breaking news
helmet gift
-
రాఖీ కట్టండి.. హెల్మెట్ ఇవ్వండి
సాక్షి, సిటీబ్యూరో: రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరూ అక్కాచెల్లెళ్లు.. తమ అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టి హెల్మెట్ బహుమతిగా ఇవ్వాలని సిటీ సీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలను నివారించొచ్చని అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సిస్టర్ ఫర్ ఛేంజ్... గిఫ్ట్ ఎ హెల్మెట్’ అవగాహన ర్యాలీని ఆయన సోమవారం కమిషనర్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు జాగృతి సభ్యులను అభినందిస్తున్నానన్నారు. జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు విజయ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘సిస్టర్స్ ఫర్ ఛేంజ్’ చేపట్టిన ఎంపీ కవిత
హైదరాబాద్ : రక్షాబంధన్‌ను వినూత్నంగా జరుపుకోవాలంటూ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శనివారం ‘సిస్టర్స్ ఫర్ ఛేంజ్’ కార్యాక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘రాఖీ పండుగ సందర్భంగా అన్నకు రాఖీతో పాటు హెల్మెట్ బహుమతిగా ఇవ్వండి. హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారు. మా అన్నకు బైక్ లేదు కనుక హెల్మెట్‌తో పాటు బైక్ గిఫ్ట్‌గా ఇస్తా. కారులో సీటు బెల్ట్ కూడా పెట్టుకోమని చెబుతా.’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్నది ఊహాగానాలే అని ఎంపీ కవిత కొట్టిపారేశారు. కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ ఆరోపణలు పట్టించుకోనవసరం లేదని అన్నారు. కేటీఆర్‌పై ఆరోపణలు చేసేముందు ఆధారాలు చూపించాలన్నారు. ఇక నియోజకవర్గాలు పెంచకపోయినా టీఆర్ఎస్కు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. నాయకులను ఎలా సర్ధుబాటు చేయాలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు తెలుసన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో కేసీఆర్ నిర్ణయిస్తారన్నారు. అలాగే డ్రగ్స్, పేకాట, గుడుంబాను నిర్మూలించాల్సిందేనని, సినిమా పరిశ్రమను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని కవిత స్పష్టం చేశారు. కాగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేశంలోని సోదరులందరి సంక్షేమం కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ద్విచక్ర వాహన ప్రమాదాల్లో నిత్యం 400 మంది మరణించడం బాధాకరమంటూ, ప్రమాదాల బారి నుంచి సోదరులను కాపాడుకునేందుకు రాఖీ పండుగ సందర్భంగా సోదరులకు హెల్మెట్లను గిఫ్ట్‌గా ఇచ్చే కార్యక్రమంలో సోదరీమణులు కలిసిరావాలంటూ ఎంపీ కవిత గతంలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.