
గిరిజనులకు అన్యాయం జరిగితే యుద్ధమే
అరకులోయ టౌన్: గిరిజనులకు అన్యాయం జరిగినా, వారి భూముల జోలికొచ్చినా రాష్ట్రంలో పెద్ద యుద్ధమే జరుగుతుందని సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు హెచ్చరించారు. స్ధానిక టీటీడీ కల్యాణ మండపంలో సీఐటీయూ జిల్లాస్థాయి రెండో మహా సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీలోని అటవీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసి, గిరిజనులకు అన్యాయం చేస్తే ప్రభుత్వానికి గిరిజనుల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. హైడ్రోపవర్ ప్రాజెక్టు తీసుసుకురావడం, టూరిజం యూనిట్లను ప్రైవేట్ పరం చేసి గిరిజనులను బానిసలుగా చేయడమే అన్నారు. టూరిజం ప్రైవేట్‌పరం చేస్తే ఈ ప్రాంతం నాశనం అవుతుందన్నారు. వీటిపై జీవనం సాగిస్తున్న గిరిజన ఉద్యోగులకు అన్యాయం చేయవద్దన్నారు. వీరందరికి కార్మిక చట్టం ప్రకారం వేతనం ఇవ్వడం లేదన్నారు. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయకుండా తప్పుడు విధానంలో టూరిజం యూనిట్లను ప్రైవేట్ పరం చేస్తే తిరుగుబాటు తప్పదన్నారు. సీహెచ్‌డబ్ల్యూలుగా గత కొన్నేళ్ల నుంచి పనిచేస్తూ రిటైర్ అవుతున్నారన్నారు. వీరిని ఆశా వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గురుకులంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గత కొన్నేళ్లుగా రెగ్యులర్ చేయాలని పోరాడినప్పటికీ సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేయడం లేనద్నారు. 230 రోజులు పనిచేసిన కార్మికులకు పర్మినెంట్ చేయాలని చట్టం చెబుతున్నప్పటికీ వాటిని అమలు చేయకపోవడంపై ఉద్యోగుల తిరుగుబాటు తప్పదన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోనంగి చిన్నయ్య పడాల్, వి. ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నర్సింగరావు హెచ్చరిక