
కేంద్రంలోని పాలక పక్షం ఎన్డీయే, విపక్ష కూటమి ‘ఇండియా’ జీవన్మరణ సమస్యగా భావిస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దఫాలుగా పోలింగ్ జరగబోతోంది. 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. వీటితోపాటు ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎనిమిది స్థానాలకు ఉప ఎన్నికలుంటాయి. వివాదాస్పద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఎన్నికల జాబితాను నవీకరించాక అది స్వచ్ఛంగా మారిందని జ్ఞానేశ్ ఇప్పటికే చెప్పారు.
బిహార్‌లో ఇంతవరకూ సొంతంగా అధికారం చవిచూడని బీజేపీ ఈసారి ఎలాగైనా ఆ అదృష్టాన్ని దక్కించుకోవాలని తహతహ లాడుతోంది. కానీ కేంద్రంలో మద్దతిస్తున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)తో ఎప్పటిలా కూటమి కట్టక తప్పలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాలను గుర్తుంచుకుంటే నవంబర్ 15 తర్వాత ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తం స్థానాల సంఖ్య 243 కాగా, అప్పట్లో జేడీ(యూ) 122, బీజేపీ 121 స్థానాలు పంచుకున్నాయి.
తమకన్నా ఒక్కటి ఎక్కువిచ్చి కాబోయే సీఎం నితీశేనని బీజేపీ చాటాల్సివచ్చింది. తీరా ఎన్నికలైన రెండేళ్లలోనే... అంటే 2022 ఆగస్టులో నితీశ్ ప్లేటు ఫిరాయించి ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహా కూటమితో చేయి కలిపి మళ్లీ సీఎం అయ్యారు. అది ఎక్కువకాలం సాగలేదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండగా ఇండియా కూటమిని నిరుడు జనవరిలో చావుదెబ్బతీసి మళ్లీ ఎన్డీయే గూటికి చేరారు. ఫిరాయించిన ప్రతిసారీ సీఎం పదవికి రాజీనామా చేయటం, కొత్త కూటమి పక్షాన మళ్లీ దక్కించుకోవటం నితీశ్ ప్రత్యేకత.
సాధారణ సమయాల్లో రాజకీయాలే ఊపిరిగా భావించే బిహార్ ప్రజానీకం పోలింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపరంటే ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ సగటు పోలింగ్ శాతం ఎప్పుడూ 56 శాతం దాటలేదు. ఓటేసేవారిలో కూడా దాదాపు 60 శాతం మహిళలే. ఇది ప్రతిసారీ బీజేపీకి కలిసొస్తున్నది. క్రితంసారి ఎన్డీయేలో జేడీ(యూ) కేవలం 43 గెలుచుకుంది. బీజేపీ 74 సాధించింది. కానీ పొత్తు ధర్మానికి తలొగ్గి నితీశ్‌కే సీఎం పగ్గాలు అప్పగించింది. అప్పట్లో అలిగివెళ్లిన ఎల్‌జేపీ ఒక స్థానంమించి గెలవకపోయినా 33 చోట్ల అది జేడీ(యూ)ను దెబ్బ తీయగలిగింది. ఇప్పటికైతే ఆ పార్టీ ఎన్డీయే పంచన ఉంది.
ఎంఐఎం వల్ల నష్టపోతున్నామన్నది విపక్షాల భావన. సీమాంచల్‌లో క్రితంసారి అది అయిదు గెల్చుకుంది. ఇక ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పార్టీ ఏ మేరకు ఓట్లు చీల్చగలదో చూడాల్సి ఉంది. బిహార్‌లో వామపక్షాలు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీలు 16 స్థానాలు సాధించాయి.
రాష్ట్రంలో నితీశ్‌తో కలిస్తేనే అధికారం దక్కుతుందన్న భావన అన్ని పార్టీల్లోనూ ఉంది. అందుకే ఆయన ఎటు దూకినా, తిరిగొస్తే అక్కున చేర్చుకోవటం ప్రధాన పక్షాలకు అలవాటైంది. నాలుగు దఫాలు సీఎంగా చేశాక ఇంకా ఆయనలో ఆ ‘మ్యాజిక్’ ఉందా అన్నది ఈ ఎన్నికలు తేల్చేస్తాయి. 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బొత్తిగా జనాకర్షణ లేని పార్టీతో కలిసి వెళ్లినా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అద్భుతమైన పనితీరు కనబరిచారు.
ఎన్డీయేతో పోలిస్తే కేవలం 16,825 ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యారు. ఈసారి ‘ఓట్ చోరీ’ ప్రచారం ప్రభావం వల్ల తన స్థితి మెరుగైందన్న భరోసాతో కాంగ్రెస్ స్వరం పెంచుతోంది. ఆర్జేడీకి అది గుదిబండగా మారుతుందా... లేక స్వీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా మెలగుతుందా అన్నది చూడాలి.
సాధారణ సమయాల్లో జనాకర్షణ పథకాలు ప్రమాదమంటూ గంభీరంగా మాట్లాడే ఎన్డీయే, ఎప్పటిలాగే బిహార్‌లో చేతికి ఎముక లేకుండా తాయిలాలు ప్రకటించింది. గత నెలలో ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద 75 లక్షల మంది మహిళలకు రూ. 10,000 చొప్పున అందించారు. నెలకు రూ. 2,500 చొప్పున ఇస్తామన్న మహా కూటమి హామీకి ఇది విరుగుడు. ఏదేమైనా ఈసారి బిహార్ తీర్పుపై కేంద్రంలోని ఎన్డీయే కూటమి మనుగడ ఆధారపడి ఉంటుంది. అక్కడ బీజేపీ ప్రాభవం తగ్గితే జేడీ(యూ), టీడీపీలు తోకజాడించే ప్రమాదముంది. అదీగాక 2027 మార్చిలో జరిగే యూపీ ఎన్నికలపై కూడా దాని ప్రభావం పడుతుంది. ఇన్నివిధాల కీలకమైన బిహార్ ఎటు మొగ్గుతుందన్నది మరో నెల్లాళ్ల వ్యవధిలో తేలిపోతుంది.