breaking news
	
		
	
  INS Sindhurakshak blast
- 
      
                    
యుద్ధసామగ్రి వల్లే పేలుళ్లు: ఆంటోనీ

 ‘సింధురక్షక్’ ఘటనపై రాజ్యసభకు రక్షణ మంత్రి ఆంటోనీ వెల్లడి
 న్యూఢిల్లీ/ముంబై: ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదానికి అందులోని యుద్ధసామగ్రి మండటమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సోమవారం రాజ్యసభ లో వెల్లడించారు. ముంబై డాక్‌యార్డ్‌లో మంగళవారం అర్ధరాత్రి సింధురక్షక్ జలాంతర్గామిలో భారీ పేలుళ్లు సంభవించడంతో అది మునిగిపోవడం తెలిసిందే. జలాంతర్గామిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురితో సహా 18 మంది నేవీ సిబ్బంది చిక్కుకోవడం కూడా విదితమే. అయితే సింధురక్షక్లో యుద్ధసామగ్రి జ్వలించడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని మంత్రి తెలిపారు.
 
 ‘ప్రాథమిక అంచనాల ప్రకారం.. జలాంతర్గామిలో యుద్ధసామగ్రి భద్రపర్చిన ముందు కంపార్ట్మెంట్లో తొలుత అంతర్గత పేలుడు చోటుచేసుకుంది. ఫలితంగా ఇతర కంపార్ట్మెంట్లలోనూ పేలుళ్లు జరిగి జలాంతర్గామి క్షణాల్లోనే అగ్నికీలల్లో చిక్కుకుంది. దీంతో సిబ్బంది బయటికి రాలేకపోయారు’ అని ఆంటోనీ వివరించారు. నౌకలను వెలికితీయడంలో పేరుపొందిన అంతర్జాతీయ కంపెనీలను సంప్రదించామని, వారు జలాంతర్గామిని బయటికి తీసేందుకు సర్వేలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకుగాను నిపుణులతో ఒక బోర్డును ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
 
 మృతులకు పార్లమెంటు నివాళి...
 సింధురక్షక్ ప్రమాదంలో అసువులుబాసిన నేవీ సిబ్బందికి సోమవారం పార్లమెంటు ఉభయసభలు ఘనంగా నివాళులు అర్పించాయి. ఉభయసభలు వేర్వేరుగా సమావేశమైన అనంతరం సంతాప సందేశాన్ని చదవడంతోపాటు విషాదంపై తీవ్ర విచారం వ్యక్తంచేశాయి. అమరులైన నేవీ సిబ్బందికి నివాళిగా ఉభయసభలూ కొన్ని నిమిషాలు మౌనం పాటించాయి.
 
 ఏడో మృతదేహం లభ్యం
 సాక్షి, ముంబై: సింధురక్షక్ జలాంతర్గామి నుంచి సోమవారం మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఇప్పటిదాకా లభించిన మృతదేహాల సంఖ్య ఏడుకు చేరింది. ఇంకా మరో 11 మంది నేవీ సిబ్బంది ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు గాలింపు కొనసాగిస్తున్నారు. జలాంతర్గామిలో చమురు కలిసిన నీరు, చీకటి, బురద, లోపలి భాగం ధ్వంసమై చిందరవందర కావడంతో నేవీ గజ ఈతగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే గాలింపు కొనసాగిస్తున్నారు. మృతదేహాలు కాలిపోవడం వల్ల గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో డీఎన్ఏ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే మృతులను గుర్తించేందుకు వీలుకానుంది. - 
      
                   
                               
                   
            ఐదు మృతదేహాల వెలికితీత

 సాక్షి, ముంబై: నగరంలోని నౌకాశ్రయంలో మంగళవారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైన ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో గల్లంతైన 18 మంది నేవీ సిబ్బందిలో శుక్రవారం నాటికి ఐదుగురి మృతదేహాలు లభించాయి. పేలుళ్లు, అగ్ని ప్రమాదం కారణంగా శవాలు గుర్తుపట్టరాని విధంగా మారాయి. డీఎన్ఏ పరీక్షలు చేస్తే తప్ప ఆ శవాలు ఎవరివన్నది తేల్చలేమని నేవీ అధికారులు వెల్లడించారు. దీంతో ఏదో అద్భుతం జరిగి కొందరైనా బతికి ఉండకపోతారా? అన్న ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి. మరోవైపు జలాంతర్గామిలోని మిగతా 13 మంది నౌకాదళ సిబ్బంది ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. వీరి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
 
 తీవ్రంగా ధ్వంసమైన జలాంతర్గామిలోకి వెళ్లేందుకు గజ ఈతగాళ్ల ప్రయత్నం 36 గంటల అనంతరం ఫలించింది. మొదటి కంపార్ట్మెంట్ నుంచి రెండవ కంపార్ట్మెంట్లోకి వారు ప్రవేశించగలిగారు. ఎట్టకేలకు శుక్రవారం ఐదు శవాలను వెలికితీశారు. శవాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా ఎవరివి? అన్నది నిర్ధారించేందకుగాను ‘ఐఎన్ఎస్ అశ్వినీ’ ఆసుపత్రికి తరలించినట్లు నేవీ అధికారులు తెలిపారు. జలాంతర్గామిలో చిక్కుకున్న ముగ్గురు అధికారులు, 15 మంది నావికుల వివరాలను నేవీ గురువారం వెల్లడించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు నావి కులు.. దాసరి ప్రసాద్, రాజేశ్ తూతిక, సీతారాం బాడపల్లె కూడా ఉన్న విషయము తెలిసిందే. కాగా, జలాంతర్గామిలో చిక్కుకున్నవారిలో తమిళనాడుకు చెందిన అధికారి ఆర్.వెంకట్రాజ్ కూడా ఉన్నారు. ఈ సబ్‌మెరైన్‌లో ఆయనకు ప్రత్యేక చాంబర్ ఉందని, అందులో 15 రోజులకు సరిప డా ఆక్సిజన్, ఆహార పదార్థాలుంటాయి కాబట్టి ఆ చాంబర్ ధ్వంసం కాకపోతే ఆయన బతికే అవకాశముందని భావిస్తున్నారు.
 
 బురదనీరు, చీకటితో తీవ్ర ఇబ్బందులు...
 జలాంతర్గామిలో మంటలు, వేడి వల్ల నీరు మరుగుతుండటంతో బుధవారం దాకా డైవర్లు లోపలికి వెళ్లలేకపోయారు. బురద నీటితోపాటు చిమ్మచీకటి వల్ల శుక్రవారం కూడా సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. జలాంతర్గామి కంట్రోల్ రూం ధ్వంసం కావడం, లోపలి ఉక్కు కరిగిపోవడం, నిచ్చెనలు వంగిపోవడం వల్ల లోపలికి వెళ్లేందుకు దారి దొరకడం లేదు. తీవ్ర వేడి, మంటల వల్ల శవాలు భస్మం అయిపోయి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. శక్తివంతమైన లైట్లను వినియోగిస్తున్నప్పటికీ ఏమీ కనిపించడంలేదని, అయినా మిగతావారి కోసం అడుగడుగునా గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. 
 
 తమవారి కోసం ఎదురుచూపులు...
 సింధురక్షక్ ప్రమాదానికి గురైందన్న వార్త.. అందులోని 18 మంది సిబ్బంది కుటుంబసభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న అనేక మంది ముంబైకి చేరుకున్నారు. వీరికి సమాచారం అందించేందుకు అధికారుల నేతృత్వంలో ఫ్యామిలీ సెల్‌ను ఏర్పాటు చేశారు. నేవీ సిబ్బంది మృతి.. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా పేర్కొంటూ ముంబై పోలీసులు కేసు నమోదుచేశారు. జలాంతర్గామిలో పేలుడు ఘటన విద్రోహపూరిత చర్య అని చెప్పేందుకు ఆధారాలేమీ లభించలేదని నేవీ ప్రకటించింది.
 
 విచారణకు సహాయపడతామన్న రష్యా: సింధు రక్షక్ ప్రమాదంపై దర్యాప్తులో సహాయం చేస్తామని రష్యా తెలిపిం ది. సింధురక్షక్‌ను రష్యాలో ఇటీవలే ఆధునీకీకరించి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, నేవీ సిబ్బంది గాలింపు చర్యల్లో సాయపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు తెలిపాయి.
 
 రాష్ట్రపతి, విజయమ్మ సంతాపం: నేవీ సిబ్బంది మృతిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి మరణం బాధాకరమని, వారి కుటుంబాలకు ఈ విపత్తును తట్టుకునే స్థైర్యం కలగాలని ప్రార్థిస్తున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే జోషీకి పంపిన సందేశంలో పేర్కొన్నారు. నేవీ సిబ్బంది మృతి పట్ల వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అసువులుబాసిన రాష్ట్ర నావికులు తూతిక రాజేష్, దాసరి దుర్గాప్రసాద్, సీతారాం బాడపల్లె కుటుంబాలకు, ఇతర సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. - 
      
                   
                               
                   
            నావికుల మృతికి విజయమ్మ సంతాపం

 సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదంలో భారత నావికా దళానికి చెందిన 18 మంది సిబ్బంది మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్ర ఆవేదనను, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఈ దుర్ఘటనలో అసువులు బాసిన విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు యువ నావికుల తూతిక రాజేష్, దాసరి దుర్గాప్రసాద్ కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
 
 భారత నావికా దళంలో నావికులుగా పనిచేస్తూ దేశ సేవలో నిమగ్నమైవున్న ఈ యువకుల మృతితో వారి కుటుంబాలకే కాకుండా దేశానికి కూడా తీరని నష్టమని శుక్రవారం విడుదల చేసిన సంతాప సందేశంలో విజయమ్మ పేర్కొన్నారు. ఈ పెను విషాదాన్ని ఎదుర్కొవడానికి వారి కుటుంబాలకు తగినంత ఆత్మస్థైర్యం కలిగించాలంటూ ఆమె భగవంతుడిని కోరారు. 


