breaking news
Sonagachi
-
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: ఆ మహిళలవి ప్రాణాలు కావా!!
‘పేద, దిక్కు మొక్కు లేని స్త్రీల హత్యలు పేపర్లలో వస్తుంటాయి. ఆ తర్వాత ఆ కేసులు ఏమయ్యాయో మీరెప్పుడైనా పట్టించుకున్నారా?’ అని అడుగుతుంది రిజులా దాస్. కోల్‌కతాలోని అతి పెద్ద రెడ్‌లైట్ ఏరియా ‘సోనాగాచి’లో ఎవరికీ పట్టని వేశ్యల హత్యల నేపథ్యంతో ఆమె రాసిన ‘ఏ డెత్ ఇన్ సోనాగాచి’ నవల విశేషంగా పాఠకాదరణ పొందింది. వెబ్ సిరీస్‌గా కూడా రానుంది. వేశ్యల జీవితాలపై ఎన్ని నవలలు వచ్చినా వారి గురించి సంపూర్ణంగా తెలిసే అవకాశం లేదు అంటున్న రిజులా ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో తన పుస్తకానికై చేసిన పరిశోధన గురించి మాట్లాడింది. ‘మురికివాడల్లో ఉన్న స్త్రీలు, భవన నిర్మాణ రంగంలో ఉన్న స్త్రీలు, కూలి పని చేసే మహిళలు, వేశ్యలు, ఇంకా ఇలాంటి మార్జినలైజ్డ్ సెక్షన్లలో ఉన్న ఆడవాళ్లలో ఎవరైనా హత్యకు గురైతే ఈ వార్త పేపర్లలో వస్తుంటుంది. మనం చదువుతాం. ఆ తర్వాత సౌకర్యంగా మర్చిపోతాం. ఆ హత్యలు చేసింది ఎవరో వారికి శిక్ష పడిందో లేదో పట్టించుకోము. మన సమాజంలో కొందరి ప్రాణాలకే విలువ. ఆ ప్రాణాలు తీసింది ఎవరో మనకు తెలియాలి. కాని ఇలాంటి స్త్రీలు మరణిస్తే ఎవరికీ పట్టదు. పోలీసులకూ పట్టదు. వారివి ప్రాణాలు కాదా? వారు చంపదగ్గ వారే అనుకుంటున్నామా మనం’ అంటుంది రిజులా దాస్. ఆమె రాసిన తొలి నవల ‘ఏ డెత్ ఇన్ సోనాగాచి’ గత సంవత్సరం విడుదలైంది. త్వరలో అమెరికన్ ఎడిషన్ రానుంది. ఇప్పటికే వెబ్ సిరీస్‌కు కూడా తీసుకున్నారు. ‘మీరు వెంటనే ఇదేదో మర్డర్ మిస్టరీ అని చదవడానికి బయలుదేరకండి. నా నవల యాంటీ మర్డర్ మిస్టరీ... యాంటీ థ్రిల్లర్. సమాజంలో ఒక అనామక స్త్రీ చనిపోతే ఆ కేసు తేలకపోవడం గురించి మీకెలా చింత లేదో నా నవలలో హత్యకు గురైన వేశ్య కేసు తేలాలన్న చింత నాకూ లేదు. సమాజంలో ఏ ధోరణి ఉందో ఆ ధోరణే నా నవలలో ఉంటుంది’ అంటుందామె. కోల్‌కతాకు చెందిన రిజులా దాస్ చాలా ఏళ్లుగా న్యూజిలాండ్‌లో ఉంటోంది. ఆమె అక్కడ క్రియేటివ్ ఫిక్షన్లో పిహెచ్డి చేసింది. తన తొలి నవల రాయడానికి దక్షిణ ఏసియాలోనే అతి పెద్ద రెడ్‌లైట్ ఏరియా అయిన ‘సోనాగాచి’ (కోల్‌కతా) గురించి ఆమె దాదాపు నాలుగైదేళ్లు పరిశోధన చేసింది. మరో రెండేళ్లు రాసింది. అంటే ఈ మొత్తం పనికి ఆమె ఏడేళ్లు వెచ్చించింది. ‘దీనిని రాసే ముందు నేను ఇది రాయడానికి అర్హురాలినా కాదా చూసుకున్నాను. ఎందుకంటే నాకు ఆ జీవన నేపథ్యం లేదు. ఆ కష్టాలూ తెలియదు. కాని వారు అలా ఉండటానికి నేనూ నా నగరం కోల్‌కతా నా సమాజం కారణమే కదా అనుకున్నాను. అందుకే సోనాగాచి స్త్రీలను విడిగా కాకుండా కోల్‌కతాలో భాగంగా తీసుకున్నాను. నగరం ప్రమేయం లేకుండా సోనాగాచి లేదు’ అంటుందామె. సోనాగాచిలో దాదాపు 50 వేల మంది వేశ్యలు ఉంటారు. వీరిని ఆధారం చేసుకుని ‘మేడమ్‌లు’, ‘బాబూలు’, పింప్స్... వీళ్లతో కుమ్మక్కు అయిన పోలీసులు... వేశ్యలను బాగు చేస్తాం అని తిరిగే సోషల్ వర్కర్లు... ఆధ్యాత్మిక మార్గం పట్టిస్తాం అని చెప్పే భక్త శిఖామణులు... ఇదంతా పెద్ద వ్యవస్థ. ‘అసలు సోనాగాచిలో ఉన్న సెక్స్‌వర్కర్లు తమను రక్షించి ఈ మురికి కూపం నుంచి బయటపడేయమని మనల్ని అడుగుతారా... లేదా వారి మానాన వారిని వదిలేయమంటారా అనేది మనం ఎప్పటికీ కనిపెట్టలేం’ అంటుంది రిజులా దాస్. ఆమె ఈ నవలను ‘లలీ’ అనే వేశ్య పాత్ర ద్వారా చెబుతుంది. నాసిరకం సరసకథలు రాసే రచయిత ఆమె ప్రియుడు. సోనాగాచిలో ఒక వేశ్య దారుణంగా హత్యకు గురైతే వ్యవస్థ అంతా ఇది మామూలే అని ఊరుకుంటుంది. కాని రిజులా ఏం చెబుతుందంటే అలా జరిగిన హత్యలు అంతటితో ఆగవు... అవి సోనాగాచిలో ఒక దానితో ఒకటిగా కలిసి అనేక స్త్రీ వ్యతిరేక ఘటనలకు కారణం అవుతాయి అని. ‘ఈ నవల రాసేప్పుడే డిమానిటైజేషన్ వచ్చింది. సెక్స్వర్కర్లది నోట్ల ఆధారిత వ్యవస్థ. ‘మేము ఎయిడ్స్ విజృంభించినప్పుడు తట్టుకుని నిలబడ్డాం కాని డిమానిటైజేషన్లో మాత్రం పూర్తిగా పతనమయ్యాం. అంతటి ఘోరమైన దెబ్బ మా జీవితాల్లో ఎరగం’ అని వారు అన్నారు. ఈ ముఖ్య పరిణామాన్ని నా నవలలో పెట్టడానికి మళ్లీ రీరైట్ చేశాను’ అంటుంది రిజులా. సెక్స్‌వర్కర్ల దగ్గర ఉన్న చాయిస్ ఏమిటి? సోనాగాచి విడిచిపెట్టి వెళ్లాలి అంటే వాళ్లకు పచ్చళ్లు పెట్టడం నేర్పించి పంపించేస్తే చాలా? లేదంటే సోనాగాచిలోనే ఉండిపోవాలి అంటే ఈ హింసాత్మకమైన బతుకును ఇలాగే బతకాలా? వారికి ఉన్న చాయిస్ ఏమిటి? సమాజం ఇచ్చే చాయిస్ ఏమిటి? ఈ ప్రశ్నలను లేవనెత్తుతూ ఈ నవల ముగుస్తుంది. ఇంగ్లిష్, బెంగాలీలలో రాసే రిజులా బాల్యంలో రష్యన్ సాహిత్యంతో ప్రభావితమైంది. రష్యన్లో కుప్రిన్ రాసిన ‘యమకూపం’ వేశ్యల మీద వచ్చిన గొప్ప నవల. ఇప్పుడు ఈమె రాసింది ఈ దేశ వేశ్యావాటికలను అర్థం చేయించే సమర్థమైన నవల. ఈ రెండూ మీరు చదవతగ్గవే. సోనాగాచిలో దాదాపు 50 వేల మంది వేశ్యలు ఉంటారు. వీరిని ఆధారం చేసుకుని ‘మేడమ్‌లు’, ‘బాబూలు’, పింప్స్... వీళ్లతో కుమ్మక్కు అయిన పోలీసులు... వేశ్యలను బాగుచేస్తాం అని తిరిగే సోషల్ వర్కర్లు... ఆధ్యాత్మిక మార్గం పట్టిస్తాం అని చెప్పే భక్త శిఖామణులు... ఇదంతా పెద్ద వ్యవస్థ. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
హెచ్ఐవీ నివారణ కోసం వినూత్న ప్రాజెక్టు
కోల్‌కతా: ఆసియాలో వేశ్యావాటికలకు పేరెన్నిక గల కోల్‌కతాలోని సోనాగచి ప్రయోగాత్మక ప్రాజెక్టుకు ఎంపికైంది. హెచ్ఐవీ నిరోధక ఔషధాన్ని ఇక్కడి సెక్స్ వర్కర్లు ఇవ్వనున్నారు. డిసెంబర్లో మొదలయ్యే ప్రాజెక్టుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి అన్ని అనుమతులు లభించాయి. హెచ్ఐవీ సోకిన వ్యక్తితో సంభోగం జరిపిన హెచ్ఐవీ లేని సెక్స్‌వర్కర్లకు హెచ్ఐవీ నివారక ఔషధాన్ని అందజేస్తారు. ప్రాజెక్టుకు మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
కోల్‌కతాలో సెక్స్ వర్కర్ల ఉత్సవం
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో బుధవారం నుంచి ఆరు రోజుల పాటు సెక్స్ వర్కర్ల ఉత్సవాలు జరగనున్నాయి. చిన్నారులను బలవంతంగా తరలించి వారిని వ్యభిచార రొంపిలోకి దించడాన్ని అరికట్టడంపై ఈసారి ఈ ఉత్సవాలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాయి. దాంతోపాటు, సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి కూడా కృషి చేస్తాయి. మొత్తం 14 రాష్ట్రాలకు చెందిన వేలాది మంది సెక్స్ వర్కర్లు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. దర్బార్ మహిళా సమన్వయ కమిటీ (డీఎంఎస్సీ) అనే సంస్థ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. నగరంలోని ట్రయాంగ్యులర్ పార్కులో ఫిబ్రవరి మూడో తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలలో ప్రతిరోజూ మూడు వేల మందికి తగ్గకుండా పాల్గొంటారని భావిస్తున్నారు. వేదిక చాలా చిన్నది కాబట్టి, కేవలం మూడువేల మందికి మాత్రమే ఆతిథ్యం ఇవ్వగలమని చెప్పారు. సినిమా స్క్రీనింగులు, థియేటర్లు, నృత్యాల ద్వారా తమ వర్గం మహిళలకు స్ఫూర్తినిస్తామని కమిటీ అధికార ప్రతినిధి మహాశ్వేతా ముఖర్జీ తెలిపారు. -
గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
టీనేజ్ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఇద్దరు యువకులను హౌరా, కొల్కత్తా స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గత రాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. వారిని కోర్టులో హారుపరుచగా న్యాయమూర్తి నిందితులకు రిమాండ్ విధించారని చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... 24 పరిగణ జిల్లాలోని రాజర్ ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యాచారానికి బాధితురాలు వైద్య సహాయకురాలిగా విధులు నిర్వర్తిస్తుందని తెలిపారు. అయితే ఆ యవతి విధులు నిర్వహించిన అనంతరం నివాసం చేరుకునేందుకు బిదాన్ నగర్ రైల్వే స్టేషన్ చేరుకునేందుకు ప్రవేట్ వాహనం ఎక్కింది. ఆ వాహనం కొంత దూరం వెళ్లిన తర్వాత అప్పటికే ఆ వాహనంలో ఉన్న ఇద్దరు యువకులు ఆ యువతిపై డ్రైవర్ కళ్ల ఎదుటే సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దాంతో ఆ యువతి సృహ కొల్పోయింది. సృహ వచ్చి చూసుకునే సరికి కొల్‌కత్తాలోని వ్యభిచార కేంద్రమైన సోనాగాచ్లోని గదిలో పడి ఉండటంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఇద్దరు యువకులను పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేశారు.