breaking news
Sankarabharanam movie
-
భారతీయ సినీ స్వర్ణాభరణం... శంకరాభరణం
సంప్రదాయ సంగీతం నేర్చుకోవడానికి కొన్ని వందల మందిని మళ్ళీ ప్రోత్సహించి, గురుశిష్య బంధమనే హృద్యమైన అంశాన్ని పవిత్రంగా చెప్పిన వెండితెర కావ్యం అది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి లాంటి సుప్రసిద్ధ సంగీత, నృత్య విద్వన్మణుల మొదలు రాజ్‌కపూర్ లాంటి సినీ దిగ్గజాల దాకా అందరినీ ఆకట్టుకున్న కళాఖండం అది. చివరకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు లాంటి ఆధ్యాత్మికవేత్తలు సైతం అందులోని ఆధ్యాత్మిక నిగూఢార్థాలపై ప్రవచనం చెప్పిన అపూర్వ గౌరవం దక్కించుకున్న చిత్రరాజం అది.వెరసి, నాలుగున్నర దశాబ్దాలు దాటినా... నేటికీ తెలుగు సినీ ఆణిముత్యాలంటే ముందు వరుసలో చెప్పుకొనే అరుదైన సినిమా ‘శంకరాభరణం’. అలాంటి ‘శంకరాభరణం’ రూపకల్పన యజ్ఞం గురించి ఆ చిత్రానికి దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసిన నేటి ప్రముఖ దర్శకుడు – రచయిత వంశీ ఆ సినిమా తొలి రిలీజ్ సమయంలోనే వెండితెర నవల రాశారు. చాలా కాలంగా అందుబాటులో లేని ఆ నవల కె. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఇటీవలే మరోమారు కొత్త హంగులతో జనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ‘శంకరాభరణం’లోని అనేకానేక విశేషాల్లో కొన్ని...అది 1980... మద్రాసు (ఇప్పటి చెన్నై) మౌంట్‌రోడ్‌లో అణ్ణా ఫ్లై–ఓవర్ సమీపంలోని సత్యం థియేటర్ కాంప్లెక్స్... అందులో ఒక సినిమా అప్పటికి 20 వారాలుగా విశేష జనాదరణతో ఆడుతోంది. అయినా సరే కొత్త రిలీజ్ సినిమా చూసేందుకు వస్తున్నట్లుగా తమిళ ప్రేక్షకులు ఉత్సాహంగా వస్తూనే ఉన్నారు. అదేమీ ఏ తమిళ సూపర్‌స్టార్ సినిమానో కాదు. ఆ మాటకొస్తే అసలు తమిళ సినిమానే కాదు. పదహారణాల తెలుగు సినిమా. మాటలూ,పాటలూ కూడా తమిళంలోకి అనువాదం చేయని పక్కా తెలుగు సినిమా. అయితేనేం... ఉత్తమ కళా సృజనకూ, ఉత్తమ సంగీతానికీ భాష,ప్రాంతం అడ్డుగోడలు కావని మరోసారి నిరూపితమైంది. అలా తమిళ ప్రేక్షకులే కాదు... కన్నడ, మలయాళ ప్రేక్షకులూ నెత్తిన పెట్టుకున్న ఆ సినిమా... ప్రపంచమంతటా తెలుగువాడు ఇవాళ్టికీ శిరసెత్తి గర్వంగా చెప్పుకొనే సినీ చిరునామా... ‘శంకరాభరణం’. తెలుగులోనే... తమిళ, మలయాళ సీమల్లోనూ!ఆ సినిమాలో కథానాయకుడు శంకరశాస్త్రిపాత్ర వయసు అరవైకి దగ్గర! కీలకపాత్ర పోషించిన నర్తకి అప్పటికి వ్యాంప్ వేషాలేస్తున్న నటి. సినిమాలో డ్యూయెట్లు లేవు... ఫైట్లూ లేవు. పైగా అంతా సంగీతం... అదీ సంప్రదాయ సంగీతం! కానీ,ప్రాంతమేదైనా ప్రేక్షకుల అభిరుచి గొప్పది. బాక్సాఫీస్ సూత్రాలకు విరుద్ధమైన ఆ తెలుగు సినిమా భాషల ఎల్లలు దాటి దశాబ్దాల పైచిలుకు క్రితమే దేశాన్ని జయించింది. తమిళనాడు, కేరళ, కర్ణాటకతో సహా అన్నిచోట్లా తెలుగులోనే రజతోత్సవాలు జరుపుకొని, ప్రపంచాన్ని ముక్కున వేలేసుకొనేలా చేసింది. అది దర్శకుడు కె. విశ్వనాథ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, ఇంకా మహదేవన్, వేటూరి, ఎస్పీబీ, వాణీజయరామ్, బాలూ మహేంద్ర, జంధ్యాల లాంటి ఎందరెందరో కళా ఋషుల తపఃఫలం.ఆ తెలుగు సినీ కళాఖండంలోని మాటలు మాత్రం మలయాళంలోకి డబ్బింగ్ చేసి,పాటలు అలాగే తెలుగులోనే ఉంచేసి, రిలీజ్ చేస్తే కేరళ రాష్ట్రంలో 25 వారాలు ఆడింది.పంపిణీదారులకు లక్షల్లో లాభాలు తెచ్చిపెట్టింది. మాటల్ని మాత్రం అనువాదం చేసి,పాటలను మాత్రం మాతృకలోవే యథాతథంగా ఉంచేసి ఒక సినిమాను విడుదల చేసిన చరిత్ర మరెక్కడాలేదు. అది మరో ఘనత. వెరసి, తెలుగు, తమిళ, మల యాళ సినీరంగాల్లో కనీవినీ ఎరుగని ఘట్టం ‘శంకరాభరణం’.అసలు హీరోలు... ఆ ఇద్దరే! చిన్న చిత్రాల పెద్ద హీరో చంద్రమోహన్ మినహా స్టార్లే లేని సినిమా ‘శంకరాభరణం’. ఈ సెల్యులాయిడ్ భగీరథ ప్రయత్నంలో సంగీతం, సాహిత్యాలే హీరోలని విశ్వనాథ్‌కు తెలుసు. అందుకే, సినిమాకు శ్రీకారం చుడుతూ,పాటల కంపోజింగ్ ప్రారంభమైన రోజునే గీత రచయిత వేటూరినీ, సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్‌నూ చూసి ఒకటే చెప్పారు. ‘నా కథలో హీరో అరవై ఏళ్ళ వృద్ధుడు. గ్లామర్ ఏ మాత్రం లేనివాడు. గ్లామరస్ హీరోయిన్ లేదు. డ్యూయట్లు, ఫైట్లు... అసలే లేవు. నాకున్నదల్లా మీరిద్దరే. మిమ్మల్ని చూసి, నేను ఈ ధైర్యం చేస్తున్నాను’ అంటూ దేవుడి పటం దగ్గర ఉన్న కొబ్బరికాయలు వేటూరి, మహదేవన్‌ల చేతికి ఇచ్చారు. స్వయంగా విశ్వనాథ్ తండ్రి – జ్యోతిశ్శాస్త్ర పండితుడైన కాశీనాథుని సుబ్రహ్మణ్యం పెట్టిన ఆ మహత్తర ముహూర్త వేళావిశేషం... సినిమాకు అద్భుతమైన సాహిత్యం, సంగీతం అమరాయి. ఈ సంగీత ప్రధాన చిత్రం తాలూకు ఇతివృత్తం వగైరా తెలుసు గనక, నిర్మాతల్లో ఒకరైన ఏడిద నాగేశ్వరరావు తోడల్లుడు ఆకాశం శ్రీరాములు గారి భార్య తమ ఇంట్లో ప్రాచీన సంప్రదాయ కీర్తనలు రాసుకున్నపాత నోట్ పుస్తకం తీసి, దర్శకుడు విశ్వనాథ్‌కు ఇచ్చారు. తీస్తున్న సబ్జెక్ట్ మీద అభిరుచి గల నిర్మాతలు, వారి కుటుంబాలు సైతం ఎంతగా తపించేవో చెప్పడానికి అదో మచ్చుతునక. మొత్తానికి ‘ఏ తీరుగ నను...’ – ‘పలుకే బంగారమాయెనా...’ లాంటి రామదాసు కీర్తనలు, ‘మానస సంచరరే...’ లాంటి సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, ‘బ్రోచేవారెవరురా...’ లాంటి మైసూరు వాసుదేవాచార్య కీర్తనలు, ఆ మహత్తర సంప్రదాయ కీర్తనలకు దీటుగా నిలిచేలా సినిమాకు వేటూరి రాసిన ‘ఓంకార నాదాను సంధానమౌ గానమే...’, ‘శంకరా నాద శరీరాపరా...’ – ఇలా ప్రతిదీ ఆణిముత్యమే. అలాగే త్యాగరాయ కీర్తన ‘సామజవర గమనా...’ అన్న పల్లవిని తీసుకొని వేటూరి అల్లిన అద్భుతమైన లలిత యుగళ గీతం, త్యాగరాజ స్వామి నుంచి ‘దొరకునా ఇటువంటి సేవ’ అన్న మకుటం మాత్రం తీసుకొని రాసిన అద్భుతమైన పతాక సన్నివేశ గీతం చెరిగిపోని సినీ ప్రయోగాలు.అభినయ ప్రధాన దృశ్యకావ్యం గనక తెరపై సంభాషణలు తక్కువే అయినా, జంధ్యాల ఆర్ద్రంగా రాసిన అద్భుతమైన ఆ కొద్ది మాటలు కూడా మనసుపై చెరగని ముద్ర వేశాయి.ఈ సెల్యులాయిడ్ సంగీత, దృశ్య ప్రధాన చిత్రానికి ఛాయాగ్రహణం – సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ బాలూ మహేంద్ర. అయితే, సినిమా సగంలో ఉండగానే, ఆయనకు అనుకోని ఛాన్స్ రావడంతో దర్శక, నిర్మాతలకు చెప్పి, ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చారు. అయితేనేం, ఆయన సహాయకుడైన కస్తూరి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టి, మిగిలిన చిత్రాన్ని ఎలాంటి తేడా కనిపించకుండా అందంగా తెరకెక్కించారు. ప్రాణం పోసినా... పోల్చుకొని గొప్పలు చెప్పని ఎస్పీబీ!‘శంకరాభరణం’ సినిమా నిర్మాణ సమయంలో తోటి గాయని వాణీ జయరామ్‌కు భిన్నమైన పరిస్థితి ఎస్పీబీది. ఆమె లాగా కర్ణాటక సంగీతం శాస్త్రీయంగా గురువుల వద్ద పెద్దగా నేర్చుకోలేదు ఆయన. అందుకని ఈ పాటలు పాడేందుకు గాయకుడు ఎస్పీబీ ప్రాణం పెట్టి, ఎంతో శ్రమించారు. సంగీత దర్శకుడు మహదేవన్ సారథ్యంలో, మరీ ముఖ్యంగా ఆయన సహాయకుడు పుహళేంది శిక్షణలో అమితంగా సాధన చేశారు. పాటల సాహిత్యాన్నీ, కథలో అవి వచ్చే ఆ యా సందర్భాలనూ మనసు నిండా నింపుకొని, ప్రతి అక్షరానికీ ప్రాణం పోసి, అచ్చం కర్ణాటక సంగీత విద్వాంసుడు పాడారనిపించేలా చేశారు. ఫలితంగా, ‘శంకరాభరణం’లో ఎస్పీబీ గానాన్ని మెచ్చనివారు లేరు.ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడి కథగా అల్లుకున్న ఇంత సంగీత ప్రధానమైన చిత్రం... అంతకు అంత విజయం సాధించడం, భాషల తేడా లేకుండా దక్షిణాది అంతటా ప్రేక్షకులను పరవశంలో ముంచెత్తి తెలుగు పాటలను పాడుకొనేలా చేయడం అంతకు ముందెప్పుడూ జరగలేదు. తెలుగు సినీ చరిత్రలో అలాంటి అద్భుతం జరగడం అదే ప్రథమం. అలాగని గతంలో ఇలాంటి పాటలెన్నో పాడిన ‘అమర గాయకుడు’ ఘంటసాలతో ఎస్పీబీ ఎప్పుడూ తనను తాను పోల్చుకోలేదు. ఆయన కన్నా తాను అధికుడినని చెప్పుకోలేదు. ఏ చెమ్చాలతోనూ పత్రికల్లో రాయించుకో లేదు. సమీక్షకులు సైతం ఘంటసాలను ఎస్పీబీ మించిపోయాడని రాయనూ లేదు. ఒక పెద్ద హిట్ రాగానే ఎన్టీఆర్, ఎమ్జీఆర్ లాంటి అగ్ర హీరోలతో పోల్చుకొని, వారిని అధిగమించేశామంటూ, పత్రికల్లో రాయించుకొనే రోజుల్లో చాలామందికి భిన్నంగా నిలిచారు ఎస్పీబీ. అది ఆయన విజ్ఞత, వినయం, అసలైన కళ పట్ల – తోటి కళాకారుల పట్ల ఉన్న గౌరవం. ఆమె ఇమేజ్ను మార్చేసిన ఆపాత్ర! అప్పటి దాకా వ్యాంప్ తరహాపాత్రలకే పరిమితమైన మంజుభార్గవిని ‘శంకరాభరణం’లోని పవిత్రమైన తులసిపాత్రకు ఎంచుకోవడం విశ్వనాథ్ చేసిన విచిత్ర సాహసమే. మొదట ఆపాత్రకు హీరోయిన్ జయప్రదను అనుకున్నా, ఆమె డేట్స్ సర్దుబాటు కాలేదు. జ్యోతి అనే మరో అమ్మాయిని ఎంపిక చేసినా, అదీ కుదరలేదు. చివరకు మేకప్‌లేని మంజుభార్గవి స్టిల్స్ తెప్పించుకొని, ప్రారంభ పరీక్షల అనంతరం ఆమెను తులసిపాత్రకు ఎన్నుకున్నారు. అంతకు ముందు ధరించిన తరహాపాత్రలను ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాణ కాలంలో అంగీకరించవద్దని విశ్వనాథ్ ఆమెకు చెప్పారు. అలాగే, ఆమె ఆ షూటింగ్ సమయంలో 20 అవకాశాలొచ్చినా నో చెప్పారు. తీరా, సరిగ్గా ‘శంకరాభరణం’ విడుదల రోజునే అక్కినేని ‘నాయకుడు– వినాయకుడు’ రిలీజైంది. ఒకపక్క ‘శంకరాభరణం’లో పరమ పవిత్రమైన తులసిపాత్ర పోస్టర్లు. ఎదురుగా ఉన్న మరో థియేటర్లోనేమో... శృంగారభంగిమల్లో మంజుభార్గవి పోస్టర్లు. అదీ పరిస్థితి. ‘శంకరాభరణం’ యూనిట్ మొదట కంగారుపడ్డా, ఆఖరికి శృంగారం కన్నా సంగీతమే బంగారమైంది. జనం తులసిదళం వైపే తూగారు. అక్కడ నుంచి మంజు ఇమేజే మారి పోయింది. విశ్వనాథ్ వెండితెర విశ్వరూపం శంకరశాస్త్రిపాత్రధారి జె.వి. సోమయాజులు, తులసిపాత్రధారిణి మంజుభార్గవి, ఆత్మీయ మిత్రుడిపాత్రలో అల్లు రామలింగయ్య మొదలు ‘శంకరాభరణం’ నటీనటులందరికీ పట్టరానంత పేరొచ్చింది. శంకరశాస్త్రి కుమార్తె శారదగా నటించిన హీరోయిన్ రాజ్యలక్ష్మికైతే ఇప్పటికీ ‘శంకరాభరణం’ రాజ్యలక్ష్మిగానే పేరు, గుర్తింపు. గాయనీ గాయకులు, సంగీత దర్శకుడు... ఇలా టెక్నీషియన్ల సంగతైతే చెప్పనే అక్కరలేదు. అందరికీ అంత పేరొచ్చినా... దానికి మూలకారకుడు దర్శకుడు కె. విశ్వనాథే. నిజానికి, ‘శంకరాభరణం’ పూర్తిగా డైరెక్టర్స్ ఫిల్మ్. ప్రతి సన్నివేశాన్నీ ముందే క్షుణ్ణంగా ఊహించుకొని, మనసులో రూపకల్పన చేసుకొని, దాన్ని అద్భుతంగా చిత్రీకరించిన గొప్పదనం విశ్వనాథ్‌ది. విశ్వనాథ్ అంతకు ముందు మంచి చిత్రాలు అందించక పోలేదు. బాక్సాఫీస్ హిట్లూ తీయక పోలేదు. దర్శకులలో ప్రముఖుడిగా ప్రఖ్యాతి పొందక పోలేదు. కానీ, ‘శంకరాభరణం’ వాటన్నింటినీ అధిగమించి మరో కొత్త మైలురాయిని నాటింది. అసలు కేవలం శాస్త్రీయ సంగీత కళను కథావస్తువుగా తీసుకొని, చిత్రంగా మలచాలనుకోవడమే సాహసం. అంతటి సాహసంలోనూ, నిర్మాతకు కీర్తితోపాటు బాక్సాఫీస్ కనకాన్నీ సాధించి పెట్టడం విశ్వనాథ్ మాత్రమే చేసిన అరుదైన విన్యాసం. మాస్ ప్రేక్షకుల హృదయాన్ని కూడా క్లాస్ ప్రేక్షకుల రసహృదయ స్థాయికి తీసుకువెళ్ళిన విశ్వనాథ్ వెండితెర మ్యాజిక్ ‘శంకరాభరణం’. తారలే స్టార్లు కాదనీ, కథాసంవిధానమే అసలైన స్టారని నిరూపించారు. దశాబ్దాల తర్వాత తమిళంలో‘శంకరాభరణం’ తొలిసారి రిలీజైన దాదాపు మూడున్నర దశాబ్దాల తరువాత... మళ్ళీ అదే మద్రాసు. 2015 మార్చి 13న మన ‘శంకరాభరణం’ మరోసారి విడుదలైంది. అయితే, ఈసారి నవతరం తమిళులకు కూడా దగ్గరయ్యేలా పూర్తిగా తమిళంలో వచ్చింది. తెలుగు నుంచి తమిళంలోకి అనువదించిన మాటలు,పాటలతో వచ్చింది! ఆధునిక డిజిటల్ సాంకేతికతను వినియోగించుకొని, కలర్ కరెక్షన్లన్నీ చేసుకొని, సంగీతాన్ని డిజిటల్ మాస్టరింగ్ చేసుకొని సరికొత్త హంగులతో తమిళనాట థియేటర్లలో డిజిటైజ్డ్ వెర్షన్‌గా రిలీజైంది! అలా మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత ఒక భాష నుంచి మరో భాష డబ్బింగైన సినిమాగా మళ్ళీ చరిత్రకెక్కింది. కొన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాలను కలర్లోకి మార్చడం, డిజిటల్ వెర్షన్‌లోకి మార్చి విడుదల చేయడం అప్పటికే జరిగాయి. కానీ, అలా అన్ని దశాబ్దాల తరువాత ఒక క్లాసిక్... మరో భాషలోకి అనువాదమవడం విశేషం. అదీ మాతృక విజయం సాధించేసిన చోటకే మళ్ళీ డబ్బింగ్ చేసి విడుదల చేయడం ప్రపంచ సినీ చరిత్రలోనే ఎప్పుడూ ఎక్కడా జరగలేదు.అన్నేళ్ళ తర్వాతా... ఆ గాయకులే! అంతేకాదు... తెలుగు మాతృకలోపాడిన ఎస్పీబీ, ఎస్. జానకి, వాణీ జయరామ్‌లతోనే మళ్ళీ అన్నేళ్ళ తరువాత అవేపాత్రలకు తమిళ డబ్బింగ్ ‘శంకరాభరణం’లోనూపాటలుపాడించారు. 33 ఏళ్ళ వయసులో ఉండగా తెలుగులో ఆపాటలుపాడి, రికార్డ్ చేసిన ఎస్పీబీ సుమారు ముప్ఫై అయిదేళ్ళ విరామం తరువాత 68 ఏళ్ళ వయసులో మళ్ళీ తమిళంలో ఆ గీతాలు ఆలపించి, ఆశ్చర్యపరిచారు. ఈ ప్రాజెక్ట్ మీద గౌరవంతో అందరూ దాదాపుపారితోషికం తీసుకోకుండానే ‘శంకరాభరణం’ తమిళ అనువాద గీతాలనుపాడారు. ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఓ ప్రింట్!భాష తెలియక పోయినా, తెలుగు ‘శంకరాభరణం’కి తమిళనాట ఒకప్పుడు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమా చూసేందుకు వివిధ రంగాల ప్రముఖులు ఉవ్విళ్ళూరారు. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర సంఘం)లో నటుడు ‘మేజర్’ సౌందరరాజన్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఒక ప్రింటే ఉంచేశారు. హీరోలు శివాజీగణేశన్, శివకుమార్ సహా ఎంతో మంది కోసం ఎన్ని ప్రత్యేక ప్రదర్శనలు వేశారో లెక్క లేదు. తెలుగు ‘శంకరాభరణం’ ఇద్దరు ప్రసిద్ధ తమిళ నటుల్ని సినీ పంపిణీదారులుగా కూడా మార్చేసింది. ‘‘సినిమా విపరీతంగా నచ్చిన నటుడు ‘మేజర్’ సౌందరరాజన్, నటి మనోరమతో కలసి మద్రాస్‌తో సహా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపిణీ హక్కులు కొన్నారు. అది ఒక విశేషం. కోట్ల విలువైన ఆ ‘గోల్డెన్ డిస్క్’ ఆల్బమ్ అప్పట్లో పండితుల నుంచిపామరుల దాకా ‘శంకరాభరణం’లోనిపాటలు విననివారు, కూనిరాగం తీయనివారు అరుదు. ఆ రోజుల్లోనే ఆ సినిమాపాటల క్యాసెట్లు మన దేశంలో వేలసంఖ్యలో అమ్ముడై, గోల్డెన్ డిస్క్ సాధించింది. ఆ సందర్భంగా సభకు కర్ణాటక సంగీత విదుషీమణి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి హాజరై, ఆ జ్ఞాపికను నిర్మాతకు అందజేశారు. ఆ రోజుల్లో స్వల్ప మొత్తానికే విక్రయించిన ఈ చిత్రం ఆడియో హక్కులు ఇవాళైతే, కొన్ని లక్షలు కాదు... కోట్లు విలువ చేసేదని సినీ సంగీత వ్యాపార వర్గాల మాట. వందేళ్ళ పని... ఒక్క సినిమా చేసింది!తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి ఎమ్జీయార్తోపాటు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పద్మా సుబ్రహ్మణ్యం, చిత్రా విశ్వేశ్వరన్ లాంటి సంప్రదాయ సంగీత, నృత్య దిగ్గజాలందరూ మద్రాసులో ‘శంకరాభరణం’ అభినందన సభకు హాజరయ్యారు. ఆ సభలో సాక్షాత్తూ సెమ్మంగుడి మాట్లాడుతూ, ‘‘కర్ణాటక సంగీతాన్నిప్రోత్సహించడానికి నూరేళ్ళుగా మా ‘మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ’ చేస్తున్న కృషికి సమానమైన కృషిని ఈ ఒక్క సినిమా చేసింది’’ అని ప్రశంసించారు. అడిగితే చేసేవాడినన్న ఎన్టీఆర్!ఎప్పుడో ‘సిరిసిరిమువ్వ’ షూటింగ్ కోసం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు బోగీల కుదుపులో నిద్ర పట్టని వేళ దర్శక – రచయిత కె. విశ్వనాథ్ మనసుకు తట్టిన ‘శంకరాభరణం’ కథాబీజం చివరకు ఆ స్థాయికి చేరుతుందని ఆయన కూడా ఊహించలేదు. శంకరశాస్త్రిపాత్రకు మొదట అక్కినేని, కృష్ణంరాజు నుంచి శివాజీ గణేశన్ దాకా పలువురి పేర్లు చర్చకు వచ్చినా, చివరకు ఏ ఇమేజ్ లేని రంగస్థల నటుడు సోమయాజులుతో కథ తెరకెక్కింది. రక్తి కట్టింది. ప్రపంచమంతా పరవశాన శిరసూపిన ‘శంకరాభరణం’ని నాటి భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సహా ఎందరెందరికో దర్శక, నిర్మాతలు దగ్గరుండి మరీ చూపించారు. అగ్ర హీరో ఎన్టీఆర్‌కు ప్రత్యేకంగా ప్రొజెక్షన్ వేశారు. ఎన్టీఆర్ లోని అచ్చమైన కళాకారుడు పరమానంద భరితుడయ్యారు. అంతేకాదు... ‘డ్యూయెట్లు, గ్లామర్ లేని శంకరశాస్త్రిపాత్రకు ధైర్యం చేయలేక, మీరు నన్ను అడగలేదు కానీ అడిగి ఉంటే తప్పకుండా నేనే చేసేవాణ్ణి’ అన్నారు ఎన్టీఆర్. మనవాడున్నా మనకే అన్యాయం!‘శంకరాభరణం’ రిలీజైన 2 నెలలకు ఏప్రిల్‌లో నేషనల్ అవార్డుల ప్రకటన జరిగింది. 1980లో రిలీజైనప్పటికీ, నిర్మాణం – సెన్సారింగ్ అంతకు ముందు ఏడాదే పూర్తవడంతో 1979 అవార్డులకు ఈ సంగీత ప్రధాన చిత్రమూ పోటీ పడింది. ఆ 27వ జాతీయ అవార్డుల్లో ఆ ఏటి ఉత్తమ చిత్రంగా ఒరిస్సాలో రూపొందిన తొలి హిందీ సినిమా ‘శోద్’ స్వర్ణకమలం సాధించింది. ఒరిస్సాలో ఓ గ్రామంలో దారిద్య్రం, దోపిడీ, మూఢనమ్మకాలపై పోరాడే యువకుడి కథ అది. ‘శంకరాభరణం’కి ‘అత్యధిక ప్రజాదరణ, పూర్తిస్థాయి వినో దం, కళాత్మక విలువలు నిండిన’ చిత్రంగా స్వర్ణకమలం వరించింది.జాతీయ అవార్డులు మొదలయ్యాక, ఉత్తమ చిత్రాల కేటగిరీలో ఒక తెలుగు సినిమా ‘స్వర్ణకమలం’ సాధించడం అదే ప్రప్రథమం. అది సంతోషకరమే. అయితే, విచిత్రం ఏమిటంటే... ఆసారి జ్యూరీకి సారథి సాక్షాత్తూ తెలుగు దర్శక, నిర్మాత ఎల్.వి. ప్రసాద్. అయినప్పటికీ, కారణాలేమో కానీ అన్ని అర్హతలూ ఉన్న ‘శంకరాభరణం’ కన్నా ఓ సాధారణ హిందీ చిత్రానికి ఆయన జ్యూరీ పెద్ద పీట వేయడం శోచనీయం. మరిచి పోలేని అన్యాయం. ఈ రోజుల్లో లాగా అవార్డులకు వీర పైరవీలు నడవని అప్పటి కాలం అది. ఇప్పటికీ ఆశ్చర్యపరిచే సంగతి.అప్పుడు ‘శంకరాభరణం’... ఇప్పుడు ‘బాహుబలి’!అయితే, సినిమాల్లో సంగీత విభాగానికి ఇచ్చే మొత్తం 3 జాతీయ అవార్డులూ (సంగీత దర్శకుడు, గాయకుడు, గాయని) ఆసారి ‘శంకరాభరణ’మే గెలుచుకుంది. ఆ ఏటి రాష్ట్ర అవార్డుల్లో 7 నందులతో (ఉత్తమ చిత్రం, గీత రచయిత, గాయకుడు, గాయని, సంగీత దర్శకుడు, బాలనటి, ద్వితీయ ఉత్తమ కథారచయిత) ‘శంకరాభరణం’కి పంట పండింది. ఇక ప్రైవేట్ పురస్కారాలు లెక్కే లేదు. ‘శంకరాభరణం’ తర్వాత మూడున్నర దశాబ్దాలకు 2015 నాటి సినిమాలకు ప్రకటించిన 63వ జాతీయ అవార్డుల్లో ‘బాహుబలి–1’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. తొలిసారిగా పూర్తిస్థాయిలో తెలుగు సినిమాకు ఆ గౌరవం తెచ్చింది. ‘శంకరాభరణం’ తర్వాత రెండోసారి స్వర్ణకమలం సాధించిన మనసినిమా అయింది.బాక్సాఫీస్ తుపాను!కొనుగోలుదారులు లేక రిలీజు కోసం నానా అవస్థలు పడిన ‘శంకరాభరణం’... తీరా రిలీజయ్యాక ఓ హిస్టీరియా. 19 కేంద్రాలలో రెగ్యులర్ షోలతో, సికింద్రాబాద్‌లోని మంజు థియేటర్లో నూన్‌షోలతో... వెరసి 20 కేంద్రాల్లో రిలీజైన సినిమా అన్ని కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. బళ్ళారి, ఖమ్మం కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం తర్వాత థియేటర్లలో నుంచి తీసివేయగా, మిగిలిన 18 సెంటర్లలోనూ (16 కేంద్రాల్లో రెగ్యులర్ షోలు, 2 కేంద్రాల్లో నూన్షోలు) శతదినోత్సవం జరుపుకొంది. ఆ అఖండ విజయం అంతటితో ఆగలేదు.9 కేంద్రాల్లో సినిమా సిల్వర్ జూబ్లీ ఆడింది. (విజయవాడ, వైజాగ్, తిరుపతి, హైదరాబాదుల్లో డైరెక్ట్‌గా, కాకినాడలో షిఫ్టులతో, గుంటూరు, రాజమండ్రి, సికింద్రాబాద్, అనంతపురంలో నూన్‌షోలతో ఆ ఘనత సాధించింది). విజయవాడ ‘అప్సర’లో 181 రోజులు ప్రదర్శితమైంది. హైదరాబాద్ కింగ్‌కోఠిలోని పేరొందిన రాయల్ థియేటర్లో 216 రోజులు ఆడింది. ఇక, హైదరాబాద్‌లోనే షిఫ్టులతో 350 రోజులు (గోల్డెన్ జూబ్లీ) ప్రదర్శితమైన ఘనత ‘శంకరాభరణం’ది. స్టార్లు లేకుండా... తొలి కోటి రూపాయల సినిమా!‘శంకరాభరణం’ రిలీజైన రెండో వారం నుంచే అనుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తెలుగునాట అంతటా, అన్ని థియేటర్లలో టికెట్ రేట్లను 15 శాతం పైగా పెంచింది. అనుకోకుండా పెరిగిన ఆ రేట్లు ఈ సంగీత భరిత చిత్రాన్ని కొనుగోలు చేసిన పంపిణీదారులకు కాసుల వర్షంలో కలిసొచ్చాయి. తెలుగు సినీ చరిత్రలో అప్పటి దాకా ఎన్టీఆర్ లాంటి అగ్రహీరో సినిమాలే కోటి రూపాయల వసూళ్ళు సాధించాయి. ఎన్టీఆర్ సినిమాలు ఏడింటి (‘లవకుశ’, ‘దానవీరశూర కర్ణ’, ‘అడవి రాముడు’, ‘యమగోల’, ‘వేటగాడు’, ‘డ్రైవర్ రాముడు’, ‘ఛాలెంజ్ రాముడు’) తరువాత కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమా ‘శంకరాభరణ’మే! అగ్ర హీరోలెవరూ లేకుండానే ఓ సంగీతభరిత చిత్రం అంత వసూలు చేయడం అపూర్వమైన రికార్డు. నలభై ఆరేళ్ళ తర్వాత... అదే నవలఇవాళ సుప్రసిద్ధుడైన కథా రచయిత – దర్శకుడు వంశీ అప్పట్లో సినీ రంగానికి కొత్త కుర్రాడు. దర్శకుడు కె. విశ్వనాథ్ వద్ద ఈ చిత్రానికి సహాయ దర్శకులలో ఒకరిగా పనిచేసిన నవ యువకుడు. అప్పటికే నవలలు రాసిన అనుభవం, అద్భుతమైన భావుకత వంశీ సొంతం. సినిమా హిట్టవడంతో, వెండితెర నవల వేయాలనే యోచన వచ్చింది. వంశీ ఆ బాధ్యతను ఆనందంగా స్వీకరించారు. సినిమా కథనూ, సన్నివేశాలనూ కళ్ళకు కట్టినట్టుగా నవల రూపంలో అందించారు. అంతేకాక, షూటింగ్ విశేషాలనూ కళ్ళకుకట్టేలా ఇచ్చారు. చిత్రాన్ని నిర్మించిన పూర్ణోదయా సంస్థ వారే ఈ వెండితెర నవలను సైతం జనం ముందుకు తెచ్చారు. నయాపైసాపారితోషికం తీసుకోకుండా బాపు గీసిన బొమ్మతో అందంగా తయారైన ఆ వెండితెర నవల తెగ అమ్ముడైంది. ఒకటికి మూడు ముద్రణలు పొందింది. ఆ నవల రాసినందుకు ఆ రోజుల్లోనే తనకు వెయ్యి రూపాయలుపారితోషికం ఇచ్చినట్టు వంశీ ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తు చేసుకుంటారు. చాలా కాలం అందుబాటులో లేని ఆ వెండితెర నవలను తాజాగా దర్శకుడు విశ్వనాథ్ పెద్ద కుమారుడు నాగేంద్రనాథ్ సహకారంతో, వంశీ మరింత కొత్త అందాలతో అపురూపంగా తీసుకొచ్చారు. సినిమాకు కావ్య గౌరవం... ఆధ్యాత్మిక ప్రవచన పర్వం... అందరినీ ఆకట్టుకున్న కళాఖండం ‘శంకరాభరణం’పై కాకినాడకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు 2016 ఆగస్టులో 3 రోజులపాటు ప్రవచనం చెప్పడం విశేషం. ఒక సినిమాపై ఒక సరస్వతీపుత్రుడు, ఆధ్యాత్మికవేత్త ప్రవచన రూపంలో విశ్లేషణ చేయడం సినీ చరిత్రలో అదే తొలిసారి. ఏమైనా, ఇవాళ్టికీ ‘శంకరాభరణం’లోని ప్రతి మాట, ప్రతిపాట, ప్రతిపాత్ర, ప్రతి దృశ్యం, ప్రతి అణువు... ప్రేక్షకులకు గుర్తుండి పోయింది. అంత గొప్పగా రూపొందించారు గనకనే... ‘శంకరాభరణం’ దర్శకుడిగా విశ్వనాథ్ విశ్వరూపం.ప్రముఖ రచయిత – జర్నలిస్టు రెంటాల గోపాలకృష్ణ అప్పట్లో అభిప్రాయపడినట్టు, ‘‘ఆ చిత్ర నిర్మాణ సమయంలో సాక్షాత్తూ శంకరుడో, లేక వాగ్దేవి సరస్వతీదేవో విశ్వనాథ్‌ను ఆవహించి ఉండాలి. అందుకే, ఆ చిత్రం ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లు రూ΄÷ందింది. సామాన్య నటీనటులతో ఇంతటి అసామాన్యమైన చిత్రాన్ని నిర్మించడం తేలికైన పని కాదు.’’ ఇవాళ చూసినా ఆద్యంతం అదే అనుభూతినిచ్చే ‘శంకరాభరణం’ విషయంలో అది అక్షరసత్యం.భాషల ఎల్లలు దాటిన... తెలుగు మాట,పాట!⇒ టాకీలు వచ్చిన కొత్తల్లో 1930లు, ’40లలో మన తెలుగు సినిమాలు తమిళ, మలయాళ సీమల్లో బాగా ఆడేవి. కానీ, ఏ హీరోలకు ఆ హీరోల సినిమాలుగా తెలుగు, తమిళాల్లో వర్గీకరణ వచ్చాక మన సినిమాలు తమిళనాట ఆడడం పెద్ద విశేషం. కమలహాసన్ నటించిన కె. బాలచందర్ ‘మరో చరిత్ర’ (1978) మద్రాస్‌లో ఒకే థియేటర్ (మౌంట్‌రోడ్‌లోని సఫైర్)లో, ఉదయం ఆటలతో 596 రోజులు ఆడి, ఇప్పటికీ రికార్డ్‌గా నిలిచింది. ఆ తరువాత... తెలుగునాట విడుదలైన కొద్ది రోజులకు చెన్నపట్నానికి వెళ్ళిన ‘శంకరాభరణం’ (1980) ఒక్క మద్రాస్‌లోనే కాక, తమిళనాడంతటా బాగా ఆడింది. రిపీట్ రన్లు సరే సరి! ⇒ మలయాళ సీమ సంగతికొస్తే... ‘ఏ.వి.ఎం’ స్టూడియో అధినేత మెయ్యప్ప చెట్టియార్‌కు సమీప బంధువైన ఒక డిస్ట్రిబ్యూటర్ కేరళ వరకు ఈ సినిమా హక్కుల్ని నటి మనోరమ వాళ్ళ నుంచి కొనుగోలు చేశారు. తెలుగు ‘శంకరాభరణం’ డైలాగుల్ని మాత్రం మలయాళంలోకి మార్చి,పాటల్ని యథాతథంగా తెలుగులోనే ఉంచి, రిలీజ్ చేశారు. తెలుగుపాటలతోనే కేరళలోనూ సినిమా పెద్ద హిట్. అక్కడి మైకుల్లో ‘శంకరా నాదశరీరాపరా...’ లాంటి మన తెలుగుపాటలు మారుమోగాయి. ఆర్థికంగా దెబ్బతిన్న ఆ డిస్ట్రిబ్యూటర్ కేవలం లక్షా 75 వేలకు హక్కులు కొంటే, ఆ రోజుల్లో కోట్లలో లాభం వచ్చింది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై, ఆయన గుండె పోటుతో మరణించారు. ⇒ ఆడియో గ్రామఫోన్లు, క్యాసెట్లు పోయి సీడీలు అమ్మే రోజులు వచ్చిన తర్వాత కూడా మలయాళ భాషలో ఇన్లే కార్డు వివరాలతోనే ‘శంకరాభరణం’ తెలుగుపాటల సీడీలు కేరళలో జోరుగా అమ్ముడవుతూ వచ్చాయి. ఇవాళ్టికీ, శబరిమల వెళుతుంటే మార్గమంతటా మన ‘శంకరాభరణం’ ఆడియో, వీడియోలు పలకరిస్తూనే ఉంటాయి. ⇒ కన్నడ సీమలోనూ... ఒక్క బెంగుళూరులోనే ఏకంగా 6 థియేటర్లలో (4 హాళ్ళలో నేరుగా, 2 హాళ్ళలో ఉదయం ఆటలతో) తెలుగు ‘శంకరాభరణం’ శతదినోత్సవం జరుపుకొంది. అది ఇప్పటికీ మరే తెలుగు సినిమాకూ దక్కని రికార్డు. ఒక సంగీత ప్రధానమైన మన సినిమా ఒక్క తెలుగులోనే కాక, ఇలా దక్షిణాది అంతటా నాలుగు భాషాప్రాంతాల్లోనూ విజయకేతనం ఎగరేయడం ఒక్క ‘శంకరాభరణ’మే సృష్టించిన చరిత్ర. ఇన్ని పరాయిభాషాప్రాంతాల్లోనూ కేవలం మన తెలుగులోనేపాటలే వినిపించడం, కుల – మత –ప్రాంతీయ – భాషా భేదాలు లేకుండా అన్ని వర్గాల వారినీ అలరించడం న భూతో న భవిష్యతి. ఆ పేరే ఒక ఆభరణం!∙అప్పట్లో తెలుగు ‘శంకరాభరణం’ను మొదట కొనడానికి తటపటాయించినప్పటికీ, తరువాత ధైర్యం చేసి ఈ సినిమాను విడుదల చేసిన పంపిణీదారులందరికీ పట్టిందల్లా బంగారమైంది. కర్ణాటకలో ఈ తెలుగు చిత్రాన్ని కె.ఆర్. ప్రభు అనే ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ విడుదల చేశారు. కేవలం రూ. 75 వేలకు హక్కులు కొన్న ఆయనకు అనేక లక్షల్లో డబ్బులొచ్చాయి. అలా ఆ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ ప్రభు జాతకమే మారిపోయింది. ఆ ఘనవిజయంతో చివరకు ఆయన తన ఇంటికే ‘శంకరాభరణం’ అని పేరు పెట్టుకున్నారు. అలాగే, చెన్నైలోని కామ్దార్నగర్లో కట్టుకున్న ఇంటికి నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ‘శంకరాభరణం’ అనే నామకరణం చేశారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఆ తరువాత ఆయన కట్టుకున్న ఇంటి పేరూ – ‘శంకరాభరణ’మే! నిజానికి, ఆ చిత్రం అందించిన ప్రోత్సాహంతో ఆ తరువాత ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’ లాంటి మరెన్నో అద్భుత కళాఖండాలను అందించినా ప్రపంచమంతా ఆయనను ఇప్పటికీ ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాతగానే నీరాజనం పడుతోంది.ఆ సినిమాయే... ఒకపాస్ పోర్ట్⇒ ‘శంకరాభరణం’ విడుదలైన తరువాత నటి మంజుభార్గవి ఒకసారి సింగపూర్‌కు వెళ్ళారు. అక్కడ మాల్లోని ఒక మహమ్మదీయ దుకాణంలో షాపింగ్ చేసుకొని వస్తుంటే, ఆ షాపు యజమాని ఆమెను ‘శంకరాభరణం’ నటిగా గుర్తుపట్టారు. అంతే! అంతటి కళాఖండంలో నటించిన వ్యక్తి నుంచి డబ్బులు తీసుకోను గాక తీసుకోనంటూ, ఆ సామాన్లన్నీ ఉచితంగా ఇచ్చారు. ⇒‘శంకరాభరణం’ విడుదలై, బాగా ఆడుతున్న రోజులవి. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు హైదరాబాద్‌లో సరోవర్ హోటల్‌కు ట్యాక్సీ ఎక్కి వస్తున్నారు. కారులో ఉన్నది సాక్షాత్తూ ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత అని తెలిసి, ట్యాక్సీవాడు మహదానందపడి, ఆయన నుంచి డబ్బులు తీసుకోలేదు. అందుకే, ‘‘దేశవిదేశాల్లో ఎక్కడకు వెళ్ళినా మా అందరికీ ‘శంకరాభరణం’ ఒకపాస్ పోర్ట్, వీసా’’ అని కె. విశ్వనాథ్ చివరి రోజుల దాకా అంటూ ఉండేవారు. చూపులేని వారు... మనోనేత్రంతో చూసిన సినిమా!సుప్రసిద్ధ కర్ణాటక సంగీత గాయని శ్రీరంగం గోపాలరత్నం, రచయిత్రి శారదా అశోకవర్ధన్, నృత్యగురువు సుమతీ కౌశల్, సహా పలువురు సంగీత, సాహిత్య, నృత్యకళా వతంసులు ఎందరో ‘శంకరాభరణం’ చిత్రాన్ని చూసి, తన్మయులయ్యారు. అప్పట్లో రేడియోలో పనిచేసిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు మంచాల జగన్నాథరావు కంటిచూపు లేక పోవడంతో సినిమాలకు వెళ్ళేవారు కాదు. కానీ, తోటివారి బలవంతం మీద ‘శంకరాభరణం’ చూశారు. చూసి పరమానందభరితులయ్యారు.‘‘తెర మీది సినిమా చూడలేక పోయినా, ఆ సంభాషణలు, సంగీతం, కీర్తనలు వింటూ నా మనోనేత్రంతో చిత్రాన్ని ఊహించుకొని ఎంతో ఆనందించాను. ఒక కీర్తన వింటూ, ‘తెర మీద ఏం జరుగుతోంది?’ అని పక్కనే ఉన్న మా ఆవిణ్ణి అడిగి తెలుసుకొని, ‘ఎంత చక్కగా చిత్రీకరించాడబ్బా’ అని ఆశ్చర్యపోయాను. ఈ సినిమాతో కె. విశ్వనాథ్ కళాసరస్వతికి నూతన ఆభరణం తొడిగారు’’ అని తన అనుభూతిని పంచుకోవడం విశేషం. – రెంటాల జయదేవ -
తెలుగు సినిమాలకు ఆభరణం... శంకరాభరణం
కె. విశ్వనాథ్ చిత్రాలన్నీ విలక్షణమైనవే అయినా వాటిలో ‘శంకరాభరణం’ గురించి ముందుగా చెప్పుకోవాలి. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యమిది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ సినిమాను చూస్తే మనవైన సంగీత, సాహిత్య, నృత్య కళలపై గౌరవం ఉప్పొంగి గర్వం పెల్లుబుకుతుంది. 1980లో విడు దలైన ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం. ఇందులోని సంగీతం, సాహిత్యం ఇప్పటికీ వీనుల విందు చేస్తాయి. విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభను గొప్పగా ఆవిష్కరించిన సినిమా ఇది. ఇంకా చెప్పాలంటే ఆయన సినీ కెరీర్‌నే మార్చేసిన మూవీ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎందరో మేధావులతో పాటు సామాన్యులను సైతం మెప్పించింది.రూ. పదమూడున్నర లక్షలతో...పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు ఈ సినిమాను నిర్మించారు. శంకర శాస్త్రి పాత్ర కోసం ముందుగా కృష్ణంరాజు, శివాజీ గణేశన్ వంటి వారిని అనుకున్నారు. చివరగా ఇమేజ్ ఉన్న నటుడు ఈ పాత్ర చేస్తే పండదని భావించి జేవీ సోమయాజులను తీసుకున్నారు విశ్వనాథ్. అప్పటికే ఆయన డిప్యూటీకలెక్టర్గా పని చేస్తున్నారు. అప్పట్లో ఈ సినిమాను పదమూడున్నర లక్షల రూపాయలతో తెరకెక్కించారు. 55 నుంచి 60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాను ఎక్కువగా రాజమండ్రి, రఘుదేవపురం, పోలవరం, రామచంద్రాపురం, అన్నవరం, సోమవరం, చెన్నైలోని తిరువాన్మయూరు, కర్ణాటకలోని బేలూరు, హలిబేడులో చిత్రీకరించారు.తెలుగు సినిమాకు కొత్త దారి...అప్పటివరకూ ఉన్న ట్రెండ్‌కి భిన్నంగా తెరకెక్కిన ‘శంకరాభరణం’ తెలుగు సినిమాకు సరికొత్త దారి చూపించింది. తెలుగు సినీ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, కళలకు పట్టం కడుతూ తీసిన ఈ సినిమాలోని పాటలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి. విశ్వనాథ్ సినిమాల కథాకథనాలు సున్నితంగానే ఉంటాయి. కానీ, బలమైన అంశాలను ఆయన తన సినిమాల్లో చర్చిస్తారు. సాంఘిక దురాచారాలను, పశుప్రవృత్తిని ఎండగడతారు. మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తు చేస్తారు. మనలోని సున్నిత భావాలను మేల్కొలిపే ప్రయత్నం చేస్తారు. ఆకాంక్షలు, ఆశయాలు, విలువలను ముందు తరాలకు అందించే ప్రయత్నం చేస్తారు. ‘శంకరాభరణం’ సినిమాలో శంకర శాస్త్రి క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది. అందుకే కాలాన్ని, మారుతున్న అభిరుచుల్ని తట్టుకుని ఇప్పటికీ గొప్ప సినిమాగా నిలిచిపోయింది.ఫక్తు క్లాస్ సినిమా అయినప్పటికీ...శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన ఆ రోజుల్లో ఎంతో మంది సంగీతం నేర్చుకోవటం మొదలు పెట్టారంటే ‘శంకరాభరణం’ ప్రభావం ఎంతలా పని చేసిందో అర్థమవుతుంది. స్వర్ణ కమలం అవార్డ్ అందుకున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమాకు ఉత్తమ నేప«థ్య గాయకుడుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొలి సారి జాతీయ అవార్డు అందుకున్నారు. అంతేకాదు వాణి జయరాంకు ఉత్తమ గాయకురాలిగా, కేవీ మహదేవన్స్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు దక్కాయి. ఫక్తు క్లాస్ సినిమా అయిన ‘శంకరాభరణం’కు మాస్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. సినిమాలంటే ఇష్టం లేని వారు సైతం ఈ సినిమా కోసం థియేటర్‌కు వెళ్లిన సందర్భాలున్నాయి.‘శంకరాభరణం’ విడుదలైన రోజునే...విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభతో పాటు కేవీ మహదేవన్ సంగీతం ఈ సినిమాకు ప్రాణంగా నిలిస్తే.. జంధ్యాల మాటలు, జేవీ సోమయాజులు, మంజుభార్గవి, అల్లు రామలింగయ్యల నటన ‘శంకరాభరణం’ను ఓ కళాఖండంగా మార్చాయి. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, యంజీఆర్, రాజ్‌కుమార్, హిందీలో శాంతారామ్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్, జితేంద్ర, సంజీవ్ కుమార్ ఈ సినిమాను పని గట్టుకొని మరీ చూసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. కాకతాళీయమో విధి విచిత్రమో గాని... 44 ఏళ్ల క్రితం ‘శంకరాభరణం’ రిలీజైన రోజునే విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 1980 ఫిబ్రవరి 2న ‘శంకరాభరణం’ విడుదలైతే 2023 ఫిబ్రవరి 2న ఆయన కన్నుమూశారు. విశ్వనాథ్ భౌతికంగా దూరమయ్యారు కానీ తాను తెరకెక్కించిన చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసుల్లో సజీవంగా ఉన్నారు. – దాచేపల్లి సురేష్‌కుమార్ -
థియేటర్ బయట చెప్పులు విడిచి చూసిన చిత్రమిది!
మెరిసే మెరుపులు మురిసే పెదవులు చిరుచిరు నవ్వులు కాబోలు.. ఉరిమే ఉరుపులు సరిసరి నటనలు సిరిసిరి మువ్వలు కాబోలు.. అంటూ శంకరుడిని ప్రార్థించిన తీరుకు ప్రేక్షకులు పరవంశించిపోయారు. శంకరాభరణంలో ప్రతి ఫ్రేమూ, ప్రతి మాటా, ప్రతి పాటా ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లాయి. ఒకసారి చూస్తే తనివి తీరదన్నట్లుగా ప్రేక్షకులు థియేటర్లలోనే ఐదారుసార్లు చూశారు. పైగా చాలాచోట్ల థియేటర్ బయటే చెప్పులు విడిచిపెట్టి శంకరాభరణం చూడటం విశేషం. సరిగ్గా 43 ఏళ్ల కిందట ఇదే రోజు(1980, ఫిబ్రవరి 3న) శంకరాభరణం రిలీజైంది. తన సినిమా రిలీజైన రోజే తనువు చాలించారు కె.విశ్వనాథ్. ఈ సందర్భంగా శంకరాభరణం కథ, ప్రత్యేకతలేంటో చూద్దాం.. గంజాయివనంలో తులసి పుట్టింది. ఆ తులసికి డబ్బంటే మోజు లేదు. నగలంటే మోహం లేదు. తన తల్లిలా ఐశ్వర్యం అంటే పిచ్చి లేదు. మగవాళ్ల విలాసవస్తువుగా మారి విలువలు లేని జీవితం గడపాలన్న తాపత్రయం లేదు. తులసి నిజంగా తులసి మొక్క అంత పవిత్రమైనది. స్త్రీ దేహానికి విలువ కట్టి వలువ ఊడదీసే ఇంట్లో పుట్టిన తులసికి సంగీతం అంటే ఇష్టం. గానం అంటే ప్రాణం. నృత్యం అంటే అభిమానం. ముఖ్యంగా ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి అంటే ఆర్తి. ఎలాంటి ఆర్తి అది? ఆయన శివుడు అయితే తను నందిలా ప్రణమిల్లాలని, ఆయన విష్ణువైతే తను పారిజాతంలా పాదం వద్ద పడి ఉండాలని, ఆయన బ్రహ్మ అయితే విశ్వసృజనలో తానొక సింధువులా మారాలని.. అంత భక్తి. ఈ భక్తిలో ఆత్మకు తప్ప శరీరానికి విలువ లేదు. ఉనికి లేదు. కన్న తల్లే తనను అమ్మేయాలనుకున్న సమయంలో తులసిని ఆదుకుంటాడు శంకరశాస్త్రి. కానీ ఊరు వేరేలా అర్థం చేసుకుంది. తనను అభిమానించి చేరదీసిన శంకరశాస్త్రిని తప్పు బట్టింది. ఊరు వెలేసే ‘కులట’ను చేరదీసినందుకు శంకరశాస్త్రిని బహిష్కరించింది. ఆయనను బహిష్కరిస్తే తప్పు లేదు. ఆయన సంగీతాన్ని కూడా బహిష్కరించింది. ఇది తట్టుకోలేని తులసి ఆయన కోసం ఆయనను దూరంగా వదిలిపోతుంది. శంకర శాస్త్రి– తులసి.. ఒక పాము వీధిన కనబడితే కేవలం అది పాము, విషపురుగు. అదే శివుని మెడలో కనబడితే ఆభరణం. శివుని ఆభరణం.. శంకరాభరణం. పూజలు అందుకుంటుంది. శంకరశాస్త్రి తానొక శంకరాభరణం అని లోకానికి తెలియచేయాలి. తులసి తానొక శంకరాభరణం అని నిరూపించుకోవాలి. సంగీతం కోసం జీవించి, సంగీతాన్ని శోధించి, సంగీతాన్ని ఆరాధించి, సంగీతంలో ఐక్యమై శంకరాభరణంలా గౌరవం పొందిన ఆ ఇద్దరి కథే శంకరాభరణం. మాసిపోయిన వైభవం.. ఒకప్పుడు గజారోహణం, గండపెండేరం బహూకరణ, సన్మానం, సత్కారం, కచేరి అంటే విరగబడే జనాలు... ఆ వైభవం కాలం గడిచే కొద్దీ మాసిపోయింది. శాస్త్రీయ సంగీతం అరుపులు కేకల సినీ సంగీతంలో మూల్గుల నిట్టూర్పుల పాశ్చాత్య సంగీతంలో పడి కొట్టుకుపోయింది. ఎవరూ శంకరశాస్త్రిని పిలిచేవారు లేరు. పలుకరించేవారు కూడా లేరు. ఆయన కూతురు పెళ్లికి ఎదిగి వచ్చింది. కాని పెళ్లి చేసే డబ్బు లేదు. శరీరాన ఉన్న వస్త్రాలు జీర్ణమయ్యాయి. కొత్త వస్త్రాలు కొనుక్కునే స్థోమత లేదు. మిగిలిందల్లా కంఠాన కొలువున్న సంగీతం. దివారాత్రాలు తోడుండే స్వరాలు. తిరిగొచ్చిన తులసి.. ఇలాంటి స్థితిలో ఆనాడు వదిలి వెళ్లిన తులసి తిరిగి వస్తుంది. తల్లి చనిపోగా బోలెడంత ఆస్తి కలిసి రాగా ఆ ఆస్తితో ఏదైనా సత్కార్యం చేయాలని శంకరశాస్త్రిని వెతుక్కుంటూ వస్తుంది. అందుకు మాత్రమే కాదు. తనను ఒక మగవాడు కాటేశాడు. అందువల్ల తాను గర్భవతి అయ్యింది. తన కడుపున కూడా కొడుకు రూపంలో ఒక పాము పుట్టింది. ఆ పామును శంకరశాస్త్రి పాదాల చెంత చేర్చి, సంగీతం నేర్చుకునేలా చేసి, ఆ పామును శంకరాభరణం చేయాలన్న లక్ష్యంతో వచ్చింది. దొరకునా ఇటువంటి సేవా... తులసి కొడుకు శంకరశాస్త్రి శిష్యుడవుతాడు.ప్రభ కోల్పోయిన శంకరశాస్త్రి పూర్వపు వెలుగును సంతరించుకుంటూ తన చివరి కచ్చేరి ఇస్తాడు. సభికులు కిక్కిరిసిన ఆ సభలో ‘దొరకునా ఇటువంటి సేవా’ అంటూ సంగీతాన్ని అర్చించడానికి మించిన సేవ లేదంటూ పాడుతూ పాట సగంలో వుండగా ప్రాణం విడుస్తాడు. కాని సంగీతం అంతమాత్రాన ఆగిపోతుందా? అది జీవనది. శంకరశాస్త్రి శిష్యుడు, తులసి కొడుకు అయిన పిల్లవాడు మిగిలిన పాటను అందుకుంటాడు. గొప్ప సంగీతం, మరెంతో గొప్ప సంస్కారం, సంస్కృతి ఎక్కడికీ పోవు. మనం చేయవలసిందల్లా పూనిక చేయడమే. ఆదరించడమే. కొత్తతరాలకు అందించడమే. ఇవన్నీ సమర్థంగా సక్రమంగా చెప్పడం వల్ల శంకరాభరణం క్లాసిక్ అయ్యింది. కలెక్షన్ల శివ తాండవం ఆడింది. సినిమాలలో కైలాస కొండలా అంత ఎత్తున బంగారువర్ణంలో నిలిచింది. శంకరాభరణంకు ఊహించని రెస్పాన్స్ 1980లో విడుదలైన ‘శంకరాభరణం’ తెలుగువారి కీర్తి కారణాలలో ఒకటిగా నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కాని బీడువారిన నేల ఎదురు చూస్తున్న కుంభవృష్టి అదేనని సినిమా విడుదలయ్యాక తెలిసివచ్చింది. ఈ నేలలో, ఈ ప్రజల రక్తంలో నిబిడీకృతమైన పురా సంస్కృతిని తట్టి లేపడం వల్ల ఆ సినిమా ప్రజల ఆనందభాష్పాలతో తడిసి ముద్దయింది. అవుతూనే ఉంది. దర్శకుడు కె.విశ్వనాథ్ మలినం లేని ఉద్దేశ్యంతో తెరకెక్కించడం వల్ల ఆ స్వచ్ఛత సినిమా అంతా కనిపిస్తుంది. ఈ సినిమా సంగీతాన్ని సంస్కరించడం మాత్రమే కాదు మన సంస్కారాన్ని సంస్కరించే పని చేయడం వల్ల కూడా ఆకట్టుకుంది. నాటు సారా తాగినా అవే పాటలు.. శంకరశాస్త్రిగా జె.వి.సోమయాజులు, తులసిగా మంజుభార్గవి జన్మలు ధన్యమయ్యాయి. సంగీతం అందించిన కె.వి.మహదేవన్, పాటలు రాసిన వేటూరి సుందరరామమూర్తి, పాడిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చరితార్థులయ్యారు. ‘అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానమూ’ అంటూ ఈ సినిమా రిలీజైన రోజుల్లో రిక్షావాళ్లు కూడా గొంతు కలిపారు. నాటుసారా తాగి ‘శంకరా’ అని పాట ఎత్తుకున్నారు. చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, నిర్మలమ్మ వీళ్లంతా ఒకెత్తయితే శంకరశాస్త్రి స్నేహితుడిగా నటించిన అల్లు రామలింగయ్య ఒక్కడే ఒకెత్తు. కథను సూత్రధారిలా నడిపిస్తాడు. పొంగే శంకరశాస్త్రిపై చిలకరింపులా పడి అతడిని పాలుగా మిగులుస్తుంటాడు. అతడే శంకరశాస్త్రికి స్నేహితుడు, కొడుకు, కన్నతండ్రి. చదవండి: సిరివెన్నెల సినిమా కోసం చిత్రవధ పడ్డ విశ్వనాథ్ -
తెలుగు సినిమా ‘ఆత్మగౌరవం’!
‘మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు.. ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు..’ అంటూ శంకరుడిని ప్రార్థించిన తీరు ప్రేక్షకుల ఆనంద వృష్టిని తడిపింది. ‘పంచ భూతములు ముఖ పంచకమై.. ఆరు రుతువులు ఆహార్యములై.. నీ దృక్కులే అటు అష్ట దిక్కులై.. నీ వాక్కులే నవరసమ్ములై..’ అంటూ ఉర్రూతలూగించిన తీరు అజరామరం. ‘కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం..’ చూపడంలో మీ శైలికి సెల్యూట్. తెలుగు సినిమా ఉత్తుంగ తరంగంలా ఎగిసి పడేలా చేయడంలో మీ తర్వాతే ఎవరైనా. మీ గురించి మేమెంత చెప్పినా, అవి మీకు కొత్తగా కిరీటాలేమీ పెట్టవు. ఆకాశమంత మీ నిబద్ధతకు అరచెయ్యంత అద్దం ఈ మాటలు. మీరు నింగికెగిసినా మా కళ్లముందుంచిన ఆ అపురూప దృశ్య కావ్యాల్లో అనునిత్యం మీరు కనిపిస్తూనే ఉంటారన్నది అక్షర సత్యం. ఎంతటి గంగా ప్రవాహమైనా గంగోత్రి లాంటి ఓ పవిత్ర స్థానంలో చిన్నగా, ఓ పాయలా మొదలవుతుంది. వెండితెరపై శంకరాభరణం, సాగర సంగమం వంటి ఎన్నో కళాఖండాలను సృజించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వ ప్రయాణం కూడా అలాగే ఓ చిన్న పాయలా మొదలైంది. సౌండ్ రికార్డిస్టుగా మొదలై.. దర్శకత్వ శాఖకు విస్తరించిన విశ్వనాథ్ 1965లో తొలిసారిగా ‘ఆత్మగౌరవం’ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్నారు. నాటి నుంచి ఐదున్నర దశాబ్దాలకుపైగా వెండితెర అద్భుతాలను అందించారు. తొలితరంలో గూడవల్లి రామబ్రహ్మం, బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, మలితరంలో ఆదుర్తి సుబ్బారావు తదితరుల తర్వాత మూడో తరంలో తెలుగు సినిమాకు ‘ఆత్మగౌరవం’ తెచ్చిన దర్శక కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్. వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డింగ్ విభాగంలో కెరీర్‌ను ప్రారంభించి బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు వంటి వారి పనితీరును దగ్గరగా పరిశీలిస్తూ వచ్చిన కె.విశ్వనాథ్ స్క్రిప్టులో తోచిన సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. ఈ క్రమంలో ఆదుర్తి తన సినిమాలకు స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా పనిచేసే అవకాశం ఇచ్చారు. అలా కథా విస్తరణ, స్క్రీన్ ప్లే రచనలో విశ్వనాథ్‌కు ఉన్న ప్రతిభను గుర్తించి తమ అన్నపూర్ణా పిక్చర్స్ సంస్థలో దర్శకత్వ శాఖలోకి రమ్మని హీరో అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సహించారు. మొదట తటపటాయించినా, తర్వాత అన్నపూర్ణా పిక్చర్స్‌లో చేరారు. ఇలా కె.విశ్వనాథ్ సినీ జీవితం ఊహించని మలుపు తిరిగింది. అవకాశం కోసం వేచి చూస్తూ.. స్వతహాగా సృజనశీలి అయిన విశ్వనాథ్.. ఆదుర్తి శిష్యరికంలో మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు. కథ, స్క్రీన్‌ప్లే రచన, సెకండ్ యూనిట్ డైరెక్షన్.. ఇలా విశ్వనాథ్ చేయనిది లేదు. నిజానికి ‘‘అన్నపూర్ణాలో రెండు సినిమాలకు ఆదుర్తి గారి దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన తర్వాత నాకు రెండు సినిమాలకు డైరెక్షన్ చాన్స్ ఇస్తామని మాటిచ్చారు. కానీ నాలుగు చిత్రాలకు (వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు –1961; ‘చదువుకున్న అమ్మాయిలు – 63; ‘డాక్టర్ చక్రవర్తి’–64) వర్క్ చేశాకే ఐదో సినిమా దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ‘ఆత్మగౌరవం’తో మెగాఫోన్ నా చేతికిచ్చారు. ‘పూలరంగడు’ సినిమాకూ నేనే దర్శకత్వం వహించాల్సింది. మొదట నాతో స్క్రిప్టు వర్క్ వగైరా చేయించారు. అనుకోని కారణాల వల్ల మా గురువు ఆదుర్తి గారే డైరెక్ట్ చేస్తున్నారన్నారు. ఏమైతేనేం ‘ఆత్మగౌరవం’తో దర్శకుడినయ్యా’’ అని కె.విశ్వనాథ్ ఒక సందర్భంలో గుర్తుచేసుకున్నారు. ‘ఆత్మగౌరవం’కి డైరెక్షన్ చాన్స్ ఇచ్చే ముందు.. దుక్కిపాటి గట్టిగా పట్టుబట్టడంతో కె.విశ్వనాథ్ కాపురాన్ని హైదరాబాద్‌కు మార్చాల్సి వచ్చింది. ట్యాంక్ బండ్ దగ్గర గగన్ మహల్ కాలనీలో రెండేళ్లు చిన్న అద్దె ఇంట్లో గడిపారు. 1. తేనెమనసులు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కె. విశ్వనాథ్, 2. ‘స్వాతిముత్యం’ సినిమా షూటింగ్లో కమల్‌హాసన్‌కు సూచనలిస్తూ.., 3. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణంలోని ఓ సన్నివేశం పబ్లిక్ గార్డెన్స్ చెట్ల నీడలో.. ఖాళీ అద్దం షాట్లో.. అన్నపూర్ణా వారి అన్ని సినిమాలలానే ‘ఆత్మగౌరవం’ సినిమా కథ కోసం పలువురు రచయితలతో కలసి దర్శక, నిర్మాతలు మేధోమథనం జరిపారు. నాటక రచయిత గొల్లపూడి మారుతీరావు, నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి, మరికొందరు కలసి హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్ చెట్ల నీడల్లో పచ్చిక బయళ్లలో కూర్చొని కథా చర్చలు, ఆలోచనలు చేశారు. సంగీతాభిరుచి ఉన్న విశ్వనాథ్ మద్రాసు వర్క్ బిజీకి దూరంగా రచయితలు, సంగీత దర్శకుడిని హైదరాబాద్ రప్పించి, ఇక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ జరిపారు. హైదరాబాద్ సారథీ స్టూడియోలో షూటింగ్ ముహూర్తం. తొలి షాట్ చిత్రీకరణ తమాషాగా సాగింది. సంప్రదాయ శైవ కుటుంబంలో పుట్టిన విశ్వనాథ్ ఇంట్లో అంతా పరమ దైవభక్తులు. నిర్మాత దుక్కిపాటి నాస్తికుడు. తొలి షాట్ దేవుడి పటాల మీద తీసే అవకాశం లేదు. చివరకు అద్దం సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపమని విశ్వనాథ్ తెలివిగా ఫస్ట్ షాట్ ఖాళీగా ఉన్న అద్దం మీద పెట్టారు. క్షణమాగి అద్దంలో ప్రతిబింబంగా అక్కినేని ఫ్రేములోకి వచ్చి డ్రెస్ సర్దుకుంటారు. ఇలా అద్దం మీద నుంచి హీరో అక్కినేని మీదకు వచ్చేలా కెమెరామ్యాన్ సెల్వరాజ్‌తో కలసి విశ్వనాథ్ వేసిన ప్లాన్ అద్భుతంగా ఫలించింది. విశ్వనాథ్ సెంటిమెంట్ నిలిచింది. నిర్మాతకూ ఇబ్బంది లేకుండా పోయింది. అద్దం మీద మొదలైన విశ్వనాథ్ దర్శకత్వ ప్రస్థానం అపూర్వంగా ముందుకు సాగింది. తొలి చిత్రంతోనే అవార్డుల వేట కె.విశ్వనాథ్ నిర్మించిన తొలి చిత్రం ‘ఆత్మ గౌరవం’ 1965లో ఉత్తమ తృతీయ చిత్రంగా కాంస్య నంది అవార్డును గెల్చుకుంది. ఇదే చిత్రానికి ఉత్తమ నటుడిగా అక్కినేది నాగేశ్వరరావు, ఉత్తమ కథా రచయితలుగా గొల్లపూడి, యద్ధనపూడి నంది అవార్డులు అందుకున్నారు. ఇలా తొలి చిత్రంతోనే విశ్వనాథ్ అవార్డు చిత్రాల దర్శకుడిగా తన అప్రతిహత ప్రయాణానికి నాంది పలికారు. అప్పటి అగ్ర హీరోలు ఎన్టీఆర్‌తో నాలుగు, ఏఎన్నార్‌తో రెండు సినిమాలు తీశారు. ‘శంకరాభరణం’ సినిమాతో శిఖరాగ్రానికి చేరుకున్నారు. తెలుగులో తొలి మహిళా కొరియోగ్రాఫర్‌గా సుమతీ కౌశల్‌కు కె.విశ్వనాథ్ అవకాశం ఇచ్చారు. ఆ పాటల పల్లవులు విశ్వనాథ్‌వే విశ్వనాథ్‌లో బాహ్య ప్రపంచానికి తెలియని ఓ అద్భుత సినీ గీత రచయిత ఉన్నారు. ఆదుర్తి దగ్గర సహాయకుడిగా ఉన్న రోజుల్లో గీత రచయితలతో పాటలు రాయించుకుంటున్నప్పుడు సైతం వారికి తన ఇన్‌పుట్స్‌గా పాటల పల్లవులు అందించేవారు. ‘డమ్మీ లిరిక్స్.. అబద్ధపు సాహిత్యం’ అంటూ ఆయన ఇచ్చిన పల్లవులే.. తలమానికమైన ఎన్నో సినీ గీతాలకు కిరీటాలయ్యాయి. ‘ఆత్మగౌరవం’లో ‘మా రాజులొచ్చారు..’, ‘అందెను నేడే..’ పాటల పల్లవులు విశ్వనాథ్ రాసినవే. ఆ పదాలకు మరింత సొబగులద్ది రచయితలు మిగతా పాటంతా అద్భుతంగా అల్లడం విశేషం. సాగర సంగమం షూటింగ్లో..., స్వయంకృషి చిత్రీకరణ సమయంలో నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, చిరంజీవితో.. అవార్డులకు కేరాఫ్ అడ్రస్ మునుపెన్నడూ రామప్ప గుడికి వెళ్ళకపోయినా, ఆ పరిసరాలు బాగుంటాయని దుక్కిపాటి, గొల్లపూడి, సెవన్ స్టార్స్ సిండికేట్ సాంస్కృతిక సంస్థ శాండిల్య బృందం చూసొచ్చి చెప్పడంతో, అక్కడకు వెళ్ళి మరీ షూటింగ్ చేసినట్టు విశ్వనాథ్ చెప్పారు. రామప్ప గుడిలోనే దాశరథి రాసిన ‘ఒక పూలబాణం..’ చిత్రీకరించారు. 1965 చివరలో సెన్సార్ జరుపుకొన్న ‘ఆత్మగౌరవం’ ఆ మరుసటేడు రిలీజైంది. ప్రజాదరణ పొంది, విజయవాడ లాంటి చోట్ల శతదినోత్సవం చేసుకుంది. దర్శకుడిగా విశ్వనాథ్ ప్రతిభా సామర్థ్యాలు ధ్రువపడిపోయాయి. తొలి చిత్రం నుంచి ఇప్పటి దాకా ఓ నాలుగైదు మినహా విశ్వనాథ్ రూపొందించిన చిత్రాలన్నీ నందులో, జాతీయ అవార్డులో ఏవో ఒకటి అందుకున్నవే! స్వయంగా కె. విశ్వనాథ్ సైతం కళాప్రపూర్ణ, రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మశ్రీ పురస్కారం, సినీరంగంలో ఇచ్చే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు – ఇలా ఎన్నో శిఖరాలు అధిరోహించారు. ఈ 55 ఏళ్ళ దర్శకత్వ ప్రస్థానంలో తెలుగుతెరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అమితమైన ఆత్మగౌరవం తెచ్చారు. -
తెలుగు చిత్రానికి మరో అరుదైన గౌరవం.. ఆ విభాగంలో ఎంపిక
శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ఈ చిత్రం ఎంపికైంది. నేషనల్ ఫిల్మ్ అర్చివ్స్ ఆఫ్ ఇండియా వారు మనదేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి ప్రదర్శించనున్నారు. ఈ కేటగిరీలో శంకరాభరణం సినిమాకు చోటు దక్కింది. (చదవండి: Sarath Kumar: కళా తపస్వి జీవన చిత్ర ప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరించిన నటుడు) తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించిన దర్శక దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్ చిత్రం శంకరాభరణం చిత్రాన్ని పనాజీలో జరుగుతున్న ఇఫి-2022 వేడుకల్లో ప్రదర్శించనున్నారు. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరావు ఈ సినిమాను నిర్మించారు. డిజిటలైజ్ చేసి ప్రదర్శించే భారతీయ సినిమాల్లో తెలుగు చిత్రం శంకరాభరణం చిత్రం చోటు దక్కించుకుంది. ఈ చిత్ర ప్రదర్శనకు నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారు. -
పుణేలో... రిస్కీ నిఖిల్!
రిస్క్ తీసుకోవడానికి వెనకాడని యువ హీరోల్లో నిఖిల్ ఒకరు. ఆయన చేస్తున్న సినిమాలు చూస్తే ఆ సంగతి అర్థమవు తుంది. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వెర్సస్ వెర్సస్’... ఇలా వరుసగా రిస్కీ ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్న నిఖిల్ ఇప్పుడు ఏకంగా అలనాటి క్లాసిక్ ‘శంకరాభరణం’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ఆ పేరుతో సినిమానా? రిస్క్ కాదా అనుకుంటున్నారా? కాదంటున్నారు చిత్రకథా రచయిత, సమర్పకుడు కోన వెంకట్. ఎందుకంటే, ఆ ‘శంకరాభరణం’కీ, ఈ చిత్రానికీ పోలిక ఉండదని ఆయన చెబుతున్నారు. ఇది క్రైమ్, కామెడీ మూవీ అట. మనుషులు వెళ్లడానికి సాహసం చేయని రిస్కీ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ రిస్క్‌లో ఓ కిక్ ఉందని చిత్రబృందం చెబు తోంది. ప్రస్తుతం పుణేకి అరవై కిలోమీటర్ల దూరంలో గల బోర్, నగరి, వాయ్ గ్రామాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 25 వరకూ అక్కడ షూటింగ్ చేస్తామని నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణ తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్.


