breaking news
jvv satyanarayana
-
మాయమాటల్లోనే బాబు హామీలు
కరవది(ఒంగోలు రూరల్): రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణం సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర సి.పి.ఐ. సహాయ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణ అన్నారు.అఖిలభారత యువజన సమాఖ్య 64వ వార్షికోత్సవం సందర్బంగా ఒంగోలు మండలం కరవదిలో మన్నే వెంకటేశ్వర్లు ఆడిటోరియంలో బుధవారం డి.ముక్కంటియ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రుణ మాఫీలు చేస్తామని రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశారన్నారు. జాబు రాకపోతే రూ. 2000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు జాబు రాకపోగా ఉన్నవి పోతున్నాయన్నారు. రాష్ట్రాల్లో బీజేపీని పటిష్టం చేసుకొనేందుకు ఊరూరా నాయకలు తిరుగుతున్నారే తప్ప పేదలు, రైతుల సంక్షేమం పట్టడంలేదన్నారు.ఈ సభలో ఎఐవైఎఫ్ నేతలు అరుణ ,పోలవరపు సీతారామయ్య ,వడ్డే హనుమారెడ్డి , కరవది సుబ్బారావు ,డి.ముక్కంటియ్య,ిసీహెచ్ రామిరెడ్డి ప్రసంగించిన అనంతరం ఆటలపోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ప్రజా కళాకారులచే ఁసర్వాంతర్యామిరూ. నాటికను చిల్లర సుబ్బారావు దర్శకత్వ పర్యవేక్షణలో ప్రదర్శించారు. బోయిడి సుబ్బారావు అతిధులకు స్వాగతం పలికారు. -
కొవ్వూరు ‘సాక్షి’ విలేకరిపై ఎమ్మెల్యే రామారావు దాడి
ఏలూరు, న్యూస్‌లైన్ : కొవ్వూరు మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ వివరాలు సేకరించేందుకు సోమవారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన సాక్షి విలేకరి జీవీవీ సత్యనారాయణపై ఎమ్మెల్యే టీవీ రామారావు దాడిచేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఆరికిరేవుల ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏకగ్రీవం చేసుకునేందుకు అంగీకరించారని స్థానిక నాయకులు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువచ్చారు. నిర్ధేశిత గడువు ముగిసినందున నామినేషన్ల ఉపసంహరణకు అనుమతించే అవకాశం లేదని ఎన్నికల అధికారి యు.వసంత్‌కుమార్ నాయకులతో స్పష్టం చేశారు. ఇదిలావుండగా సాయంత్రం 6 గంటల సమయంలో ఎమ్మెల్యే టీవీ రామారావు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ల ఉప సంహరణకు అనుమతించాలని ఎన్నికల అధికారిని కోరారు. ఆ సమయంలో ఎంపీడీవో పి.వసంతమాధురి నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం లేదని చెప్పిన తరువాత కూడా ఏకగ్రీవం చేసుకుంటామని అడగడం సరికాదని ఎమ్మెల్యేకు సూచించారు. ఈ అంశంపై ఏమీ మాట్లాడనవసరం లేదని దయచేసి మా పనులకు ఇబ్బంది కలిగించవద్దని ఎమ్మెల్యేను ఎంపీడీవో కోరారు. ఎన్నికల అధికారిని రహస్యంగా మాట్లాడి ఒప్పించే ప్రయత్నంలో భాగంగా మీతో మాట్లాడాలి పక్క గదిలోకి రమ్మని ఎమ్మెల్యే ఎన్నికల అధికారిని కోరి బయటకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో బయటకు వచ్చిన ఎన్నికల అధికారిని ఫొటో తీసేందుకు సాక్షి విలేకరి ప్రయత్నిస్తుండగా ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే రామారావు విలేకరిపై దాడికి పాల్పడ్డారు. మా పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఫొటోలు తీస్తావా అంటూ దుర్భాషలాడి పిడిగుద్దులు గుద్దారు. నిన్ను, నీ పేపర్‌ను పెట్రోల్ పోసి తగలబెడతానంటూ ఆగ్రహంతో చిందులు వేశారు. తరచూ తనపై వ్యతిరేక వార్తలు రాస్తున్నారంటూ దుర్భాషలాడుతూ రాయడానికి వీల్లేని బూతులను ప్రయోగించారు. కేకలు వేస్తున్న ఎమ్మెల్యేను ఎంపీడీవో, ఎన్నికల అధికారి దయచేసి బయటకు వెళ్లాలని కోరారు. ఎమ్మెల్యేను బయటకు పంపి కార్యాలయం బయట ద్వారం తలుపులు మూసివేశారు. ఆ సమయంలో కోపోద్రేకుడైన ఎమ్మెల్యే నా కొడకా బయటకు రారా నిన్ను చంపేస్తానంటూ సాక్షి విలేకరిపై చిందులు వేశారు. అనంతరం వెనుక గుమ్మం వద్ద నిలబడి ఫోన్ మాట్లాడుతున్న సాక్షి విలేకరి వద్దకు వచ్చి బయటకు రా నా కొడకా చంపుతానంటూ కేకలు వేశారు. దీంతో భయం వేసిన విలేకరి కార్యాలయంలోకి పరుగు పెట్టారు. భయంతో తనపై జరిగిన దాడి విషయాన్ని ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ సీఐ ఎన్.చిరంజీవి సిబ్బందితో ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సుమారు గంట పాటు తలదాచుకున్న సాక్షి విలేకరిని పోలీసులు బయటకు తీసుకువచ్చారు. అధికారుల సమక్షంలోనే ప్రభుత్వ కార్యాలయంలో ఎమ్మెల్యే రామారావు ఓ ప్రత్రిక విలేకరిపై విచక్షణ కోల్పోయి దాడికి తెగబడడంతో అక్కడున్న కార్యాలయ సిబ్బంది, అధికారులు, పలువురు నాయకులు నిర్ఘాంతపోయారు. దీనిపై విలేకరి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవ్వూరు ప్రెస్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా) ప్రతినిధులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని విలేకరిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే రామారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘ అధ్యక్షుడు దుద్దుపూడి రామచంద్రరావు (రాము), ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. విలేకరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే టీవీ రామారావుపై 341, 323, 506 క్లాజ్-2 కింద కేసులు నమోదు చేసినట్టు సీఐ ఎన్.చిరంజీవి తెలిపారు.