
లక్షణంగా వైద్యసేవలు!
పెద్దాస్పత్రిలో సెప్టెంబర్ వరకు ఓపీ, ఐపీ వివరాలు
నిరంతరం పర్యవేక్షణ
సింహభాగం సీజనల్ వ్యాధులతోనే...
సీజనల్ వ్యాధుల వ్యాప్తి నేపథ్యాన పెద్దాస్పత్రిలో వైద్య సేవలు పొందేందుకు భారీగా వస్తున్నారు. సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు సీజనల్ వ్యాధుల కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో జలుబు, దగ్గు, జ్వరం, డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా, డయేరియా ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ సమయాన పెద్దాస్పత్రిలో 1,35,693 మంది వైద్యసేవలు పొందారు. ఇందులో ఎక్కువగా సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారే ఉన్నారని తెలుస్తోంది. అలాగే 10,302 మంది ఇన్ పేషెంట్లు చికిత్స చేయించుకున్నారు. జనవరి నుండి పరిశీలిస్తే ఇప్పటి వరకు 2,69,639 మంది ఓపీ సేవలు తీసుకోగా.. వీరిలో 22,877 మంది ఆస్పత్రిలో చేరారు. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు 45,969 మందికి అత్యవసర చికిత్స అందించారు. తరచుగా వర్షం కురుస్తూ నీరు నిలుస్తున్న కారణంగా సీజనల్ వ్యాధుల ప్రభావం తగ్గడం లేదని తెలుస్తోంది. ఫలితంగా సెప్టెంబర్ నెలలోనూ ఓపీ విభాగానికి వచ్చిన సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. జిల్లాలో పల్లె, పట్టణ దవాఖానాలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు అందుబాటులో ఉన్నా ఎక్కువ మంది పెద్దాస్పత్రికి రావడానికే మొగ్గు చూపుతున్నారు.
దడపుట్టిస్తున్న వ్యాధుల వ్యాప్తి
ఎడతెరిపి లేని వర్షాలతో దోమలు వృద్ధి చెంది ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. విషజ్వరాలకు తోడు డెంగీ, మలేరియా, దగ్గు, జలుబు, డయేరియాతో ప్రజలు వణికిపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాలైన మహబూబాబాద్, సూర్యాపేట తదితర జిల్లాల ప్రజలు కూడా పెద్దాస్పత్రికి వస్తుండటంతో నిత్యం కిటకిటలాడుతోంది. జిల్లాలో గత ఏడాది 32,656 మందికి డెంగీ పరీక్షలు చేయగా 529 మందికి నిర్ధారణ అయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 13,435మందికి పరీక్షలు చేయగా 208మంది డెంగీ బారిన పడినట్లు గుర్తించారు. ఒక ఆగస్టులోనే 101 డెంగీ కేసులు వెలుగు చూడగా, సెప్టెంబర్‌లో 75, జూలైలో 27 కేసులు బయటపడ్డాయి. ఈసారి మలేరియా, చికెన్‌గున్యా ప్రభావం లేకపోయినా వైరల్ ఫీవర్స్ వ్యాప్తి అధికంగా ఉంటోంది. దీనికి తోడు కలుషితమైన నీరు కారణంగా డయేరియా కేసులు పెరుగుతున్నాయి.
నెల ఓపీ ఐపీ
జనవరి 26,269 2,844
ఫిబ్రవరి 23,860 2,134
మార్చి 27,816 2,888
ఏప్రిల్ 28,473 2,591
మే 27,528 2,118
జూన్ 29,560 1,553
జూలై 38,336 3,209
ఆగస్టు 33,672 2,833
సెప్టెంబర్ 34,125 2,707
మొత్తం 2,69,639 22,877
సీజనల్ వ్యాధుల ప్రభావంతో ఆస్పత్రికి తాకిడి పెరుతుండగా వైద్యులు అందుబాటులో ఉండేలా పర్యవేక్షిస్తున్నాం. ఇన్‌పేషంట్ వార్డుల్లోనూ నిరంతరం వైద్యులు ఉంటున్నారు. నిత్యం 1,500 నుంచి 2వేల మంది వైద్యసేవలు పొందుతున్నారు. ఎక్కువగా వైరల్ ఫీవర్స్, జలుబు, దగ్గు, డయోరియా, డెంగీతో బాధపడుతున్న వారు వస్తున్నారు. మందుల కొరత రాకుండా ముందస్తుగానే అందుబాటులో ఉంచాం. – ఎం.నరేందర్, జనరల్ ఆస్పత్రి మెడికల్
సూపరింటెండెంట్