
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆత్మహత్య
సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా): ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణ సీఐ అప్పలనాయుడు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సాలూరు రేంజ్ పరిధిలో పని చేస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ముద్ద శ్రీకాంత్(43) పట్టణంలో బంగారమ్మ కాలనీలో నివాసముంటున్నారు. ఈ నెల 7వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు సేవించి.. ఉద్యోగం నిమిత్తం గుడివాడ గ్రామానికి బస్సులో వెళ్లారు. అక్కడ నీరసంగా ఉండడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే కుటుంబ సభ్యులు గజపతినగరం ఆస్పత్రికి అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. కాగా చికిత్స పొందుతూ బుధవారం శ్రీకాంత్ మృతి చెందారు. మృతుని స్వస్థలం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు. అప్పులు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు వల్ల జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతుడి భార్య నాగజ్యోతి ఫిర్యాదు చేసినట్టు పట్టణ సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.