
వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దాలి
గంగవరం : విద్యార్థులు అందరూ తప్పనిసరిగా చదవడం, రాయడం, చ తుర్విధ ప్రక్రియలు వచ్చేటట్లుగా ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలని టీఏఆర్‌ఎల్ ఉపాధ్యాయ శిక్షణ రాష్ట్ర పరిశీలకులు కల్పనా శైలు ఉపాధ్యాయులకు సూచించారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. మూడో తరగతి నుండి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు అందరికీ సబ్జెక్టు పరంగా మంచి నైపుణ్యాన్ని పెంపొందించాలన్నారు. శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, నేర్చుకున్న విషయాలు పాఠశాల స్థాయికి చేరాలన్నారు. రంపచోడవరం ఏజన్సీ డివిజన్‌లో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల గురించి ఏజెన్సీ డీఈఓ మల్లేశ్వరరావు ఆమెకు వివరించారు. అన్ని మండలాల్లో విజయవంతంగా శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఏజెన్సీ డీఈఓ పేర్కొన్నారు. రాజవొమ్మంగి ఎంఈఓ సత్యనారాయణ, ఉపాధ్యాయ శిక్షణ కోఆర్డినేటర్ సతీష్ , ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి, శ్రీరాములు, సత్యనారాయణ, డీఆర్పీలు రఘుబాబు, దామోదర్, వెంకన్నదొర, రామంచద్రారెడ్డి, సీఆర్పీలు వరప్రసాద్, భాస్కర్ పాల్గొన్నారు.