
కోటమైసమ్మకు మొక్కుల చెల్లింపు
కారేపల్లి: మండలంలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ కోటమైసమ్మ తల్లి జాతర కొనసాగుతోంది. దసరా పర్వదినాన మొదలైన జాతరకు భక్తజనం ఇంకా పోటెత్తుతూనే ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవాదాయ ధర్మదాయ శాఖ, పర్సా ట్రస్టు ఆధ్వర్యాన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తేనెటీగల పెంపకం
లాభదాయకం
సత్తుపల్లి: తేనెటీగల పెంపకం లాభదాయకంగా ఉంటుందని తెలంగాణ బీ హబ్ సొసైటీ అధ్యక్షుడు కె.ఇంద్రారెడ్డి తెలిపారు. జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్‌సింగ్ సూచనల మేరకు సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో సయోధ్య ఎన్‌జీఓ సహకారంతో గిరిజనులకు తేనెటీగల పెంపకంపై ఆదివారం శిక్షణ ఏర్పాటుచేశారు. తేనెటీగల పెంపకం, తేనె సేకరణలో అధునాతన పద్ధతులు, మార్కెటింగ్ విధానంపై అవగాహన కల్పించాక 29 మందికి తేనేటీగల బాక్స్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేంజర్ టి.స్నేహలత, ఎఫ్‌ఎస్‌ఓ నాగరాజు, బీట్ అధికారులు కిరణ్, కృష్ణ, వైల్డ్‌లైఫ్ ఎక్స్‌ఫర్ట్ దీపక్, బీ హబ్ సెక్రటరీ నిమ్మల రామచంద్రయ్యతో పాటు డాక్టర్ తిరుమలేష్, మృదుల, సీతాలక్ష్మణ్, బాబు, చుక్కమ్మ, మట్టా పద్మ, సురేష్, ఉష, కుమార్ పాల్గొన్నారు.
రేపు బాలికల
ఫుట్‌బాల్ జట్టు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 బాలికల ఫుట్‌బాల్ జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నట్లు జూనియర్ కళాశాలల క్రీడా సంఘం జిల్లా కార్యదర్శి ఎం.డీ.మూసాకలీం తెలిపారు. ఖమ్మంలోని మున్సిపల్ స్పోర్ట్స్ పార్క్‌లో జరిగే ఎంపిక పోటీలకు క్రీడాకారిణిలు వయసు ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్‌తో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 99896 47696, 97037 85786 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
12న హాకీ ఎంపికలు..
ఉమ్మడి జిల్లాస్థాయి బాలబాలికల హాకీ జట్లను ఈనెల 12వ తేదీన కొత్తగూడెంలోని ఎస్‌ఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో ఎంపిక చేయనున్నట్లు ఎం.డీ.మూసీ కలీం వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకర పత్రం, స్టడీ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు.
జేకే ఓసీ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నాం
సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు
ఇల్లెందు : నూతన జేకే ఓసీ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నామని సింగరేణి డైరెక్టర్(పీఅండ్‌పీ) కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆయన ఇల్లెందు ఏరియాలో పర్యటించారు. అనంతరం జీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఓసీ ఏర్పాటుకు గల అడ్డంకులు తొలగిపోయేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను అధిగమించాలని, రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఉపరితల గనుల్లో ఉద్యోగులు రక్షణ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఏరియా ఆస్పత్రిని సందర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జీఎం వీసం కృష్ణయ్య, అధికారులు రామస్వామి, నరసింహరాజు, గిరిధర్‌రావు, జాకీర్ హుస్సేన్, తుకారం, రామ్మూర్తి, శివ వీరకుమార్, శివప్రసాద్, సతీష్ కుమార్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్ : పాల్వంచ మండల పరిఽధి కేశవాపురం – జగన్నాథపురం మధ్య కొలువుదీరిన శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలలతో పాటు పొరుగు జిల్లాల భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.

కోటమైసమ్మకు మొక్కుల చెల్లింపు