breaking news
plane evacuated
-
విమానంలో ఉండగా.. శాంసంగ్ ఫోన్లో మంటలు
అమెరికాలోని కెంటకీ రాష్ట్రం నుంచి మరికొద్ది సేపట్లో బయల్దేరాల్సిన విమానంలో శాంసంగ్ ఫోనుకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా విమానాన్ని ఖాళీ చేయించారు. కెంటకీ నుంచి బాల్టిమోర్ వెళ్లాల్సిన విమానంలో ఉన్న ప్రయాణికుడి వద్ద ఉన్న శాంసంగ్ ఫోనులోంచి పొగలు వచ్చినట్లు ఒక కస్టమర్ తమకు ఫిర్యాదు చేశారని విమాన సిబ్బంది తెలిపారు. బ్రియాన్ గ్రీన్ అనే వ్యక్తి వద్ద ఉన్న సరికొత్త శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోనులోంచి ఈ పొగలు, మంటలు వచ్చాయని గుర్తించారు. అయితే శాంసంగ్ కంపెనీ మాత్రం.. అతడి వద్ద ఏ ఫోను ఉన్నదీ ఇంకా తమకు స్పష్టం కాలేదని తెలిపింది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ అధికారులను తాము సంప్రదిస్తున్నామని, కాలిపోయిన ఫోన్ స్వాధీనం చేసుకుని, అందుకు కారణాలేంటో పరిశీలిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ అయిన శాంసంగ్.. తాము ఇప్పటికి 25 లక్షల స్మార్ట్ ఫోన్లను రీప్లేస్ చేశామని చెప్పింది. బ్యాటరీలో లోపం వల్లే ఈ ఫోనుకు మంటలు అంటుకోవడం లేదా పేలడం జరుగుతున్నట్లు తెలిసింది. తాను కూడా ఇలా ఫోన్ మార్చుకున్నానని, అయినా మార్చిన ఫోన్ కూడా మంటలు అంటుకుందని బ్రియాన్ గ్రీన్ చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ మార్చి ఇచ్చిన ఫోన్లు కూడా అంతంగానే ఉన్నాయన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. కొత్త మోడల్ ఫోన్లకు అమెరికా వినియోగదారుల ఉత్పత్తుల భద్రతా కమిషన్ నుంచి అనుమతి కూడా వచ్చింది. విమానంలో ఉండగా శాంసంగ్ ఫోన్లు వాడొద్దని, వాటిని స్విచాఫ్ చేసి ఉంచాలని చాలావరకు విమానయాన సంస్థలు చెబుతున్నాయి. -
మంటలొచ్చాయని.. విమానం ఖాళీ
జమైకాలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో కార్గో విభాగంలో మంటలు చెలరేగినట్లు అలారం రావడంతో.. అందులో ఉన్న 160 మంది ప్రయాణికులను, ఆరుగురు సిబ్బందిని ఆగమేఘాల మీద కిందకు దించేశారు. విమానాన్ని రన్‌వే మీదే వదిలేశారు. ఎయిర్‌పోర్టును కూడా కొద్దిసేపు మూసేశారు. మాంటెగో బే నుంచి అట్లాంటా వెళ్లాల్సిన ఈ బోయింగ్ 737 విమానం టేకాఫ్ తీసుకోడానికి కొద్ది సేపటి ముందు ఈ హడావుడి జరిగింది. అయితే, నిజానికి ఫ్లైట్ డెక్ నుంచి వచ్చిన ఈ హెచ్చరిక సరైనది కాదని, అసలు ఎలాంటి మంటలు అందులో చెలరేగలేదని డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతకుముందే ప్రయాణికులంతా హడావుడిగా విమానం నుంచి కిందకు దిగిపోయారు. దాంతో విమానాన్ని రన్‌వే మీదే వదిలేశారు. ఈ ఘటన తర్వాత జమైకా విమానాశ్రయాన్ని కూడా కొద్దిసేపు మూసి ఉంచాల్సి వచ్చింది. ఆ మార్గం మీదుగా వెళ్లాల్సిన విమానాలను కింగ్స్టన్ మీదుగా మళ్లించారు. కార్గో బే నుంచి అసలు మంటలు ఉన్నట్లు హెచ్చరికలు రావడానికి కారణం ఏంటో తెలుసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.