breaking news
t.subbaramireddy
-
అన్ని వసతులతో విశాఖ రెడీమేడ్‌గా వుంది
-
రాష్ట్రానికి విశాఖే బెస్ట్ : టి. సుబ్బిరామిరెడ్డి
సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్‌కు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్టణాన్ని ఎంచుకోవడంపై రాజ్యసభ సభ్యులు టి. సుబ్బిరామిరెడ్డి స్పందించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందించిందన్న సమాచారం మీడియా ద్వారా తెలుసుకున్నా. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడం ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం. విభజనకు ముందు హైద్రాబాద్ తర్వాత పెద్ద సిటీ విశాఖే. నగరంలో మౌలిక సదుపాయాలతో పాటు విస్తారమైన భూములున్నాయి. పరిశ్రమలున్నాయి. పారిశ్రామికవేత్తలకు పరిచయమైన ప్రాంతం కావడంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే మరింత మంది పారిశ్రామిక వేత్తలు వస్తారు. విస్తరణకు మంచి అవకాశముంది. ఆర్థిక సమస్యలున్న దృష్ట్యా ప్రస్తుతానికి రెడీమేడ్ సిటీ విశాఖయే మంచి ఆప్షన్. మరింత అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అద్భుతమైన రాజధాని అవుతుందని వ్యాఖ్యానించారు. -
ఈ ఆనందం మాటల్లో చెప్పలేను: మోహన్ బాబు
విశాఖపట్నం: ‘ఈ ఆనందం మాటల్లో చెప్పలేను.. సినీ జీవితంలో అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు గడిచి పోయింది. మా గురువు దాసరి నారాయణరావు, నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధించిన అభిమానుల వల్లే నేను ఇంతవరకు ప్రయాణం సాగించగలిగాను. ఈ 40 ఏళ్ల పండుగ విశాఖలో జరుపుకునే అవకాశం రావడం నా జీవితంలో మర్చిపోలేను’ అని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ మంచు మోహన్‌బాబు చెప్పారు. 40 ఏళ్ల సినీ జీవితం పూర్తి చేసుకున్న ఆయనను ఈనెల 17న విశాఖ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న వేడుకలో టి.సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ ‘నవరస నటతిలకం’ బిరుదుతో సత్కరించనుంది. ఈ సందర్భంగా నగరానికి విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇదంతా గురువు గారు.. అభిమానుల వల్లే ‘ఆనాడు ఓ మారుమూల పల్లెటూరు నుంచి పొట్ట చేతపట్టుకుని చెన్నై వెళ్లాను. ఎన్నో ఇబ్బందులు పడ్డా.. ఎదురు దెబ్బలు తిన్నాను. మరెన్నో ఒడిదుడుకులు చవిచూశాను. గురువుగారు దాసరి నారాయణరావు నన్ను మోహన్‌బాబుగా మార్చి తెలుగు ప్రజలకు పరిచయం చేశారు. ఆయన ప్రోత్సాహం, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, అభిమానుల దయవల్ల ఎన్నో విజయాలందుకున్నాను. మరెన్నో శిఖరాలను అధిరోహించగలిగాను. కళామతల్లికి సేవలో అప్పుడే 40 ఏళ్లు ఎలా గడిచిపోయాయో తెలియడం లేదు. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కథానాయకుడిగా, నిర్మాతగా.. ఇలా సినీ జీవితంలో నా ప్రయాణం సాగింది.. సాగుతోంది. ఏ వేషం వేసినా.. ఏ ప్రయోగం చేసినా తెలుగు ప్రజలు ఆదరించారు. ఇప్పుడు సినీ పరిశ్రమలో నాతో కలిసి పని చేసిన హీరోలు, హీరోయిన్లు, ప్రస్తుతతరం నటులు, సంగీత దర్శకులు, దర్శకులు ఎంతో బిజీగా ఉన్నా ప్రతి ఒక్కరూ వచ్చి అభినందిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు, బి.గోపాల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహానుభావులు ఈ వేడుకలో పాల్గొని నన్ను ఆశీర్వదించేందుకు తరలివస్తున్నారు.’ అని మోహన్‌బాబు చెప్పారు. ఆ ఖర్చుతో పేదలకు పట్టెడన్నం పెట్టండి ‘తెలుగు రాష్ట్రాల్లో నా అభిమానులు కూడా ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. వారికి ఒక్కమాట చెబుతున్నా ఏ ఒక్కరూ పూల దండలతో రావద్దు. పూలదండలు.. బొకేల కోసం ఖర్చుచేసే ప్రతి రూపాయి కూడా ఎలాంటి ఆసరా లేని నిస్సహాయులకు, అన్నార్తుల కోసం వెచ్చించి పట్టెడన్నం పెట్టండి. నేను చాలా సంతోషపడతాను. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీర్వాదం ఎళ్లవేళలా ఉండాలి. ఊపిరి ఉన్నంత వరకు మీ ఆదరాభిమానాలతో కళామతల్లికి సేవ చేస్తూనే ఉంటా’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు.