breaking news
contract electricity employees
-
అత్యవసర సేవపై ‘సమ్మెట’
విజయనగరం మున్సిపాలిటీ: ప్రాణాలకు తెగించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులు సమ్మె బాట పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీ మేరకు 20 ఏళ్లుగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశానుసారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో బుధవారం నుంచి సమ్మె చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 30వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలోకి వెళ్లగా... ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలోగల 800 మంది కార్మికులు విధులు బహిష్కరించారు. అంతేగాకుండా స్థానిక దాసన్నపేట విద్యుత్ భవనం ఎదుట తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టారు. సమ్మెలోకి వెళ్లిన వారిలో 133కేవీ, 33కేవీ, 220కేవీ సబ్స్టేషన్లలో విధులు నిర్వర్తించే కార్మికులతోపాటు పీక్ లోడ్ ఆపరేటర్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వాచ్ అండ్ వార్డ్ సిబ్బంది, టెన్‌మన్ గ్యాంగ్, మీటర్ రీడర్లు ఉన్నారు. విద్యుత్ సేవలపై ప్రభావం....! విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో 800 మంది కార్మికులు పనిచేస్తుండగా క్షేత్ర స్థాయిలో వీరి సేవలే ముఖ్యం. వీరంతా బుధవారం నుంచి సమ్మెలోకి వెళ్లడంతో విద్యుత్ సేవలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతానికి రెగ్యులర్ ఉద్యోగులతో సేవల్లో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. రాతపూర్వక హామీ ఇస్తేనే... కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం రాత పూర్వక హమీ ఇచ్చేంత వరకు సమ్మె విరమించేది లేదని కార్మికుల జిల్లా జేఏసీ కన్వీనర్ గోవిందరావు స్పష్టం చేశారు. అప్పటి వరకు శాంతియుత మార్గంలో విధులు బహిష్కరించి తమ నిరసన కొనసాగిస్తామన్నారు. స్థానిక దాసన్నపేట విద్యుత్ భవనం ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ కా ర్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వానికి, విద్యుత్ కంపె నీలకు వినతిపత్రాలతో పాటు సమ్మెనోటీసులు ఇచ్చామనీ, వారినుంచి సానుకూల స్పందన లే నందునే సమ్మె నిర్ణయం తీసుకున్నామన్నారు. తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు చేపడుతున్న సమ్మెకు రెగ్యులర్ ఉద్యోగులు మద్దతి వ్వాలని కోరారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ విద్యు త్ కార్మికుల జేఏసీ నాయకులు ఎన్.వెంకటఅప్పారావు, వి.సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. చర్చల పేరిట ప్రభుత్వ కాలయాపన విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను దశల వారీగా క్రమబద్ధీకరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులంతా కొన్నేళ్లుగా పోరుబాట పట్టారు. ప్రభుత్వం చర్చల పేరిట జేఏసీ నాయకులతో మాట్లాడటమే తప్ప సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హమీ, ప్రకటన చేయటం లేదు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయగా... మన రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమలులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండటంతో కార్మికులు భగ్గుమంటున్నారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించగా... రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి కళావెంకట్రావు జేఏసీ నాయకులను చర్చల పేరిట ఆహ్వానించటంతో బుధవారానికి వాయిదా వేశారు. మంగళవారం జరిగిన చర్చల్లో ప్రభుత్వం గడువు కోరటంతో ససేమిరా అన్న జేఏసీ నాయకులు విధులు బహిష్కరించి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. -
తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మెకు దిగేందుకు సిద్ధమైయ్యారు. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వడం కుదరదని డిస్కంలు తేల్చడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామని గతంలో రెండుసార్లు హామీ ఇచ్చిన డిస్కంలు ఆ తర్వాత పట్టించుకోలేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. -
15 అర్ధరాత్రి నుంచి కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల సమ్మె
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులు ఎన్నాళ్ల నుంచో డిమాండు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 18 వేల నుంచి 20 వేల మంది వరకు కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు ఉన్నారు. ఇన్నాళ్లుగా పనిచేస్తున్నా, తమకు ఉద్యోగ భద్రత మాత్రం లేదని వారు వాపోతున్నారు. కాగా, కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేసింది.