breaking news
Britain visas
-
‘స్టార్టప్స్‌తో భాగస్వామ్యాలకు బ్రిటన్ సంస్థల ఆసక్తి’
(ఆర్. దిలీప్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సాక్షి): భారతీయులకు లభించే బ్రిటన్ వీసాలు పెరిగి భారత్–యూకే వ్యాపార, విద్య, సాంస్కతిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాల లక్ష్యంతో సరిగ్గా ఏడాది కింద రెండు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందపు కార్యాచరణ ప్రారంభమైందని భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ అశ్క్విత్ తెలిపారు. మరిన్ని వీసాల లభ్యత, సాంకేతిక క్లస్టర్ల ఏర్పాటు వంటివి ఈ దిశలో ఒక ముందడుగు కాగలవని ఆయన పేర్కొన్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం(ఐటీ)లో ఇప్పటికే ఇక్కడున్న చొరవ దష్ట్యా, ఈ భాగస్వామ్యాన్ని మరింత ఫలవంతం చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాలు క్రియాశీల పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన అశ్క్విత్ తనను కలిసిన పాత్రికేయులతో కాసేపు ఇష్టాగోష్ఠి జరిపారు. ఏడాది కిందట భారత ప్రధాని నరేంద్ర మోదీ లండన్ పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో ఈ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే! సాంకేతిక సహకారం–వాణిజ్య విస్తరణతో ఉభయదేశాల పరస్పర ప్రయోజనం ఇందులో ప్రాధాన్యత అంశమని అశ్క్విత్ అన్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఆధునిక రవాణా వ్యవస్థల ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యాల్ని భారత్‌లో విస్తరించడానికి ఇప్పటికే బ్రిటన్ వ్యాపార–వాణిజ్య సంస్థలు సంసిద్దంగా ఉన్నాయన్నారు. తాము కాల్టెక్ హబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా, ఇక్కడ వినూత్న తరహాలో వచ్చిన అంకుర సంస్థల(స్టార్టప్స్)తో భాగస్వామ్యాలకు బ్రిటన్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. దక్షిణాదిలో హైదరాబాద్ మరింత ప్రయోజనకారి కాగలదని అంచనా వేశారు. బ్రిటన్ నైపుణ్యాల్ని, సాంకేతిక సహకారాన్ని గరిష్టంగా వినియోగించుకునేలా ఇక్కడి అంకుర సంస్థలతో అనుసంధానించే నైపుణ్య మానవవనరుల్ని సమకూర్చడం ద్వారా తెలంగాణ ‘టీ–హబ్’ కీలకపాత్రదారి కానుందన్నారు. చమురు కోసం సముద్ర గర్భాన్ని తొలిచే సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో బ్రిటన్ కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో చమురు–సహజవాయు రంగంలో పనిచేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విద్య–ఉద్యోగ రంగంలోనూ పెరగనున్న వీసాలు ఐరోపా సంఘం (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగుతున్న నేపథ్యంలో కొత్త వలసల విధానం రూపుదిద్దుకుంటోందన్నారు. దాంతో, భాగస్వామ్య వృద్ధిలో, విద్య–ఉద్యోగావశాల్లో భారత్ వంటి దేశాలకు మున్ముందు చక్కని అవకాశాలుంటాయని హైకమిషనర్ అశ్క్విత్ అన్నారు. ఐటీ, వైద్య రంగంలో భారత్ ధృడంగా ఉందని పేర్కొన్నారు. భారత్ నుంచి యూకేలో ఉన్నత విద్యకు వెళ్లే వారిప్పుడు 37 శాతం పెరిగారన్నారు. గత సంవత్సరం ఈ వద్ధి రేటు 17 శాతమన్నారు. ప్రతి 10 మందిలో 9 మంది విద్యార్థులకు వీసాలు లభించే పరిస్థితి ఉందన్నారు. యూకే విశ్వవిద్యాలయాల సామర్థ్యాన్ని భారత విద్యార్థులు గరిష్టంగా వినియోగించుకోవాలన్నదే తమ కోరికని, పెరుగుతున్న సంఖ్య దానికి నిదర్శనమని పేర్కొన్నారు. వాణిజ్య, విద్యా, ఉద్యోగ వీసాల్లో వృద్ధి వల్ల బ్రిటన్ సందర్శించే భారతీయుల సంఖ్య పెరుగుతుందని, ఇది పరస్పర వాణిజ్య, సాంస్కతిక సంబంధాల్ని మెరుగుపరుస్తుందన్నారు. రానున్న క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా కూడా బ్రిటన్‌కు భారతీయ సందర్శకులు పెరుగుతారన్నారు. 2018లో భారత్‌కు చెందిన నైపుణ్యంగల ఉద్యోగులు–సిబ్బందికి 55,000 బ్రిటన్ వీసాలు లభించాయని, మిగతా అన్ని దేశాలకు కలిపి దాదాపు ఇన్నే లభించాయని గుర్తు చేశారు. -
నేర చరిత్ర పరిశీలించాకే బ్రిటన్ వీసాలు
లండన్: బ్రిటన్‌లో పనిచేయాలనుకునే ఉపాధ్యాయులు, నర్సులు, సామాజిక కార్యకర్తలు టైర్–2 వీసాకు దరఖాస్తు సమయంలో వారిపై ఎలాంటి నేరచరిత్ర లేదని చూపే పత్రాల్ని తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. నాన్ ఈయూ దేశాలకు వర్తించే ఈ నిబంధనను ఏప్రిల్ నుంచి అమల్లోకి తేవాలని బ్రిటన్ భావిస్తుంది. అందుకనువుగా త్వరలో పార్లమెంట్ ఆమోదానికి పంపనుంది. అలాగే చిన్నారులు, అనారోగ్యంతో ఉన్న పెద్దలకు సేవ చేయాలని వచ్చేవారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. గత పదేళ్లుగా నివసిస్తున్న దేశంలో వారిపై ఎలాంటి నేర చరిత్ర లేదని అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని వీసా దరఖాస్తు సమయంలో సమర్పించాలి. -
బ్రిటన్ విద్యార్థి వీసాల ఆశలు ఆవిరి!
టోఫెల్, టోయిక్ పరీక్షలు ఇకపై ఈటీఎస్ నిర్వహించదు న్యూఢిల్లీ: విద్యార్థుల వీసా ఆశలపై నీళ్లు చల్లేలా బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. యూకేలో వీసాల జారీకి సంబంధించి టోఫెల్, టోయిక్ పరీక్షలను ఇకపై ఈటీఎస్(ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్) నిర్వహించడం లేదని ప్రకటించింది. టోయిక్(టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ ఫర్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్) అక్రిడేషన్ కోసం విద్యార్థులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నట్లు ఇటీవల బీబీసీలో కథనం వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈటీఎస్‌తో తమ కాంట్రాక్టు పొడిగించబోమని బ్రిటన్ హోంశాఖ తెలిపింది. ఈటీఎస్ పరీక్షలకు హాజరయ్యే వారు హోం శాఖ ఆమోదించిన ఇతర ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని యూకే అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల మండలి సూచించింది. సహాయం కోసం సంబంధిత విద్యాసంస్థల సలహాదారులను సంప్రదించాలని పేర్కొంది.