమ్మతుల కోసం అధికారులు పంపిన ప్రతిపాదనలకు మోక్షం లభించక ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో సుమారు 120 కిలోమీటర్ల రోడ్ల శాశ్వత మరమ్మతుల కోసం రూ.75 కోట్లతో ప్రతిపాదనలు పంపిన అధికారులు ఎదురుచూస్తున్నారు.
నిలిచిన పనులు
ఖమ్మం – ఇల్లెందు నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులు రూ.40 కోట్ల అంచనాలతో ప్రారంభమయ్యాయి. రఘునాథపాలెం, మంచుకొండ వరకు సుమారు రూ.10 కోట్ల విలువైన పనులు చేసినా కాంట్రాక్టర్‌కు బిల్లులు అందలేదు. దీంతో పనులు మధ్యలోనే నిలిపివేశాడు. ఫలితంగా ఆ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వర్షాలకు ఏర్పడిన గుంతల్లో చెత్త, నీరు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలోని పలు ప్రాంతాల్లో నెలకొంది. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కొత్త పనులకు టెండర్లు ఆహ్వానించినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదని సమాచారం.
వాహనదారుల గోడు...
ఖమ్మం – తిమ్మరావుపేట, ఖమ్మం – ఏన్కూరు వయా పండితాపురం ఖమ్మం – బోనకల్, పల్లిపాడు – ఏన్కూరు రహదారులు అధ్వానంగా మారాయి. ఇవేకాక సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లోని పలు ప్రధాన రహదారులపైనా ఇదే పరిస్థితి నెలకొంది. ఖమ్మం – సత్తుపల్లి, తల్లాడ – కొత్తగూడెం తదితర రాష్ట్ర రహదారులన్నీ గుంతలమయమై ప్రయాణం భయానకంగా మారింది. పగటివేళ కూడా ప్రయాణం కష్టంగా మారడమే కాక రాత్రివేళ వాహనదారులు ఎంత జాగ్రత్తగా నడిపినా ఇక్కట్లు తప్పడం లేదు.
నిధుల కొరతే కారణం
ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు కాకపోవడమే సమస్యగా మారింది. శాశ్వత మరమ్మతుల మాటేమో కానీ తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.8 కోట్లతో అంచనాలు పంపినా నిధులు రాకపోగా.. ఉన్న అరకొర నిధులతో టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. కొందరు కాంట్రాక్టర్లు పనులు చేయకుండా ముఖం చాటేయడంతో అధికారులు పలు దపాలు నోటీసులు జారీ చేసినా స్పందన ఉండడం లేదని చెబుతున్నారు.
వివిధ ప్రాంతాల్లో ఇటీవల వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. మొత్తంగా రూ.83కోట్లు మంజూరు కావాల్సి ఉంది. తాత్కాలికంగా గుంతలు పూడ్చేందుకు టెండర్లు పిలిచాం. ఖరారైన చోట పనులు చేపడుతాం.
– యాకూబ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ
రహదారులపై గుంతలకు తోడు పలుచోట్ల ఇరువైపులా పెరిగిన కంపచెట్లు, పొదలు కూడా వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. తారురోడ్ల అంచుల వరకూ అల్లుకుపోయిన పొదలతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా మూలమలపుల వద్ద, రాత్రివేళ ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఏటా వర్షాకాలం అనంతరం చేపట్టే జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా ఈసారి నిధుల కొరతతో ఆగిపోయాయి.

ప్రతిపాదనలతోనే సరి

ప్రతిపాదనలతోనే సరి