వనపర్తి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు కీలకం కానుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ మండల అఽధ్యక్షుడు మాణిక్యం అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వివరించారు. పార్టీ పట్ల విధేయత, నాయకుడి పట్ల విశ్వాసం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. నియోజక వర్గంలో మెజార్టీ సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భానుప్రకాష్‌రావు, విజయ్‌కుమార్, మతీన్, రఘువర్ధన్ రెడ్డి, రవిప్రకాష్‌రెడ్డి, ధర్మానాయక్, మాదవరెడ్డి, నందిమల్ల అశోక్, నరసింహ, టీక్యా నాయక్, చిట్యాల రాము, ధర్మశాస్త్రి, కృష్ణా నాయక్, మోతిలాల్‌నాయక్ పాల్గొన్నారు.
చిన్నారుల ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి
వనపర్తి రూరల్: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఎదుగుదలపై అంగన్‌వాడీ టీచర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీడీపీఓ హజీరాబేగం సూచించారు. పోషణ మాసం సందర్భంగా సోమవారం మండలంలోని చిమనగుంటపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. బరువు తక్కువగా ఉన్న చిన్నారులను గుర్తించి వారి ఎదుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పౌష్టికాహారం అంధించడంతో పాటు వారు తీసుకుంటున్న ఆరోగ్య జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. గర్భిణులకు రక్తహీనతపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు.
సుప్రీంకోర్టు సీజేఐపై దాడి హేయమైన చర్య
గద్వాల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై సోమవారం కోర్టుహాలులో జరిగిన దాడి హేయమైన చర్య అని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రజాసంఘాలు, దళిత, ఉపాధ్యాయ, బహుజన సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్‌చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఓ కేసు విచారణలో జరుగుతున్న వాదనల క్రమంలో ఓ మతాన్ని వంటపట్టించుకున్న ఓ మతోన్మాది అయిన న్యాయవాది దేశంలోనే అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించడం క్షమించరానిదని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు. దాడికి యత్నించిన న్యాయవాదిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్, వాల్మీకి, హనుమంతు, ప్రభాకర్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, పల్లయ్య, రాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పు కీలకం